కాలిబాట దివ్యదర్శనం గోవిందా
కాలిబాట దివ్యదర్శనం రద్దు
Published Wed, Jun 28 2017 9:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM
- కాలిబాట దివ్యదర్శనం రద్దు
- టీటీడీ ఉత్తర్వులు
సాక్షి, తిరుమల: శ్రీవారి కాలిబాట దివ్యదర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం మంగళం పలికింది. భక్తుల సంఖ్య పెరగడంతో వారాంతంలో దివ్యదర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కాగా నడకదారి భక్తులకు ఉచిత ప్రసాదం అందచేస్తామని జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.
చేతులెత్తేసిన అధికారులు
కాలిబాటల్లో నడిచి తిరుమలకు చేరుకుని, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు చాంతాడంత క్యూలైన్లలో వేచి ఉంటూ అవస్థలు పడుతున్నారు. కాలిబాటల్లో వచ్చిన తమను గాలికొదిలేస్తారా.. అంటూ టీటీడీ అధికారులపై వారు మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ గుర్తించింది. కాలిబాట, సర్వదర్శనం, రూ.300 టికెట్ల దర్శనాలు ఏకకాలంలో అమలు చేయడంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో రద్దీ ఉండే రోజుల్లో అంటే.. శుక్ర, శని, ఆదివారాల్లో కాలిబాట దర్శనాన్ని టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
లడ్డూల సరఫరాలో ఇక్కట్లు
టీటీడీపై శ్రీవారి లడ్డూల భారం ఏటా సుమారు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకూ పడుతోందని లెక్కలు కట్టారు. శ్రీవారి ఆలయపోటులో రోజూ మూడు లక్షల లడ్డూలు మాత్రమే తయారు చేసే అవకాశం, పరిధి ఉంది. ఒక రోజు కాలిబాటలో 50 వేల మంది భక్తులు నడిచివస్తే ఒక్కొక్కరికి ఐదు లడ్డూల చొప్పున 2.5 లక్షల లడ్డూలు సరఫరా చేయాల్సి ఉంది. ఇక సర్వదర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, ఆర్జిత సేవల భక్తులకు లడ్డూల సరఫరాలో టీటీడీ తీవ్ర ఇబ్బంది పడుతోంది. అందువల్లే క్రమంగా కాలిబాట భక్తుల దర్శనానికి మంగళం పలికేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Advertisement