వారాంతంలో దివ్యదర్శనానికి బ్రేక్! | TTD may do away with Divya Darshan tokens during weekends | Sakshi
Sakshi News home page

వారాంతంలో దివ్యదర్శనానికి బ్రేక్!

Published Mon, May 26 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

TTD may do away with Divya Darshan tokens during weekends

30నుంచి ప్రయోగాత్మక పరిశీలన

 సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనం కోసం రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలిబాట మార్గాల్లో నడచివచ్చే వారికి అందజేసే దివ్యదర్శనం టికెట్లను శ ని, ఆదివారాల్లో రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని టీటీడీ తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆదివారం ఆయన కాలిబాట క్యూలను సందర్శించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల క్రితం రోజుకు ఐదువేల మందితో ప్రారంభమైన దివ్యదర్శనం ప్రస్తుతం సరాసరిగా 30 వేలు దాటుతోందన్నారు. వీరు స్వామిని దర్శించుకునేందుకు 14 నుంచి 18 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ఈ దివ్యదర్శనం క్యూల వల్ల కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే సర్వదర్శనం, రూ. 300 టికెట్ల దర్శనం, ఆర్జిత సేవలు, ఇతర దర్శనాల అమలుకు తీవ్ర ఆటంకం కలగటంతోపాటు వేచి ఉండే సమయం మరింత పెరుగుతోందన్నారు.
 
 రానున్న రోజుల్లో దివ్యదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య  మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున కనీసం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు దివ్యదర్శనం టికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసి తిరిగి సోమవారం వేకువజాము నుంచి ఇస్తామన్నారు. వచ్చేవారం నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తిరుమలలోని నిత్యాన్నదాన భవన సముదాయంలో రోజుకు 56 వేల మందికి, వెలుపల క్యూలలో భక్తుల కు సాంబారు అన్నం, పెరుగన్నంతోపాటు కాఫీ, టీ, పాలు అందజేస్తున్నామన్నారు.
 
 సర్వదర్శనానికి 30 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా భక్తులతో నిండిన క్యూలే కనిపిస్తున్నాయి.  ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 53,023 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండటంతో పాటు వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. వీరికి 30 గంటల తర్వాత దర్శనం లభిస్తుందని టీటీడీ ప్రకటించింది. ఆదివారం కూడా అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో భక్తులు 30 వేలకుపైగా తరలివచ్చారు. క్యూలలో వేచి ఉన్న భక్తులకు 19 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది.  రద్దీ కారణంగా రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 10 గంటలకే నిలిపి వేశారు. ఇక గదుల విషయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement