Dum Biriyani
-
క్రేజీ.. థీమ్స్.. వంట నుంచి వడ్డన దాకా..
ఆహారం వడ్డించడానికి ఇత్తడి పళ్లెం, నీళ్లు తాగడానికి రాగి, గాజు గ్లాసు, బిర్యానీ వండేందుకు మట్టి కుండలు, ఆహారం వడ్డించేందుకు ఇత్తడి గరిటెలు, స్పూన్లు.. ఇదంతా ఎప్పుడో పూర్వకాలం రోజులు అనుకుంటే పొరపాటు పడినట్లే.. హైదరాబాద్ నగరంలో తాజాగా హోటల్ యాజమాన్యాలు అవలంబిస్తున్న ట్రెండ్ ఇది. వివిధ రకాల థీమ్‌లతో ఏర్పాటు చేస్తున్న హోటల్స్‌లో రుచికరమైన ఆహారంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో యువతను ఆకట్టుకునేందుకు సెల్ఫీ పాయింట్లు, స్టార్ హీరోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో కొత్తకొత్త పేర్లతో రెసిపీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటున్నారు. టీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు చేసిన చిన్న పొరపాట్లకు మొత్తం హోటల్ వ్యాపార రంగంపై ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా రొటీన్‌గా నడిచే హోటళ్లు ఆదరణ కోల్పోతున్నాయి. దీంతో ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు ఎవరికి వారు ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, కాస్త ధర ఎక్కువైనా మనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసుకోవాలని హోటల్ నిర్వాహకులు, యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఆర్థికంగా వీటి నిర్వహణ భారమైనప్పటికీ పోటీ మార్కెట్లో తప్పదంటున్నారు. అదే సమయంలో ఆహారప్రియుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుందని సంతోషపడుతున్నారు. పార్టీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లువివాహాది శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. చిన్న కుటుంబం పుట్టినరోజు పార్టీ చేసుకుందామంటే ఫంక్షన్ హాల్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇటువంటి వారి కోసం హోటళ్లలో 20 నుంచి 30 సీటింగ్‌తో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంప్లిమెంటరీగా కేకులు సైతం ఉచితంగా అందిస్తామంటున్నారు.బిర్యానీలకు స్థానిక పేర్లు..హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీకి ఫేమస్. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఓ హోటల్లో వంటకాలకు స్థానిక పేర్లను పెడుతూ ఆకట్టుకుంటున్నారు. పాలకొల్లు ఫ్రై పీస్ బిర్యానీ, మొగల్తూరు మటన్ బిర్యానీ, రాజమండ్రి రొయ్యల బిర్యానీ, గుంటూరు మిర్చి కోడి బిర్యానీ, ఓజీ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు అంటూ కొత్తకొత్త పేర్లు మెనూలో కనిపిస్తున్నా యి. దీంతో పాటే దక్షిణ భారత దేశం రెసిపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం తయారీ విధానాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా, రీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు.మట్టి పాత్రలో..ప్రస్తుత రోజుల్లో మట్టి పాత్రల్లో వంట చేయడం గ్రామీణ ప్రాంతాల్లో సైతం కనుమరుగైందనే చెప్పాలి. స్టీల్, అల్యూమినియం పాత్రలు మన్నిక ఎక్కువగా వస్తాయని, అంతా అటువైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నగరంలోని హోటల్స్‌లో మాత్రం ప్రధానంగా కుండ బిర్యానీకి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కొన్ని హోటళ్లలో నేరుగా కుండలోనే బిర్యానీ వండి, వడ్డిస్తున్నారు. పార్సిల్ తీసుకునే వారికి నేరుగా కుండతోనే డెలివరీ ఇస్తున్నారు. దీన్ని ఆహార ప్రియులు ఆస్వాదిస్తున్నారు. ఆదరణ బాగుంది...ఒక థీమ్ ఎంపిక చేసుకున్నాం. మార్కెట్లో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. సాధారణంగా భోజనం తినే ప్లేట్లు రూ.200నుంచి 500లో లభిస్తాయి. అయినా ఇత్తడి ప్లేట్లు పెడుతున్నాం. ఒక్కో ప్లేటు ధర రూ.3500 వరకూ ఉంది. అలాగే యూత్ ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ మస్ట్ అన్నట్లు ఉన్నారు. దీనికోసం కొంత ప్లేస్ కేటాయించాం. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అప్డేట్ అవుతున్నాం. ఫుడ్ క్వాలిటీలో ఎక్కడా రాజీపడటంలేదు. అందుకే అందరి ఆదరణ పొందగలుగుతున్నాం. – ప్రసాద్, అశోక్, అద్భుతాహారం నిర్వాహకులు, రాయదుర్గం -
CWC Meeting: అతిథుల కోసం 78 రకాల వంటకాలు.. నోరూరాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్ నింపడం, బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. అతిథుల కోసం 78 రకాల వంటకాలు ఇక సీడబ్ల్యూసీ భేటీలకు వచ్చే నేత లకు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోపాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని వడ్డించనున్నారు. మొత్తంగా 78 రకాల వంటకాలను వడ్డించేలా పీసీసీ ఏర్పా ట్లు చేసింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిరకాల వంటలు, రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల ఇతర సీనియర్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించింది. ►అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంగటి, పాయ సూప్, ఖీమా రోటీ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ప్రూట్ సలాడ్ వంటివి వడ్డించనున్నారు. ►మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు. ►శాకాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు ఉండనున్నాయి. ►స్నాక్స్ ఐటమ్స్‌గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించనున్నారు. -
అత్యంత ఖరీదైన, బంగారంతో చేసిన ఫుడ్ గురించి తెలుసా!?
ఏ రూపంలో ఉన్న బంగారం బంగారమే! పసిడి అంటే అందరికీ ఇష్టమే. నగలా మారి అతివల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలోనూ... ఆపదల్లో ఆదుకునే కమోడిటిగానూ స్వర్ణానికి మంచి డిమాండ్ ఉంటుంది. మరి.. అదే బంగారం మనం తినే ఫుడ్‌లో కూడా ఉంటే! అచ్చంగా స్వచ్ఛమైన పసిడితో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటే ఆ మజానే వేరు కదా!! ఇంతకీ.. ప్రపంచంలోని బంగారంతో చేసిన, అత్యంత ఖరీదైన టాప్-5 డిషెస్ గురించి మీకు తెలుసా?! 1. సూరత్ గోల్డ్ మిఠాయి గుజరాత్‌లోని సూరత్ పట్టణం స్వీట్లకు పెట్టింది పేరు. ముఖ్యంగా అక్కడ బంగారంతో తీపి పదార్థాలు తయారు చేసే ‘‘24 క్యారెట్ మిఠాయి మ్యాజిక్’’ షాప్ బాగా ఫేమస్. అందులోనూ.. ఖర్జూరాలు, నెయ్యి, పిండితో చేసే గోల్డ్ మిఠాయి ‘ఘరీ’ అంటే అందరికీ మక్కువే. మరి బంగారంతో చేసిన స్వీట్ కదా. ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది. కిలో గోల్డ్ ఘరీ కొనుగోలు చేయాలంటే 9 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సాధారణ ఘరీ మాత్రం కేజీ 660- 820 రూపాయలకే దొరుకుతుంది. 2. గోల్డ్ దమ్ బిర్యానీ బిర్యానీ పేరు చెబితే చాలు నోట్లో నీరూరాల్సిందే. అలాంటిది బంగారంతో చేసిన బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటారు. అలాంటి వాళ్లు దుబాయ్‌లో ఎక్కువ మందే ఉన్నారట. మామూలుగానే అక్కడి వాళ్లకు బంగారం అంటే ప్రీతి. ఇక స్వచ్చమైన పసిడి మేళవింపుతో చేసిన రాయల్ గోల్డ్ బిర్యానీ అంటే మరీ ఇష్టమట. బంగారు పళ్లెంలో వడ్డించే ఈ బిర్యానీ సింగిల్ ప్లేట్ ధర రూ. 20 వేలు. బాంబేబోరోహ్.. యూఏఈ ఇన్‌స్టా పేజీ 3. 24 క్యారెట్ల ఐస్‌క్రీం హాంకాంగ్‌లో తయారు చేసే 24 క్యారెట్ల ఐస్‌క్రీంకు లగ్జరీ డిజర్ట్‌గా పేరుంది. సింగిల్ కోన్ ఐస్‌క్రీం లాగించాలంటే దాదాపు 950 రూపాయలు వెచ్చించాలి మరి! 4. 24 క్యారెట్ గోల్డ్ బర్గర్ కొలంబియాలోని టోరో మెకాయ్ రెస్టారెంట్లో అమ్మే 24 క్యారెట్ గోల్డ్ బర్గర్ ధర సుమారు. 4200 రూపాయలు. 5. గోల్డ్ పాన్ భారతీయులకు అత్యంత ఇష్టమైన మౌత్ ఫ్రెషనర్ పాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భోజనం తర్వాత పాన్ వేసుకుంటే.. అదో తృప్తి. ఇక ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో గల యామూస్ పాన్ షాపులో దొరికే గోల్డ్ పాన్‌కు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారట. ఈ పాన్ కనీస ధర 600 రూపాయలట. యామూస్ పంచాయత్ ఇన్‌స్టా పేజీ అఫిషియల్ చదవండి: Afghanistan: 20 ఏళ్ల తర్వాత స్వదేశానికి.. ఎవరీ అబ్దుల్ ఘనీ?! Afghanistan: అశ్రఫ్ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది -
తొలిసారి ప్రపంచాన్ని చూశా..
అనుబంధం అల్లిబిల్లి పదాలతో అద్భుత అర్థాలను సృష్టించిన పాటల రచయిత అతడు. ఆయన కలమే ఓ విప్లవ గళమై నినదిస్తుంది.. అమ్మలా లాలిస్తుంది. ఆయనకు ఇన్ని భావాలను, అనుభవాలను నేర్పించింది మాత్రం ఈ మహానగరమేని చెబుతాడిప్పుడు. ఆయన చంద్రబోస్. ప్రముఖ సినీగీత రచయిత. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామం చల్లగరిగ నుంచి వచ్చిన కుర్రాడు ఇప్పుడు భాగ్యనగరంతో పెనవేసుకుపోయాడు. నగరంపై ఆయన మమకారపు అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ‘1986లో హైదరాబాద్ వచ్చాను. అమ్మ, నాన్నల రక్షణ నుంచి అప్పుడే బయటకు రావటం. స్వతంత్రంగా హైదరాబాద్‌లో తిరగటం ప్రారంభమైంది. అప్పుడే తొలిసారి ప్రపంచాన్ని చూశాను. ఆకలి అనుభవం, ఒంటరితనం, అవమానం, దైన్యం, నైరాశ్యం ఇలాంటివన్నీ ఈ నగరంలో అనుభవించాను. కొంత కాలం తర్వాత సంపాదన, కీర్తి, విజయం, మానవత పొందాను. విభిన్న పార్శ్వాలు, ధ్రువాలు గల విశ్వనగరానికి సరైన నిర్వచనం హైదరాబాద్. ఇరానీ కేఫ్‌లో రూ. 2 సమోసాలతో పాటు పార్క్ హయత్‌లో రూ.3 వేల లంచ్ వరకు ఇక్కడ రుచి చూడవచ్చు. ఎంతో వైవిధ్యం ఉన్న నగరమిది. ఇక్కడ వాతావరణం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. నివాస యోగ్యమైన వాతావరణం. ఎలాంటి భయం లేని ప్రాంతం. ఇక్కడి భౌగోళిక వాతావరణం, ఉష్ణోగ్రత ఆరోగ్యకరంగా ఉంటాయి. హైదరాబాద్ అంటే ఒక్క ఊరు కాదు ఎన్నో ఊళ్ల (గ్రామాల) సమ్మేళనం. ఇక్కడ ఒక వైపు ఏపీ వారు, మరొక వైపు రాయలసీమవాసులు, తమిళులు, గుజరాత్, జైనులు, సిక్కులు, నేపాలీలు, కన్నడిగులు ఒక రేమిటి.. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషలు, సంస్కృతుల వారు ఇక్కడ ఉన్నారు. అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో కలిసి కట్టుగా ఉండేందుకు స్థిర నివాసాలు ఏర్పరుచుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. మంగా టిఫిన్ సెంటర్, గణపతి కాంప్లెక్స్‌ను ఆస్వాదించే వారు లక్షల్లో ఉన్నారు. మరోపక్క భారతదేశానికే ఆరోగ్య రాజధాని ఈ నగరం. సాఫ్ట్వేర్ రంగంలో మన స్థానం మనదే. ఇప్పుడు నగరం అభివృద్ధి మెట్రో కన్నా వేగంగా పరుగెడుతోంది. అన్ని వర్గాలు, మతాలు, అన్నీ పార్టీల ప్రజానీకాన్ని ఏకం చేసేది ఒక్కటే ఒక్కటి. అదే హైదరాబాద్ దమ్ బిర్యానీ’ అంటూ ముగించారు.