తాగునీటి కష్టాలకు సోలార్‌తో చెక్
సత్ఫలితాలిస్తున్న డ్యూయల్ పంప్ పైప్‌లైన్ పథకం
ఆదిలాబాద్ : జిల్లాలోని గిరిజన తండాల్లో నెలకొన్న తాగునీటి కష్టాలకు సోలార్‌తో చెక్ పడింది. మారుమూల ప్రాంతాల్లో నిర్మించిన సోలార్ ఆధారిత తాగునీటి పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గిరిజనుల దాహర్తిని తీరుస్తున్నారుు. ఎన్సీఈఎఫ్, ఆర్ఆర్ఈడబ్ల్యూపీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్యూయల్ పంప్ పైప్‌లైన్ పథకాల నిర్మాణం చేపట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 18 మారుమూల ప్రాంతాల్లో వీటిని నెలకొల్పారు.
ఆదిలాబాద్ మండల పరిధిలోని తిప్ప, మలేబోర్గాం, దార్లొద్ది, జైత్రాం తండా (ఇంద్రవెల్లి మండలం), నాయకపుగూడ (జన్నారం), దోస్త్‌నగర్ (కడెం), కొలాంగూడ (బజార్హత్నూర్), ధోబీగూడ (ఇచ్చోడ), కొలాంగూడ (బజార్హత్నూర్), గంగాపూర్తండా (సారంగాపూర్), పార్పల్లితండా (లక్ష్మణచాంద), రాయదురితాండ, పులిమడుగు, దోడర్నతండా, పల్సితండా, బాలాజీతండా, రాజుతండా గ్రామాల్లో వీటిని నిర్మించారు. ఒక్కో పథకం ద్వారా సుమారు 20 కుటుంబాలకు (సుమారు వంద జనాభా) తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఐదువేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నిర్మిస్తారు.
బోరుకు సోలార్ ఆధారిత పంపుసెట్‌ను బిగించి ఆ నీటి నిట్యాంకులో నింపుతారు. అక్కడి నుంచి సమీపంలో మూడు చోట్ల నల్లాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా తాగునీటిని సరఫరా చేస్తారు. ఈ పథకం సమీపంలోనే ఇంకుడు గుంత కూడా ఏర్పాటు చేసి, వృథా నీరు తిరిగి భూగర్భజలాల పెంపునకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో కేవలం రెండు నుంచి మూడు గంటలలోపు ఈ ట్యాంకులు నిండుతారుు. వర్షాకాలంలోనైతే ఆరు గంటల్లో నిండుతాయని ఈ ప్రాజెక్టు చేపట్టిన జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ సంస్థ అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం రూ.4.68 లక్షల చొప్పున వెచ్చిస్తోంది.
ఇబ్బందులు దూరమయ్యాయి
గతంలో తాగునీటికి చాలా ఇబ్బందులు పడ్డాం. కరెంటు ఉంటేనే తాగడానికి నీరందేది. లేదంటే చాలాదూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. కా నీ వారం రోజుల క్రితం గ్రామంలో సోలార్ వాట ర్ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తండాలో తాగునీటి ఇబ్బందులు దూరమయ్యూయి.
- రాథోడ్ అరుణ, గంగాపూర్
కరెంట్ పోతే నీళ్లచ్చేవి కావు
గ్రామంలో తరచూ కరెంటు కష్టాలు ఉండేవి. తాగేందుకు నీళ్లు వచ్చేవి కావు. దీంతో అష్టకష్టాలు పడ్డాం. ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి గ్రామంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసింది. గ్రామంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు బాగుంది.
- జాదవ్ విఠల్, గంగాపూర్
ఐదేళ్లు నిర్వహణ బాధ్యత మాదే ..
ఐదు సంవత్సరాల వరకు ఈ తాగునీటి పథకాల నిర్వహణ బాధ్యతలను మా సంస్థే చూస్తుంది. ఒక్కసారి ఈ పథకాన్ని నిర్మిస్తే నిర్వహణ వ్యయం ఏ మాత్రం ఉండదు. సరైన రోడ్డు మార్గం లేని గ్రామాలు, మారుమూల నివాసిత ప్రాంతాల వాసులకు ఈ పథకాలు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. వీటిని నెలకొల్పిన ప్రాంతాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
- ప్రదీప్‌కుమార్, ప్రాజెక్టు మేనేజర్, జైన్ ఇరిగేషన్