తెప్పపై విహరించిన అమ్మవారు
తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం సాయంత్రం పద్మావతి అమ్మవారు తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజ స్వామికి తెప్పోత్సవం నిర్వహించారు. మూడవ రోజు నుంచి పద్మావతి అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇందు లో భాగంగా మంగళవారం అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు.
మధ్యాహ్నం 3 గంటలకు నీరాడ మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. వేదపారాయణం, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. రాత్రి 7.30 గంటలకు సర్వాంగ శోభితురాలైన పద్మావతి అమ్మవారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెం డెంట్లు కేపీ.వెంకటరత్నం, ధర్మ య్య, ఆర్జితం, ప్రసాదం ఇన్‌స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయు లు, ఏవీఎస్‌వో రామకృష్ణ, వీఐ వెంకటరత్నం పాల్గొన్నారు.
నేడు గజవాహన సేవ
తెప్పోత్సవంలో భాగంగా 4వ రోజైన బుధవారం రాత్రి 8.30 గంటలకు పద్మావతి అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం అమ్మవారు పుష్కరిణిలో తెప్పపై ఊరేగనున్నారు.