divya darshan
-
మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు..
గ్రేటర్ నోయిడా: బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నోయిడాలో నిర్వహించిన "దివ్య దర్బార్"కు భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో బ్యారికేడ్లు దాటుకుని వచ్చిన మహిళను అక్కడి బౌన్సర్లు ఎత్తి అవతల పారేశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో అక్కడే ఉండి చోద్యం చూస్తోన్న ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తూ నోయిడా పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాదిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి విశేష ఆదరణ ఉంది. ఆయన ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే భక్తులు అశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. అలాగే నోయిడాలో నిర్వహించిన దివ్యదర్బార్ కార్యక్రమానికి కూడా సభాప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. సగం కార్యక్రమం పూర్తైనా అప్పటికింకా భక్తులు సభాస్థలికి వస్తుండడంతో వారిని ఇంటికి వెళ్లి లైవ్ లో కార్యక్రమాన్ని చూడవలసిందిగా వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ధీరేంద్ర కృష్ణ ప్రవచనాలు చెబుతున్న సమయంలో ఒక మహిళ బ్యారికేడ్లు దాటుకుని స్టేజి వద్దకు దూసుకుని వెళ్లగా అక్కడ ఉన్న వాలంటీర్లు ఆమెను అలానే ఎత్తి జనంలోకి విసిరేశారు. అక్కడే ఉన్న ఎస్సై రామ శంకర్ వారిని వారించకుండా నిల్చుని చూస్తుండడం వీడియోలో రికార్డయ్యింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో సదరు ఎస్సై ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నోయిడా పోలీసు శాఖ. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన వాలంటీర్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. धीरेंद्र शास्त्री के दरबार मे धीरेंद्र शास्त्री के बाउंसरों ने कूड़े की तरह लड़की को उठाकर बैरिकेडिंग के पार फेंका#GreaterNoida #BageshwarDhamSarkar #DhirendraKrishnaShastri #TIME8 pic.twitter.com/I71daxELpU — TIME8 (@TIME8News) July 13, 2023 ఇది కూడా చదవండి: సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. -
ఏప్రిల్ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు
సాక్షి, తిరుమల: భక్తుల కోరిక మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ► ఏప్రిల్ 15 నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300/` దర్శన టికెట్లు తగ్గించనున్నారు. ► ఈ మూడు నెలల పాటు వీఐపీలు సిఫారసు లేఖలను తగ్గించేలా చూడటం. ► ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్ పెయింట్. ► తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగింది. ► మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్, పిఏసి`2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం. ► అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచడం. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు. ► ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు. ► భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ. ► టీటీడీ విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడటం. ► శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించడం. చదవండి: ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు.. సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం -
కాలిబాట దివ్యదర్శనం గోవిందా
-
కాలిబాట దివ్యదర్శనం గోవిందా
- కాలిబాట దివ్యదర్శనం రద్దు - టీటీడీ ఉత్తర్వులు సాక్షి, తిరుమల: శ్రీవారి కాలిబాట దివ్యదర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం మంగళం పలికింది. భక్తుల సంఖ్య పెరగడంతో వారాంతంలో దివ్యదర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కాగా నడకదారి భక్తులకు ఉచిత ప్రసాదం అందచేస్తామని జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. చేతులెత్తేసిన అధికారులు కాలిబాటల్లో నడిచి తిరుమలకు చేరుకుని, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు చాంతాడంత క్యూలైన్లలో వేచి ఉంటూ అవస్థలు పడుతున్నారు. కాలిబాటల్లో వచ్చిన తమను గాలికొదిలేస్తారా.. అంటూ టీటీడీ అధికారులపై వారు మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ గుర్తించింది. కాలిబాట, సర్వదర్శనం, రూ.300 టికెట్ల దర్శనాలు ఏకకాలంలో అమలు చేయడంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో రద్దీ ఉండే రోజుల్లో అంటే.. శుక్ర, శని, ఆదివారాల్లో కాలిబాట దర్శనాన్ని టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. లడ్డూల సరఫరాలో ఇక్కట్లు టీటీడీపై శ్రీవారి లడ్డూల భారం ఏటా సుమారు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకూ పడుతోందని లెక్కలు కట్టారు. శ్రీవారి ఆలయపోటులో రోజూ మూడు లక్షల లడ్డూలు మాత్రమే తయారు చేసే అవకాశం, పరిధి ఉంది. ఒక రోజు కాలిబాటలో 50 వేల మంది భక్తులు నడిచివస్తే ఒక్కొక్కరికి ఐదు లడ్డూల చొప్పున 2.5 లక్షల లడ్డూలు సరఫరా చేయాల్సి ఉంది. ఇక సర్వదర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, ఆర్జిత సేవల భక్తులకు లడ్డూల సరఫరాలో టీటీడీ తీవ్ర ఇబ్బంది పడుతోంది. అందువల్లే క్రమంగా కాలిబాట భక్తుల దర్శనానికి మంగళం పలికేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
దివ్యదర్శనం ప్రారంభం
– తొలిసారిగా 110 మంది భక్తులకు అవకాశం కర్నూలు (న్యూసిటీ): దివ్యదర్శనం కార్యక్రమాన్ని సోమవారం కర్నూలు సప్తగిరి నగర్‌లోని మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర దర్శనం పాప నాశనం అన్నారు. దివ్యదర్శనం భక్తులకు బస, ఆహారం వసతులను దేవాదాయ శాఖ ఉచితంగా కల్పిస్తుందన్నారు. ఏడాదిలో పదివేల మంది భక్తులకు ఈ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. దివ్యదర్శనానికి వెళ్లే భక్తుల్లో రోగులు ఉంటే మందులను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. కర్నూలు నుంచి నాలుగు ఆర్టీసీ బస్సులో 110 మంది భక్తులు తరలి వెళ్లారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఉప కమిషనర్ బి.గాయత్రిదేవి, సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి , శ్రీమణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన కార్యదర్శి ఇ.మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెప్పపై విహరించిన అమ్మవారు
తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం సాయంత్రం పద్మావతి అమ్మవారు తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజ స్వామికి తెప్పోత్సవం నిర్వహించారు. మూడవ రోజు నుంచి పద్మావతి అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇందు లో భాగంగా మంగళవారం అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు నీరాడ మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. వేదపారాయణం, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. రాత్రి 7.30 గంటలకు సర్వాంగ శోభితురాలైన పద్మావతి అమ్మవారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెం డెంట్లు కేపీ.వెంకటరత్నం, ధర్మ య్య, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయు లు, ఏవీఎస్వో రామకృష్ణ, వీఐ వెంకటరత్నం పాల్గొన్నారు. నేడు గజవాహన సేవ తెప్పోత్సవంలో భాగంగా 4వ రోజైన బుధవారం రాత్రి 8.30 గంటలకు పద్మావతి అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం అమ్మవారు పుష్కరిణిలో తెప్పపై ఊరేగనున్నారు. -
వారాంతంలో దివ్యదర్శనానికి బ్రేక్!
30నుంచి ప్రయోగాత్మక పరిశీలన సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనం కోసం రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలిబాట మార్గాల్లో నడచివచ్చే వారికి అందజేసే దివ్యదర్శనం టికెట్లను శ ని, ఆదివారాల్లో రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని టీటీడీ తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆదివారం ఆయన కాలిబాట క్యూలను సందర్శించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల క్రితం రోజుకు ఐదువేల మందితో ప్రారంభమైన దివ్యదర్శనం ప్రస్తుతం సరాసరిగా 30 వేలు దాటుతోందన్నారు. వీరు స్వామిని దర్శించుకునేందుకు 14 నుంచి 18 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ఈ దివ్యదర్శనం క్యూల వల్ల కంపార్ట్మెంట్లలో వేచి ఉండే సర్వదర్శనం, రూ. 300 టికెట్ల దర్శనం, ఆర్జిత సేవలు, ఇతర దర్శనాల అమలుకు తీవ్ర ఆటంకం కలగటంతోపాటు వేచి ఉండే సమయం మరింత పెరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో దివ్యదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున కనీసం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు దివ్యదర్శనం టికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసి తిరిగి సోమవారం వేకువజాము నుంచి ఇస్తామన్నారు. వచ్చేవారం నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తిరుమలలోని నిత్యాన్నదాన భవన సముదాయంలో రోజుకు 56 వేల మందికి, వెలుపల క్యూలలో భక్తుల కు సాంబారు అన్నం, పెరుగన్నంతోపాటు కాఫీ, టీ, పాలు అందజేస్తున్నామన్నారు. సర్వదర్శనానికి 30 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా భక్తులతో నిండిన క్యూలే కనిపిస్తున్నాయి. ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 53,023 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండటంతో పాటు వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. వీరికి 30 గంటల తర్వాత దర్శనం లభిస్తుందని టీటీడీ ప్రకటించింది. ఆదివారం కూడా అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో భక్తులు 30 వేలకుపైగా తరలివచ్చారు. క్యూలలో వేచి ఉన్న భక్తులకు 19 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ కారణంగా రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 10 గంటలకే నిలిపి వేశారు. ఇక గదుల విషయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.