dollar demand
-
రూపాయికి తిప్పలే, 2023 మార్చి నాటికి 77.5కి రూపాయి పతనం!
ముంబై: భారత్ కరెన్సీ రూపాయి విలువ డాలర్ మారకంలో 2023 మార్చి నాటికి 77.5కు బలహీనపడుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక ఇంధన ధరలతో పెరగనున్న కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక నిల్వల మధ్య నికర వ్యత్యాసం), అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు వల్ల క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ (విదేశీ నిధులు దేశం నుంచి వెనక్కు మళ్లడం) వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తొలినాళ్లలో జరిగిన ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో 2022 మార్చి8వ తేదీన రూపాయి విలువ 77 కనిష్ట స్థాయిలో ముగియగా, ఇంట్రాడేలో 77.05 స్థాయినీ చూసింది. నివేదిక ప్రకారం... రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫారెక్స్ మార్కెట్లో తన జోక్యాన్ని కొనసాగిస్తుంది. 630 బిలియన్ డాలర్లకుపైగా 12 నెలలకు సరిపడా పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలను భారత్ కొనసాగిస్తుండడమే దీనికి కారణం. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ‘ఆర్బీఐ జోక్యం’ కొంత నివారించవచ్చు. ►ఫెడ్ ఫండ్ రేటును బుధవారం 25 పైసలు పెంచిన (0.25–0.50 శాతం) సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరో ఆరుసార్లు రేట్లు పెంచవచ్చనీ సంకేతాలు ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ బేరల్‌కు 85 డాలర్ల నుంచి 90 డాలర్ల శ్రేణిలో ఉండే వీలుంది. ఈ ప్రాతిపదికన దేశ కరెంట్ అకౌంట్ లోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి (జీడీపీలో) పెరగవచ్చు. 2021–22లో ఈ రేటు 1.6 శాతం. ► ఫిబ్రవరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13.1 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వెనక్కు మళ్లాయి. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయిలో ఉపసంహరణలు ఇదే తొలిసారి. ఇది రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ► అయితే 2013లో ఫెడ్ ఫండ్ రేటు పెంచినప్పటి పరిస్థితి ప్రస్తుతం రూపాయికి ఎదురుకాకపోవచ్చు. భారత్‌కు భారీ విదేశీ మారక నిధుల దన్ను దీనికి కారణం. ► ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో ఆశించిన నిధుల ప్రవాహం అలాగే 2023 ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశం డెట్ ఇన్స్టమెంట్ను చేర్చడం వంటి అంశాలు భారత్ కరెన్సీకి సమీప కాలంలో మద్దతునిచ్చే అంశాలు. 75.84 వద్ద రూపాయి... ఇక డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపుతో పోల్చితే 37 పైసలు లభపడి 75.84 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల పెరుగుదల, విదేశీ కరెన్సీల్లో డాలర్ బలహీనత దీనికి కారణం. వారంవారీగా చూస్తే, అమెరికన్ కరెన్సీలో రూపాయి విలువ 63 పైసలు లాభపడింది. హోలీ పండుగ నేపథ్యంలో సోమవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయదు. -
రూపాయితో... పండుగ చేసుకునేదెలా?
‘‘ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకుని పండుగ చేస్కో...!’’ జగన్నాథ్ దర్జాగా చెప్పాడు కృష్ణతో. కానీ, కృష్ణ ముఖం వెలిగి పోలేదు. బక్కచిక్కిన రూపాయి ఒక్కసారిగా తన కళ్లలో మెదలడంతో అతడి ముఖంపై ఆందోళన కనిపించింది. దీంతో ‘‘ఏమైంది కృష్ణా...?’’ అంటూ జగన్నాథ్ ప్రశ్నించాడు. ‘‘రూ.వెయ్యితో పండుగ చేసుకోవడం కాదు... అది నాకు దండగే. దీంతో 15 డాలర్లు కూడా రావు. ఓ జత డ్రెస్ కూడా కొనలేను..’’ అంటూ ఓ మంత్ర దండకం వినిపించటంతో అది విని జగన్నాథ్ ముఖంలోనూ మార్పు కనిపించింది. నిజానికి ఈ బక్క రూపాయి ఇప్పుడు సామాన్యుడి కొనుగోళ్లపై పెద్ద భారాన్నే మోపబోతోంది. పండుగల సీజన్‌కు ముందు రూపాయి దెబ్బను తలచుకుని అటు కంపెనీలు, ఇటు సగటు వినియోగదారులు కూడా నిట్టూర్చే పరిస్థితి. ఎందుకంటే రూపాయి కారణంగా పడే ప్రభావాన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతూ కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కార్ల కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇంత వరకూ పండగ సమయంలో కొందామని వేచి చూసిన వారిని తాజా పరిణామాలు పునరాలోచనలో పడేస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72కు సమీపంలోకి వచ్చేసింది. ఇది అటు కంపెనీలు, ఇటు వినియోగదారులకూ రుచించనిదే. రూపాయి ఈ ఏడాది పండుగ అమ్మకాలకు గండికొట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అయితే ఉంది. రూపాయి క్షీణతతో పెరిగిన ముడి సరుకుల (లోహాలు, ప్లాస్టిక్) ధరలతో కంపెనీలకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ విడిభాగాల ధరలకు ప్రామాణికం డాలరే. ఈ నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి ధరల భారాన్ని దింపుకునేందుకు కంపెనీలు ఉత్పత్తుల ధరల్ని పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎల్జీ, హాయర్, గోద్రేజ్ అప్లయన్సెస్ 3–5 శాతం స్థాయిలో ఈ నెల్లోనే ధరల్ని పెంచేశాయి. ప్యానాసోనిక్ ఇండియా కూడా 2–3 శాతం వరకు ధరల్ని అతి త్వరలోనే పెంచనుందని అంచనా. కార్ల కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ, పలు రకాల మోడళ్ల ధరలను రూ.6,100 వరకు పెంచింది. రూపాయి క్షీణత భారాన్ని ఇలా దింపుకుంది. అలాగే, టయోటా కిర్లోస్కర్ కూడా ధరల్ని ఈ నెల్లోనే 2–3 శాతం వరకు పెంచేసింది. డిమాండ్‌కు దెబ్బ అయితే, ఈ ధరల పెంపు డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్న ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా కంపెనీలు ఎక్కువగా అమ్మకాలను నమోదు చేసుకునే పండుగల సీజన్ డిమాండ్‌పై ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. విక్రయాలు 5–10 శాతం వరకు తగ్గొచ్చని కన్జూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల విక్రేతల అంచనా. రూపాయి విలువ ఇంకా పడితే, కంపెనీలు మరింత ధరల్ని పెంచితే ఈ డిమాండ్ ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా జరగాల్సింది కాదు... ‘‘రూపాయి క్షీణత అన్నది అనువుగాని సమయంలో జరుగుతోంది. జూలైలో జీఎస్టీ రేట్లు 10 శాతం తగ్గించడంతో పండుగల విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాం. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేశాం. కానీ, ప్రస్తుత ధరల పెంపుతో పండుగల డిమాండ్‌పై గణనీయ ప్రభావమే పడనుంది’’ అని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. వినియోగదారుల వెనకడుగు ‘‘పరిశ్రమ కొంత కాలం పాటు సింగిల్ డిజిట్ వృద్ధినే చూసింది. జీఎస్టీ రేట్ల కోతతో పరిస్థితి మారుతుందని ఆశించాం. కానీ, వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది’’ అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. ఓ స్థాయికి మించి పెంచలేం ‘‘దీర్ఘకాలంలో రూపాయి స్థిరపడుతుందని భావించడం లేదు. రూపాయి డాలర్‌తో ఏటా 6 శాతం మేర క్షీణిస్తుందన్న దానికి సిద్ధపడ్డాం. 2–3 శాతం ధరల పెంపు పడుతున్న రూపాయి ప్రభావాన్ని కొంతవరకే అడ్డుకోగలదు. కానీ, ఓ స్థాయికి మించి ధరలను పెంచలేం. ఎందుకంటే ఇది అమ్మకాలపై ఒత్తిడికి దారితీస్తుంది’’ అని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. టీవీల ధరలకూ రెక్కలు ఇక టీవీలు కూడా రూపాయి కారణంగా ఖరీదవుతున్నాయి. కొన్ని టీవీల కంపెనీలు ఈ నెల మధ్య నుంచే ధరల్ని పెంచనున్నాయి. థామ్సన్, కొడాక్ టీవీల తయారీ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే ధరల్ని పెంచేసింది. ఆగస్ట్‌లో ఒకసారి, సెప్టెంబర్‌లో మరోసారి ధరల్ని పెంచడం జరిగిందని, 12 శాతం మేర ధరలు పెరిగినట్టు సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్‌సింగ్ మార్వా తెలిపారు. -
6 నెలల కనిష్ఠానికి రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయిని నార్త్ కొరియా ఆందోళన పట్టి పీడిస్తోంది. మంగళవారం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ మరింత పతనమై 6 నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఆరంభంలోనే 18 పైసలు క్షీణించి 65.28 వద్ద కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. డాలర్‌కు డిమాండ్ బాగా పుంజుకోవడంతో 21 పైసలు నష్టపోయిన దేశీయ కరెన్సీ 65.33 వద్ద కొనసాగుతోంది. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికన్ కరెన్సీకి డిమాండ్ పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లుకూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 140పాయింట్లకుపై గా క్షీణించగా, నిఫ్టీ సైతం 50 పాయింట్లు కోల్పోయి కీలక మద్దతు స్థాయి 9850కి దిగువకు చేరింది. అటు బంగారం ధర మాత్రం మరింత పుంజుకుంది. ఎంసీఎక్స్మార్కెట్లో పది గ్రా. పుత్తడి రూ.104 ఎగిసి 30, 143 వద్ద స్థిరంగా ఉంది. -
రుపీకి డాలర్ దెబ్బ
ముంబై: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి ఒక్కసారిగా బలహీనపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 18 పైసలు నీరసించి 66.88ను తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని 0.12 పైసల(0.22 శాతం) నష్టంతో 66.83 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకులు, దిగుమతిదారులు డాలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం వంటి అంశాలు రూపాయిని బలహీనపరచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీరేట్టు పెరగనున్నాయనే అంచనాలతో ఆసియన్ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. రియల్టీ, సావరీన్ గోల్డ్ బాండ్స్ నష్టాల్లో ఉండగా, డాలర్విలువ పుంజుకుంది. విదేశీ ఫెడరల్ రిజర్వ్ ఈ నెల తరువాత వడ్డీ రేట్లు పెంచుతుందున్న అంచనాలతో ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం రూపాయి సెంటిమెంట్ కూడా బలహీనపర్చిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్లు నష్టాలుకూడా ప్రభావితం చేస్తున్నట్టు చెప్పారు. కాగా, గురువారం డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు బలపడి 66.70 వద్ద ముగిసింది. అటు ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో వరుసగా రెండు రోజు కూడా దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల వైపు మళ్లాయి. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లలో గురువారం భారీ నష్టాల్లో చవిచూస్తున్నాయి.