‘‘ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకుని పండుగ చేస్కో...!’’ జగన్నాథ్ దర్జాగా చెప్పాడు కృష్ణతో. కానీ, కృష్ణ ముఖం వెలిగి పోలేదు. బక్కచిక్కిన రూపాయి ఒక్కసారిగా తన కళ్లలో మెదలడంతో అతడి ముఖంపై ఆందోళన కనిపించింది. దీంతో ‘‘ఏమైంది కృష్ణా...?’’ అంటూ జగన్నాథ్ ప్రశ్నించాడు. ‘‘రూ.వెయ్యితో పండుగ చేసుకోవడం కాదు... అది నాకు దండగే. దీంతో 15 డాలర్లు కూడా రావు. ఓ జత డ్రెస్ కూడా కొనలేను..’’ అంటూ ఓ మంత్ర దండకం వినిపించటంతో అది విని జగన్నాథ్ ముఖంలోనూ మార్పు కనిపించింది. నిజానికి ఈ బక్క రూపాయి ఇప్పుడు సామాన్యుడి కొనుగోళ్లపై పెద్ద భారాన్నే మోపబోతోంది. పండుగల సీజన్‌కు ముందు రూపాయి దెబ్బను తలచుకుని అటు కంపెనీలు, ఇటు సగటు వినియోగదారులు కూడా నిట్టూర్చే పరిస్థితి. ఎందుకంటే రూపాయి కారణంగా పడే ప్రభావాన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతూ కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కార్ల కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇంత వరకూ పండగ సమయంలో కొందామని వేచి చూసిన వారిని తాజా పరిణామాలు పునరాలోచనలో పడేస్తున్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 72కు సమీపంలోకి వచ్చేసింది. ఇది అటు కంపెనీలు, ఇటు వినియోగదారులకూ రుచించనిదే. రూపాయి ఈ ఏడాది పండుగ అమ్మకాలకు గండికొట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అయితే ఉంది. రూపాయి క్షీణతతో పెరిగిన ముడి సరుకుల (లోహాలు, ప్లాస్టిక్) ధరలతో కంపెనీలకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ విడిభాగాల ధరలకు ప్రామాణికం డాలరే. ఈ నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి ధరల భారాన్ని దింపుకునేందుకు కంపెనీలు ఉత్పత్తుల ధరల్ని పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎల్‌జీ, హాయర్, గోద్రేజ్ అప్లయన్సెస్ 3–5 శాతం స్థాయిలో ఈ నెల్లోనే ధరల్ని పెంచేశాయి. ప్యానాసోనిక్ ఇండియా కూడా 2–3 శాతం వరకు ధరల్ని అతి త్వరలోనే పెంచనుందని అంచనా. కార్ల కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ, పలు రకాల మోడళ్ల ధరలను రూ.6,100 వరకు పెంచింది. రూపాయి క్షీణత భారాన్ని ఇలా దింపుకుంది. అలాగే, టయోటా కిర్లోస్కర్ కూడా ధరల్ని ఈ నెల్లోనే 2–3 శాతం వరకు పెంచేసింది.
డిమాండ్‌కు దెబ్బ
అయితే, ఈ ధరల పెంపు డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్న ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా కంపెనీలు ఎక్కువగా అమ్మకాలను నమోదు చేసుకునే పండుగల సీజన్ డిమాండ్‌పై ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. విక్రయాలు 5–10 శాతం వరకు తగ్గొచ్చని కన్జూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల విక్రేతల అంచనా. రూపాయి విలువ ఇంకా పడితే, కంపెనీలు మరింత ధరల్ని పెంచితే ఈ డిమాండ్ ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ఇలా జరగాల్సింది కాదు...
‘‘రూపాయి క్షీణత అన్నది అనువుగాని సమయంలో జరుగుతోంది. జూలైలో జీఎస్టీ రేట్లు 10 శాతం తగ్గించడంతో పండుగల విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాం. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేశాం. కానీ, ప్రస్తుత ధరల పెంపుతో పండుగల డిమాండ్‌పై గణనీయ ప్రభావమే పడనుంది’’ అని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు.
వినియోగదారుల వెనకడుగు
‘‘పరిశ్రమ కొంత కాలం పాటు సింగిల్ డిజిట్ వృద్ధినే చూసింది. జీఎస్టీ రేట్ల కోతతో పరిస్థితి మారుతుందని ఆశించాం. కానీ, వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది’’ అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు.
ఓ స్థాయికి మించి పెంచలేం
‘‘దీర్ఘకాలంలో రూపాయి స్థిరపడుతుందని భావించడం లేదు. రూపాయి డాలర్‌తో ఏటా 6 శాతం మేర క్షీణిస్తుందన్న దానికి సిద్ధపడ్డాం. 2–3 శాతం ధరల పెంపు పడుతున్న రూపాయి ప్రభావాన్ని కొంతవరకే అడ్డుకోగలదు. కానీ, ఓ స్థాయికి మించి ధరలను పెంచలేం. ఎందుకంటే ఇది అమ్మకాలపై ఒత్తిడికి దారితీస్తుంది’’ అని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ తెలిపారు.
టీవీల ధరలకూ రెక్కలు
ఇక టీవీలు కూడా రూపాయి కారణంగా ఖరీదవుతున్నాయి. కొన్ని టీవీల కంపెనీలు ఈ నెల మధ్య నుంచే ధరల్ని పెంచనున్నాయి. థామ్సన్, కొడాక్ టీవీల తయారీ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే ధరల్ని పెంచేసింది. ఆగస్ట్‌లో ఒకసారి, సెప్టెంబర్‌లో మరోసారి ధరల్ని పెంచడం జరిగిందని, 12 శాతం మేర ధరలు పెరిగినట్టు సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్‌సింగ్ మార్వా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment