‘బౌలింగ్ బ్రాడ్‌మన్’ అశ్విన్
మొనాకో: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల జల్లు కురిపించాడు. అశ్విన్‌ను ఏకంగా బ్యాటింగ్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తూ ‘డాన్ బ్రాడ్‌మన్ ఆఫ్ బౌలింగ్’ అని కితాబిచ్చాడు. ‘బ్యాటింగ్‌లో డాన్ బ్రాడ్‌మన్ ఎలాగో బౌలింగ్‌లో అశ్విన్ అంతటివాడు. ప్రస్తుతం అతని బౌలింగ్ అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే అతని గణాంకాలు అసాధారణంగా ఉన్నాయి. అతను మరిన్ని రికార్డులను కొల్లగొడతాడు. అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కొంటేనే ఆసీస్‌కు గెలుపు అవకాశాలుంటాయి’ అని స్టీవ్‌వా అభిప్రాయపడ్డారు. మరోవైపు కోహ్లి నాయకత్వంలో భారత కుర్రాళ్లు ఏమైనా సాధించగలమనే నమ్మకంతో ముందుకు దూసుకెళుతున్నారన్న స్టీవ్ వా...గత రెండేళ్లుగా భారత్ ఆట చూస్తుంటే వారిని సొంత గడ్డపై ఓడించడం చాలా కష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
గంగూలీవి ‘తెలివితక్కువ’ వ్యాఖ్యలు...
కోహ్లిసేన చేతిలో ఆస్ట్రేలియా 4–0తో వైట్‌వాష్ అవుతుందన్న గంగూలీ మాటలను వా కొట్టిపారేశారు. ఆసీస్ బలమైన జట్టని ఈ సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీనిస్తుందని స్టీవ్ వా పేర్కొన్నారు. ‘గంగూలీ మాటలు ముమ్మాటికీ నిజం కావు. మా ఆటగాళ్ల గురించి మీకు ఎక్కువగా తెలియదు. ఇది మాకు మేలు చేసే అంశం. ఈ సిరీస్‌లో తొలి టెస్టును ఆసీస్ గెలిస్తే... ఇక మా జట్టును ఆపలేరు. అలా కాకుండా రెండు టెస్టులు ఓడిన తర్వాత కూడా మేము పుంజుకోగలం. మా సామర్థ్యం అలాంటిది. మా జట్టులోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సౌరవ్ వ్యాఖ్యల్లో మితిమీరిన ఆశావాదం కన్పిస్తోంది’ అని వా అన్నారు.