చిన్న జీవితంలోని పరిపూర్ణత
‘జంటల మధ్య ప్రేమ తగ్గిపోతున్నప్పుడు, పిల్లలకు అందించడానికి ప్రేమ మిగలదు’ అన్న భావాన్ని ఆధారంగా తీసుకుని రాసిన నవల ఇది.
తిషానీ దోషి రాసిన ‘స్మాల్ డేస్ అండ్ నైట్స్’లో– కథకురాలైన గ్రేస్(గ్రేజియా) 2010లో, అమెరికా నుండి తల్లి అంత్యక్రియల కోసం పాండిచ్చేరి వస్తుంది. ముప్పైల్లో ఉన్న గ్రేస్, తనకు పిల్లలు కావాలని అనుకోకపోవడం వల్ల, ఆమె వివాహం విచ్ఛిన్నం అవుతుంది. తల్లి తమిళురాలు. తండ్రి ఇటాలియన్. భార్యతో విడిపోయి వెనిస్లో ఉంటాడు. దహన సంస్కారాల తరువాత తనకు, ‘స్నేహా సెంటర్ ఫర్ గర్ల్స్’లో డౌన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న లూచీయా అనే అక్క ఉందని తెలుస్తుంది. ‘ఏనాడూ స్వతంత్రంగా బతకలేకపోయే యీ పిల్ల కోసం నీకున్న ఒకే జీవితాన్ని వదులుకోగలవా?’ అనడిగిన తండ్రి మనస్తత్వం వల్ల, తల్లి తన చిన్నతనంలో అక్కని చూడ్డానికే వారం వారం మాయం అయేదని గ్రహిస్తుంది.
తల్లిదండ్రుల సంవత్సరాల నిర్లక్ష్యానికి మూల్యంగా, అక్కను చూసుకోవాలనే నిర్ణయానికి వస్తుంది. ఆమెను తీసుకుని, తల్లినుండి సంక్రమించిన పరమంకేణి గ్రామంలో ఉన్న పదెకరాల సముద్రతీరపు ఇంటికి వెళ్తుంది. కుటుంబ జీవితపు ఆత్మీయతను తప్పించుకుంటూ, పిల్లల అవసరం కనపడని గ్రేస్‌కు అక్కను చూసుకోవడం సవాలుగా మారుతుంది. ‘ప్రతీ రోజూ మేము అవే పన్లు చేస్తున్నాం. నోట్లో చమ్చా పెట్టుకోవడం తప్ప మరేమీ చేయలేదు తను’ అన్నప్పటికీ, తరువాత విసుక్కుంటూ ఒప్పుకుంటుంది. ‘కొన్నిసార్లు తను రెండు గంటలు నములుతూ ఉండటం చూసి అరుస్తాను.’
అనేకమైన పెంపుడు కుక్కలున్న ఆ ‘పురుషులుండని, నీలం తలుపులున్న గులాబీ ఇంట్లో’ మల్లికను పనికి పెట్టుకుంటుంది. ‘చిన్నతనపు ఇంటికి ఉండే వినాశన బలాన్ని ఎవరూ ఊహించలేరు’ అనుకుంటుంది. లూచియాను చూసుకోడానికి చేయవలిసిన త్యాగాలు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయి. మాట్లాడ్డానికి ఎవరూ లేక, లూచియాను మల్లికకు అప్పజెప్పి నెలకొకసారి మద్రాసు వెళ్తుంటుంది గ్రేస్. ఒకసారి ఆలస్యంగా వెనక్కొస్తుంది. ఆ లోపల, లూచియాను మల్లిక ఒంటరిగా వదిలేసి పోతుంది. స్నేహా సెంటర్ టీచర్ లూచియాను పట్టుకెళ్తుంది. నిర్లక్ష్యం ఆరోపణతో అక్కను కలుసుకోనివ్వరు.
తను ఏర్పరచుకున్న చిన్నపాటి కుటుంబ నిర్మాణం కూలిపోయినప్పుడు, మానవ సంబంధాల నుండి తను కోరుకున్న స్వేచ్ఛ తనకి అక్కర్లేదని గుర్తిస్తుంది గ్రేస్. తన ఉద్దేశ్యాల ఓటమిని అర్థం చేసుకుని, తన చర్యలకు బాధ్యత వహించి, తమ అక్కాచెల్లెళ్ళ భవిష్యత్తును స్పష్టంగా చూడగలుగుతుంది. తనకున్న ‘తప్పించుకోవడం’ అన్న అలవాటును తెలుసుకుంటుంది. అక్కతోపాటు చిన్న విషయాలకే నవ్వుకుంటూ, తను చిక్కుకుపోయానన్న ఆలోచన మానుకుంటుంది.
ఆ తరువాత, తనకీ లూచియాకూ సరిపడేలా ఇంటిని తిరిగి కట్టించి, సంతృప్తి పొందుతుంది. ప్రపంచానికి దూరంగా బతకడం కాక దాన్లోనే బతకడానికున్న ప్రాముఖ్యతను గ్రహిస్తుంది. నవల చివర్న, ‘రాబోయే రోజుల్లో పిల్లల గురించి మనకుండే భావాలకు అనుగుణంగా వాళ్ళు తయారు చేయబడతారు’ అంటుంది. ‘వెనక్కి రావడం, ఎప్పుడూ మనం ఆశించిన అనుభవం అయుండదు,’ అన్న గ్రేస్ ఆలోచనను పుస్తకమంతటా అనేక సంఘటనల ద్వారా బలోపేతం చేస్తారు రచయిత్రి. అసాధ్యమైన ఆదర్శాలతో స్త్రీత్వానికి దూరమయ్యే వారి గురించినదీ నవల. చివరి మాటకు ముందు కనిపించే ‘మనం ఒక దేశాన్ని కనుగొనేది చిన్న ఊళ్ళనుండే; చిన్న పగళ్ళు, రాత్రుళ్ళ నుండి వచ్చే పరిజ్ఞానంతో’ అన్న శిలాశాసనం, జేమ్స్ సాల్టర్ రాసిన ‘ఎ స్పోర్ట్ అండ్ ఎ పాస్టైమ్’ పుస్తకం నుండి తీసుకోబడింది.
‘జంటల మధ్య ప్రేమ తగ్గిపోతున్నప్పుడు, పిల్లలకు అందించడానికి ప్రేమ మిగలదు’ అన్న భావాన్ని ఆధారంగా తీసుకుని బాధ్యతలు, బంధుత్వాల గురించి ప్రశ్నలు లేవదీస్తూ, తల్లిదనం మీద కేంద్రీకరించి రాసిన ఈ నవలను బ్లూమ్స్బరీ ఏప్రిల్ 2019లో ప్రచురించింది. మద్రాసులో పుట్టిన రచయిత్రి తల్లి వెల్ష్, తండ్రి గుజరాతీ. దోషీ కవయిత్రి, పాత్రికేయురాలు, నర్తకి కూడా. అనేకమైన పురస్కారాలు పొందారు. చెన్నైలో ఉంటారు.