donation box
-
Texas: హిందూ ఆలయంలో హుండీ దొంగతనం
ఆస్టిన్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్‌లోని ఓ హిందూ దేవాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని ఆగంతకులు నేరుగా గుడిలోకి ప్రవేశించి హుండీ, భక్తులు తమ విలువైన వస్తువులు దాచుకునే లాకర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన భారత కమ్యూనిటీని షాక్‌కు గురి చేసింది. బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం శ్రీ ఓంకారనాథ్ ఆలయం. ఈ ఆలయంలోనే దొంగతనం ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డ్ మెంబర్ శ్రీనివాస సుంకరి వెల్లడించిన వివరాల ప్రకారం.. కిటికీ తొలగించి లోనికి చొరబడ్డ ఆంగతకులు.. హుండీతో పాటు కొన్ని విలువైన వస్తువులున్న లాకర్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. అయితే ఆలయ అర్చుకుడి కుటుంబం సమీపంలోనే నివసిస్తోందని, వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు సుంకరి వెల్లడించారు. ఇక.. సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో నమోదు అయ్యింది. ఆదివారం హిందూ కమ్యూనిటీతో సమావేశమై.. ఈ ఘటన గురించి చర్చించినట్లు వెల్లడించారు. అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ఇక ఈ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అది జాతిపితను అవమానించటమే!
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ స్మారకం (రాజ్‌ఘాట్) వద్ద విరాళాల హుండీని ఉంచటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య జాతిపితను అవమానించినట్లేనని పేర్కొంది. సేకరించిన నిధులను వేటికోసం వినియోగిస్తున్నారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. అయితే మహాత్ముడు స్థాపించిన ‘హరిజన్ సేవక్ సంఘ్’ ఈ హుండీని ఏర్పాటు చేసిందని.. ఈ సంస్థ అవసరాలకే నిధులు వినియోగిస్తున్నట్లు రాజ్‌ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కమిటీ వివరించింది. దీనిపై కోర్టు మండిపడింది. ‘ఇదేనా మనం జాతిపితకు ఇచ్చే గౌరవం. భారతీయులతోపాటు వేలసంఖ్యలో విదేశీయులూ రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ విరాళాల హుండీలు పెట్టడం గాంధీని అవమానించటమే’ అని స్పష్టం చేసింది. రాజ్‌ఘాట్‌లో కనీస ఏర్పాట్లపై వివరాలివ్వాలని సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించింది. -
షిర్డీ హుండీలో రూ. 92 లక్షల వజ్రాలు!
ఆలయాల్లో దేవుడికి నగలు, నగదు భారీ మొత్తంలో సమర్పించుకునే భక్తులను చూశాం. కానీ, షిర్డీలోని సాయిబాబా ఆలయ హుండీలో భారీ మొత్తంలో బంగారం, వెండితో పాటు అత్యంత విలువైన వజ్రాలు కూడా కనిపించాయి. ఎవరో అజ్ఞాత భక్తులు రెండు వజ్రాల నెక్లెస్‌లను హుండీలో వేశారు. వాటి విలువ దాదాపు రూ. 92 లక్షలు ఉంటుందని నగల వ్యాపారులు చెప్పారు. షిర్డీ ఆలయ చరిత్రలోనే హుండీలో ఇంత పెద్దమొత్తంలో విరాళాలు రావడం ఇదే మొదటిసారి. సాధారణంగా పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చేవారు నేరుగా ట్రస్టీలకు అందజేస్తారు. హుండీలలో ఎప్పుడూ వివిధ దేశాలకు చెందిన నాణేలు, నగదు, బంగారు, వెండి ఆభరణాల లాంటివి కనిపిస్తూ ఉంటాయి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు భక్తులు 223 వజ్రాలను, ముత్యాలను, పగడాలను సాయిబాబాకు సమర్పించారని, వాటన్నింటి విలువ కలిపి రూ. 1.06 కోట్లు ఉంటుందని, కానీ ఈ రెండు వజ్రాల నెక్లెస్‌ల విలువ మాత్రం రూ. 92 లక్షలు ఉందని ఆలయ అకౌంట్ విభాగం అధిపతి దిలీప్ జిర్పే చెప్పారు. ఏప్రిల్ 21న హుండీలు తెరిచినప్పుడు ఈ నెక్లెస్‌లు బయటపడ్డాయి. వీటిలో ఒకటి 6.67 క్యారెట్లు, మరోటి 2.5 క్యారెట్లు ఉంటుందని, ఇందులోని వజ్రాలు చాలా విలువైనవని ముంబైకి చెందిన వజ్రాల నిపుణుడు నరేష్ మెహతా చెప్పారు.