రంగంలోకి పీయూష్
రేపు చెన్నైకు రాక
కమలనాథులతో మంతనాలు
అన్భుమణి, కెప్టెన్లతో భేటీకి నిర్ణయం
సాక్షి, చెన్నై: జవదేకర్ రాయబారం ఫలితం ఇవ్వని దృష్ట్యా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రంగంలోకి దిగనున్నారు. పొత్తు కసరత్తుల నిమిత్తం శుక్రవారం పీయూష్ చెన్నైకు రానున్నారు. కమలనాథులతో మంతనాలతో పాటుగా పీఎంకే అన్భుమణి, డీఎండీకే విజయకాంత్లతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం బీజేపీ తీవ్ర కుస్తీలు పడుతున్న విషయం తెలిసిందే. అక్కున చేర్చుకునే వాళ్లు కరువు అవుతోండడంతో ఎక్కడ ఒంటరిగా మిగలాల్సి వస్తుందేమోన్న బెంగ కమలనాథు ల్లో బయల్దేరింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా, గతంలో వలే తమకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు వ్యవహరించిన పక్షంలో జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఆందోళన నెలకొని ఉంది. దీంతో ఎలాగైనా పొత్తు పదిలం చేయడం లక్ష్యంగా కమలం పెద్దలు రంగంలోకి దిగి ఉన్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ రంగంలోకి దిగారు. డీఎండీకే, ఎస్‌ఎంకేలతో పాటుగా పలు చిన్న పార్టీల నాయకులతో మంతనాలు జరిపారు. అయితే, ఫలితం శూన్యం.
జవదేకర్ రాయబారం ఫలితాన్ని ఇవ్వని దృష్ట్యా, ఇక, ఆయన్ను పక్కన పెట్టి కేంద్ర విద్యుత్ శాఖమంత్రి పీయూష్ గోయల్‌ను రంగంలోకి దించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిద్ధం అయ్యారు. తొలి విడత పర్యటన ముగించుకుని, రెండో విడతగా గురువారం చెన్నైకు రావాల్సిన జవదేకర్ స్థానంలో పీయూష్ ఇక్కడ అడుగు పెట్టనున్నారు. అయితే, ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం పీయూష్ చెన్నైకు రాబోతున్నారు. జవదేకర్ రాయబారంలో సాగిన అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, ఎత్తుకు పైఎత్తు వేయడం లేదా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రచించి ఇచ్చిన వ్యూహాన్ని అమలు చేయడానికి పీయూష్ రంగంలోకి దిగనున్నారని కమలనాథులు పేర్కొంటున్నారు.
శుక్రవారం ఇక్కడకు వచ్చే ఆయన రెండు రోజుల పాటుగా పార్టీ వర్గాలతో సమాలోచనలు, ఎన్నికల వ్యవహారాలపై సమీక్షలు సాగించబోతున్నట్టు చెబుతున్నారు. అలాగే డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటకి నిర్ణయించి ఉన్నట్టు పేర్కొంటున్నారు. పీఎంకే అధినేత రాందాసుతో భేటీకి ఇది వరకు జవదేకర్ప్రయత్నించి, విఫలం అయ్యారని చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతం రాందాసు తనయుడు, పీఎంకే సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసుతో భేటీకి పీయూష్ నిర్ణయించి ఉండడం గమనించాల్సిన విషయం. జవదేకర్ తరహాలో పీయూష్ రాయబారం సైతం బెడిసి కొట్టిన పక్షంలో చివరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగుతారేమో!