నిండా ముంచేశారు
* స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాలంటూ ఎర
* బీఎస్ రావు గ్రూప్ కన్సల్టెన్సీ దగా
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లో ఉద్యోగమన్నారు.. నెలకు లక్షా యాభై వేల రూపాయల జీతం వస్తుందని నిరుద్యోగులను ప్రలోభపెట్టారు.. దీంతో దారిద్య్రాన్ని దూరం చేసుకోవచ్చనుకుని ఇళ్లు, పొలాలు, భార్య ఒంటిపై నగలను అమ్ముకుని, అప్పులు చేసి మరీ డబ్బు తెచ్చి చేతిలో పోసిన అమాయకులను నిండా ముంచేశారు.. వారిని విమానాశ్రయం దాకా రప్పించారు. అప్పటికి అసలు విషయం తెలిసిన బాధితులు గొల్లుమన్నారు.
గుంటూరుకు చెందిన దుర్గాపవన్ అనే వ్యక్తి హైదరాబాద్ సోమాజిగూడలోని అమృతా విల్లా అపార్టుమెంట్లో బీఎస్‌రావు గ్రూప్స్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. స్విట్జర్లాండ్‌లోని ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ. లక్షా అరవై వేలు చెల్లిస్తే మూడేళ్ల పాటు అగ్రిమెంట్ కింద స్విట్జర్లాండ్ పంపిస్తామని ప్రచారం చేసుకున్నాడు. ప్రతి నెలా రూ. లక్షా యాభై వేలు జీతం వస్తుంద ని ఆశపెట్టాడు. వరంగల్ జిల్లాకు చెందిన యూసుఫ్‌తో పాటు కొంతమందిని బ్రోకర్లుగాను, ట్రావెల్ ఏజెంట్‌గా మహ్మద్ జావిద్‌ను నియమించుకున్నాడు. హంగూ ఆర్భాటాలతో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు.
వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఇల్లందు ప్రాంతాలకు చెందిన 94 మంది వీరి ప్రచారాన్ని నమ్మి.. ఆస్తులను అమ్ముకుని మరీ డిసెంబర్, జనవరి నెలల్లో రూ. 76,000, జూన్‌లో మిగతా రూ. 84,000ను చెల్లించారు. వీరిలో వరంగల్‌కు చెందిన 54 మంది యూసుఫ్ స్థానికుడని నమ్మి డబ్బు కట్టారు. వీరందరినీ నమ్మించేందుకు వారి వివాహ ధ్రువపత్రం, పాన్ కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టులను దుర్గాపవన్, యూసుఫ్ తదితరులు తీసుకున్నారు.
గత నెల 14న స్విట్జర్లాండ్ పంపిస్తామని చెప్పి అందరినీ ఎయిర్‌పోర్టు వరకు రప్పించారు. కానీ ఇంకా పని ఒప్పందం కుదరలేదని, కొంతకాలం ఆగాలని చెప్పి అందరినీ తిరిగి పంపించేశారు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో గత నెల హైదరాబాద్‌లోని హోటల్ కత్రియాలో సమావేశం ఏర్పాటు చేసి, అందరిని తప్పకుండా పంపిస్తామని చెప్పారు. తర్వాత జూలై 4న స్విట్జర్లాండ్‌కు పంపిస్తామని, అందరూ సిద్ధం కావాలని సమాచారం ఇచ్చారు.
అసలు పత్రాలే లేవు
ట్రావెల్ కన్సల్టెన్సీ సమాచారం మేరకు డబ్బు కట్టినవారంతా బంధువులతో సహా శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ కన్సల్టెన్సీ ఇచ్చిన పత్రాలు సరిగా లేక అధికారులు తిరస్కరించారు. దీంతో బాధితులు ఆందోళనకు గురై ఏజెంట్లలో ఒకరైన పవన్‌ను విమానాశ్రయానికి పిలిపించారు. కానీ అతను ఇంకా పని ఒప్పందం కుదరలేదని, మరికొన్ని రోజులు ఆగాలని చెప్పాడు. దీంతో బాధితులు మోసపోయినట్లు గ్రహించారు.
పవన్‌ను పట్టుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించి, అక్కడే ఆందోళనకు దిగారు. కన్సల్టెన్సీని నమ్మి మోసపోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు పవన్, యూసుఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కన్సల్టెన్సీ ఉన్న పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. దీంతో బాధితులు పంజగుట్ట పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ కూడా ఆందోళనకు దిగారు. తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేఃశారు.
కాగా కన్సల్టెన్సీ మోసం వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు 14న తమను స్విట్జర్లాండ్ తీసుకెళతానంటూ ఇదే కన్సల్టెన్సీ డబ్బులు వసూలు చేసిందంటూ మరికొందరు పోలీసులను ఆశ్రయించారు.
నగలమ్మి డబ్బులిచ్చా..
గత నెల 13న నా దగ్గర 4,500 తీసుకుని యాభై స్విట్జర్లాండ్ ఫ్రాంకులు ఇచ్చి నమ్మించాడు. నా భార్య నగలమ్మి డబ్బులు చెల్లించాను
- మహ్మద్ గౌస్
మాకు న్యాయం చేయాలి
స్విట్జర్లాండ్‌లో చలి మైనస్ డిగ్రీల్లో ఉంటుందని, అందరూ మంచి కంపెనీకి చెందిన జర్కిన్లు కొనుక్కోవాలని కన్సల్టెన్సీ వాళ్లు చెప్పారు. ఎయిర్‌పోర్టులో కేవలం వుడ్లాండ్ లెదర్ బూట్లను మాత్రమే అనుమతిస్తారని, అందరూ జీన్స్‌ప్యాంట్లు, టీషర్టు, ఉన్ని సాక్సు, టర్కీ టవల్ తెచ్చుకోవాలన్నారు. దాంతో అందరం మరో పది వేల చొప్పున ఖర్చుపెట్టి అవన్నీ కొన్నాం. నా సొంతిల్లు అమ్ముకుని మరీ కన్సల్టెన్సీకి డబ్బు కట్టాను. పోలీసులు మాకు న్యాయం చేయాలి.
- షేక్ సాజిద్, వరంగల్ జిల్లా
మోసపోయాం
ఆటో నడుపుకునే నేను విదేశాలకెళ్లి డబ్బు సంపాదించా లనుకున్నా. మరో 15 మందినీ కన్సల్టెన్సీకి తీసుకొచ్చా. అందరం మోసపోయాం.
- సాయిబాబు, బీఎస్ మక్తా