అమెరికాలో కారు బీభత్సం
లాస్ వెగాస్: ఒకవైపు ప్రపంచసుందరి పోటీలు, కిరీటం సంబరాలతో సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నట్టుండి అలజడి రేగింది. అకస్మాత్తుగా జనాల మీదికి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అసలే ఉగ్రదాడులతో ప్రపంచమంతా బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది.
అమెరికాలోని లాస్ వెగాస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. డ్రైవర్ కారును పాదచారుల మీద నుంచి వేగంగా తీసుకెళ్లడంతో సుమారు 37 మంది గాయపడ్డారు. మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్న లాస్ వెగాస్‌లోని పారిస్ హోటల్ ముందు ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పిల్లలు, వృద్ధులు, మహిళలు ఉన్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు ట్వీట్ చేశారు. బాధితుల్లో చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలిపారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక ప్రమాదమా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.