మాలో కళంకితులెవరూ లేరు!
వసుంధర రాజేకు బాసటగా నిలవాలని బీజేపీ నిర్ణయం!
* రాజే సంతకం ఉన్న డాక్యుమెంట్ ప్రామాణికతపై బీజేపీ అనుమానం
* ముఖ్యమంత్రి రాజీనామా వార్తలు అసత్యమన్న రాజస్తాన్ సీఎంఓ
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు బాసటగా నిలవాలని, ఆమె రాజీనామా చేయాలన్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఒత్తిడికి తలొగ్గకూడదని కేంద్రం, బీజేపీ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. వసుంధర రాజే సంతకంతో పాటు బయటపడిన లలిత్‌మోదీ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్‌పైనా బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది.
ఆమె సంతకం ఉన్న ఆ డాక్యుమెంట్లో ఉన్న సమాచారమేంటో కచ్చితంగా తెలియదని పేర్కొంది. ‘రాజె విషయంలో అక్రమం జరిగింది ఎక్కడ? ఆ డాక్యుమెంట్ ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంది. ఆమె(రాజె) ఏదైనా కోర్టు ముందు కానీ, జడ్జి ముందు కానీ సాక్ష్యం ఇచ్చారా? బ్రిటన్ ప్రభుత్వం ఈ విషయంపై ఏమైనా ప్రకటన చేసిందా?’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా గురువారం ప్రశ్నించారు. ‘మా వద్ద కళంకితులెవరూ లేరంటూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత నిజాయితీతో, పారదర్శకంగా పాలన సాగిస్తోందని మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి వసుంధర రాజే రాజీనామా వార్తలను రాజస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. రాజేను రాజీనామా చేయమని పై నుంచి ఆదేశాలు వచ్చాయన్న వార్తలు అసత్యమని స్పష్టం చేసింది. స్థానిక వార్తాచానళ్లు రాజే ఇమేజ్ను దెబ్బతీసే లక్ష్యంతో అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని గురువారం విడుదల చేసిన రెండు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొంది. తనపై ఎలాంటి చర్య తీసుకోకుండా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యేలతో రాజే సమావేశం ఏర్పాటు చేశారన్నది అలాంటి అసత్య కథనమేనని తెలిపింది.
కాగా, లలిత్ మోదీ ఇమిగ్రేషన్ దరఖాస్తును సమర్ధిస్తూ తాను సంతకం చేసిన విషయం వాస్తవమేనని పార్టీ నాయకత్వానికి వసుంధర రాజే తెలిపినట్లు సమాచారం. ఈ విషయంపై ఆమె వివరణ ఇచ్చారని పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇదిలా ఉండగా, నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, వసుంధర రాజే, ప్రస్తుత హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ జూలై 20, 2011లో లండన్‌లోని ఒక హోటల్లో దిగిన ఫొటో తాజాగా తెరపైకి వచ్చింది. అప్పుడు బీజేపీకి విదేశాల్లో మద్దతు కూడగట్టేందుకు లండన్ వెళ్లిన బీజేపీ బృందంలో వసుంధర కూడా ఉన్నారు. అయితే, ఆమె ఆ బృందంతో పాటు భారత్ తిరిగిరాకుండా, లలిత్ మోదీకి సాయం చేసేందుకు మరికొన్ని రోజులు లండన్‌లోనే ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
విపక్ష అస్త్రాలు మరింత పదును
లలిత్ మోదీ ఇమిగ్రేషన్ దరఖాస్తుకు సంబంధించి వసంధర రాజే సంతకం చేసినట్లుగా చెబుతున్న డాక్యుమెంట్ సైతం బయటపడటంతో విపక్ష కాంగ్రెస్ తన అస్త్రాలను మరింత పదునెక్కించింది. రాజే రాజీనామా చేయనట్లైతే.. రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనీయబోమని గురువారం మరోసారి హెచ్చరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మహిళానేతలు సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, స్మృతి ఇరానీ, పంకజ ముండేలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఆప్ లు ఢిల్లీలో ధర్నా నిర్వహించాయి. సామాన్యులకో చట్టం, బీజేపీ నేతలకో చట్టం ఉండదని, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ డిమాండ్ చేశారు.
మన్మోహన్ మౌని అయితే.. మోదీ మహా మౌని: దిగ్విజయ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌన ప్రధాని అయితే, ప్రస్తుత ప్రధాని మోదీ మహా మౌని అని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘ప్రతీ చిన్న విషయానికి తక్షణమే ట్వీట్లు వదిలే మోదీ.. ఇంత సీరియస్ ఆరోపణలపై మౌనంఎందుకు పాటిస్తున్నారు?. ఆయన నల్లధనంపై మాట్లాడరు. పాక్, చైనాల దుందుడుకుతనంపై మాట్లాడరు. సున్నితమైన అంశాలపై ట్వీట్లు చేయరు. ఆయన ప్రభుత్వ విధానం యోగా. యోగా చేయండి. అన్నీ మర్చిపోండి అన్నట్లుగా ఉంది ఆయన తీరు’ అని ధ్వజమెత్తారు.