లైట్ వేస్కో.. చార్జ్ చేస్కో..
వేణు.. బ్యాచిలర్ స్టూడెంట్.. హైదరాబాద్‌లో రూంలో ఫ్రెండ్స్‌తో కలసి ఉంటాడు.. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు.. ఆ ఫోనే అతడికి కాలక్షేపం. ఎప్పుడూ వీడియో గేమ్స్ లేదా.. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటాడు. అయితే వేణుకు ఓ బాధ ఉంది. అదేంటంటే వెంటనే చార్జింగ్ అయిపోతోందని.. ఇది వేణు ఒక్కడి సమస్య కాదు అందరికీ ఉండేదే. అయితే ఈ సమస్యలకు త్వరలోనే చెక్ పడనుందని చెబుతోంది డ్రాకులా టెక్నాలజీస్ సంస్థ. లైట్ ఉన్న చోట ఎక్కడ ఫోన్ పెట్టినా చార్జ్ అయిపోయేలా నూతన ఆవిష్కరణ త్వరలోనే రానుంది. ఈ అద్భుతం త్వరలోనే సాక్షాత్కరించనుంది.
మొబైల్ఫోన్ల చార్జింగ్ చేసుకునేందుకు సౌర శక్తిని వాడటం కొత్తేమీ కాదు. అయితే సూర్యుడు ఉన్నంత వరకే పని జరుగుతుంది.
ఇలా కాకుండా మన ఇళ్లలో రాత్రి కాగానే వేసే లైట్ల వెలుతురును (ఆంబియంట్ లైట్) ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయగల సరికొత్త సౌరఫలకాలను ఫ్రాన్స్‌కు చెందిన డ్రాకులా టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. సౌరశక్తితో పోలిస్తే అతి తక్కువ తీవ్రత ఉండటం వల్ల ఆంబియంట్ లైట్‌తో విద్యుదుత్పత్తి చేయడం ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఈ పరిమితులను అధిగమించి ఇంక్జెట్ ప్రింటర్లతో ముద్రించే టెక్నాలజీని ఈ కంపెనీ అభివృద్ధి చేసింది. ‘లైట్ యాజ్ యువర్ ఎనర్జిటిక్ రెస్పాన్స్ (లేయర్) అని పిలుస్తున్న ఈ టెక్నాలజీతో సౌర ఫలకాలను పూర్తి పారదర్శకంగా కూడా తయారు చేసుకోవచ్చు.
మనకు నచ్చిన రంగులోనూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యుత్‌ను ప్రసారం చేయగల ప్రత్యేక ప్లాస్టిక్‌తో రూపొందే లేయర్ సౌర ఫలకాల తయారీకి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. సూర్యుడి వెలుతురుతోనూ విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. స్క్రీన్‌పై వీటిని ముద్రించడం ద్వారా ప్రత్యేకంగా బ్యాటరీ అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్‌ను వాడుకోవచ్చు. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు లేదంటే ల్యాప్‌టాప్‌లు, కాలేజీ బ్యాగ్‌ల వెనుకవైపు కూడా ముద్రించొచ్చని డ్రాకులా టెక్నాలజీస్ శాస్త్రవేత్త సడోక్ బెన్ దఖిల్ అంటున్నారు. టీషర్ట్‌పై కానీ.. ఇంకేదైనా స్థలంలో కానీ ఐదు సెంటీమీటర్ల వైశాల్యమున్న లేయర్ సోలార్ సెల్స్‌ను ఒకే గంటలో ముద్రించుకోగలగడం విశేషం.
ఐదు పొరల సెల్..
లేయర్ సౌర ఫలకాల్లో మొత్తం 5 పొరలుంటాయి. కాంతికి స్పందించే పొరను మధ్యలో ఉంచి ఇరువైపులా అర్ధవాహక పొరలు ఏర్పాటు చేస్తారు. పై పొరలో ఉండే ప్రత్యేకమైన ఇంకు విద్యుత్తు చార్జ్‌ను గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. లేయర్ సోలార్ సెల్స్‌ను మనకు నచ్చిన ఆకారంలో, రంగులో తయారు చేసుకునే వీలున్న నేపథ్యంలో వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంచనా. పారదర్శకమైనవి, ప్లాస్టిక్‌తో చేసినవి. అవసరమైన రంగు, డిజైన్లతోనూ ముద్రించుకునే అవకాశం ఉన్న లేయర్ సోలార్ సెల్స్‌ను ఇళ్లలో కిటికీలు, తలుపులకు వాడే తెరలుగా ఉపయోగిస్తే...? బహిరంగ ప్రదేశాల్లోని భారీ హోర్డింగ్‌లకూ చేరితే...? ఎక్కడికక్కడ విద్యుత్తు ఉత్పత్తి అవుతూ అవసరాలు కొంతమేరకైనా తీరతాయి. అయితే ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతానికి 30 చదరపు సెంటీమీటర్ల వైశాల్యమున్న సౌరఫలకాలు తయారు చేస్తున్నామని బెన్ తెలిపారు. వీటితో పాటు లోగోలను వెలుతురుతో నింపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భవనాల్లో వేడి, తేమశాతాలను లెక్కించేందుకు పనికొచ్చే సెన్సర్లకు విద్యుత్ అందించేలా కూడా తయారు చేస్తున్నట్లు వివరించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్