‘బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు’
అనంతపురం టౌన్ : బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం టీడీపీ పోరాడుతోందన్నారు. కాపుల రిజర్వేషన్ విషయంలో వెనుకబడిన తరగతులకు చెందిన మేథావులు, సంఘాల నాయకులు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈ అంశాలను అధ్యయనం చేసేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడున్న బీసీ సామాజికవర్గాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందో కమిషన్ సిఫార్సు చేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీలో 54 నుంచి 56 శాతం బీసీలు ఉన్నారన్నారు. రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో వారికి రావాల్సిన వాటా ఇంకా రాలేదన్నారు.
దాన్ని భర్తీ చేసేందుకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు స్పష్టమైన హామీలు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు రిజర్వేషన్ అనుభవిస్తున్న వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపులకు న్యాయం చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. టీడీపీ బీసీ వర్గాల ప్రతినిధులుగా బీసీల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు.
కొన్ని అసాంఘిక శక్తులు, దుష్టరాజకీయ పార్టీలు బీసీల మధ్య చిచ్చపెడుతున్నాయని విమర్శించారు.వాల్మీకి సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఎస్టీలుగా పునరుద్ధరణ కోరుతోందని, వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నార ని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.