ముంబై-సిటీ మధ్య నేర బంధం
హైదరాబాద్ : ముంబై-హైదరాబాద్ మధ్య నేరబంధం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి వారిపై అక్కడ... అక్కడి వారిపై ఇక్కడ వరుస నేరాలు జరుగుతున్నాయి. ఈ తరహాకు చెందిన ఉదంతాలు గత 15 రోజుల్లోనే మూడు చోటు చేసుకున్నాయి. ఓ అనుమానాస్పద మృతి, మరో లైంగికదాడి, ఇంకో హత్య... ఇలా ఈ మూడూ యువతులకు సంబంధించినవే. వాటిని ఓసారి పరిశీలిస్తే...
వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన ఎంబీ శ్రీనివాస్, రుక్మిణిల కుమార్తె దివ్య మాచిరాజు గత ఏడాది అక్టోబర్ 17న ముంబై వెళ్లారు. అక్కడి జస్లోక్ ఆస్పత్రిలో అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తున్నారు. ఈ నెల 2న అనుమానాస్పద స్థితిలో హాస్టల్ రూమ్‌లో మరణించారు. ఇది ఆత్మహత్య అని అక్కడి పోలీసులు చెప్తుండగా... తమ కుమార్తెది హత్యే అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో దివ్య స్నేహితుడిని ముంబై పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్నారు.
మోడల్‌పై సామూహిక లైంగికదాడి
ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన మోడల్‌పై నగరంలో సామూహిక లైంగిక దాడి జరిగింది. ‘న్యూ ఇయర్’ ఈవెంట్ పేరుతో ఆమెను సిటీకి తీసుకువచ్చిన ఐదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఈ ఘాతుకం చోటు చేసుకోగా... జనవరి ఏడున ముంబైలోని వెర్సోవా ఠాణాలో కేసు నమోదైంది. సిటీకి బదిలీ కావడంతో తొమ్మిదిన సీసీఎస్ అధికారులు రీ-రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పటికి ఐదుగురు అరెస్టు అయ్యారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణహత్య
ముంబైలోని టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న మచిలీపట్నం వాసి ఎస్తేర్ అనూహ్య ముంబైలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ నెల 4న విజయవాడ నుంచి బయలుదేరి ఐదున మిస్ అయిన అనూహ్య మృతదేహం గురువారం అక్కడి బందూప్ ప్రాంతంలో బయపడింది. ఈమె సమీప బంధువులు నగరంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తుండటం, మృతదేహం విమానంలో సిటీకి రావడంతో ఇక్కడా కలకలం రేగింది.