జీఎస్టీతో వంటగ్యాస్ చౌక!
తగ్గనున్న నిత్యావసర వస్తువుల బడ్జెట్
న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ), నోట్ పుస్తకాలు, ఇన్సులిన్, అల్యూమినియం ఫాయిల్స్, అగర్‌బత్తి ఇలా నిత్యావసర వస్తువుల్లో చాలా వాటి ధరలు జీఎస్టీ అమలు కారణంగా జూలై 1 నుంచి చౌకగా లభించనున్నాయి. ఎందుకంటే వీటిపై ప్రస్తుతమున్న వివిధ రకాల పన్నుల కంటే తక్కువ పన్నునే జీఎస్టీ మండలి ఖరారు చేసింది.
ఇలా పన్ను తగ్గే వాటిలో పాలపొడి, పెరుగు, మజ్జిగ, బ్రాండ్ పేరు లేని తేనె, డైరీ ఉత్పత్తులు, జున్ను, మసాలా దినుసులు, టీ, గోధుమలు, బియ్యం, గోధుమ, మైదా పిండి, కొబ్బరి నూనె, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, ఆవనూనె, పంచదార, చక్కెరతో చేసిన మిఠాయిలు, పాస్తా, నూడుల్స్, పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, మురబ్బా, కెచప్, సాస్‌లు, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, మినరల్ వాటర్, ఐస్, సిమెంట్, బొగ్గు, కిరోసిన్ (పీడీఎస్), పళ్ల పొడి, సబ్బులు, ఎక్స్‌రే ఫిల్మ్, మెడికల్ డయాగ్నస్టిక్ కిట్లు ఉన్నాయి. ప్రస్తుతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నులు తగ్గే వాటి వివరాలతో కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
అలాగే, డ్రాయింగ్ పుస్తకాలు, సిల్క్, వూలె న్, కాటన్ వస్త్రాలు, రెడీమేడ్ వస్త్రాలు, రూ.500లోపున్న పాద రక్షలు, హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్, కళ్లద్దాలు, చెంచాలు, ఫోర్క్‌లు కూడా ధరలు తగ్గనున్నాయి.