ఆహారం వడ్డించడానికి ఇత్తడి పళ్లెం, నీళ్లు తాగడానికి రాగి, గాజు గ్లాసు, బిర్యానీ వండేందుకు మట్టి కుండలు, ఆహారం వడ్డించేందుకు ఇత్తడి గరిటెలు, స్పూన్లు.. ఇదంతా ఎప్పుడో పూర్వకాలం రోజులు అనుకుంటే పొరపాటు పడినట్లే.. హైదరాబాద్ నగరంలో తాజాగా హోటల్ యాజమాన్యాలు అవలంబిస్తున్న ట్రెండ్ ఇది. వివిధ రకాల థీమ్‌లతో ఏర్పాటు చేస్తున్న హోటల్స్‌లో రుచికరమైన ఆహారంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో యువతను ఆకట్టుకునేందుకు సెల్ఫీ పాయింట్లు, స్టార్ హీరోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో కొత్తకొత్త పేర్లతో రెసిపీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటున్నారు.
టీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు చేసిన చిన్న పొరపాట్లకు మొత్తం హోటల్ వ్యాపార రంగంపై ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా రొటీన్‌గా నడిచే హోటళ్లు ఆదరణ కోల్పోతున్నాయి. దీంతో ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు ఎవరికి వారు ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, కాస్త ధర ఎక్కువైనా మనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసుకోవాలని హోటల్ నిర్వాహకులు, యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఆర్థికంగా వీటి నిర్వహణ భారమైనప్పటికీ పోటీ మార్కెట్‌లో తప్పదంటున్నారు. అదే సమయంలో ఆహారప్రియుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుందని సంతోషపడుతున్నారు.
పార్టీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు
వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. చిన్న కుటుంబం పుట్టినరోజు పార్టీ చేసుకుందామంటే ఫంక్షన్ హాల్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇటువంటి వారి కోసం హోటళ్లలో 20 నుంచి 30 సీటింగ్‌తో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంప్లిమెంటరీగా కేకులు సైతం ఉచితంగా అందిస్తామంటున్నారు.
బిర్యానీలకు స్థానిక పేర్లు..
హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీకి ఫేమస్. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఓ హోటల్లో వంటకాలకు స్థానిక పేర్లను పెడుతూ ఆకట్టుకుంటున్నారు. పాలకొల్లు ఫ్రై పీస్ బిర్యానీ, మొగల్తూరు మటన్ బిర్యానీ, రాజమండ్రి రొయ్యల బిర్యానీ, గుంటూరు మిర్చి కోడి బిర్యానీ, ఓజీ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు అంటూ కొత్తకొత్త పేర్లు మెనూలో కనిపిస్తున్నా యి. దీంతో పాటే దక్షిణ భారత దేశం రెసిపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం తయారీ విధానాన్ని యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, రీల్స్‌లో పోస్ట్
చేస్తున్నారు.
మట్టి పాత్రలో..
ప్రస్తుత రోజుల్లో మట్టి పాత్రల్లో వంట చేయడం గ్రామీణ ప్రాంతాల్లో సైతం కనుమరుగైందనే చెప్పాలి. స్టీల్, అల్యూమినియం పాత్రలు మన్నిక ఎక్కువగా వస్తాయని, అంతా అటువైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నగరంలోని హోటల్స్‌లో మాత్రం ప్రధానంగా కుండ బిర్యానీకి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కొన్ని హోటళ్లలో నేరుగా కుండలోనే బిర్యానీ వండి, వడ్డిస్తున్నారు. పార్సిల్ తీసుకునే వారికి నేరుగా కుండతోనే డెలివరీ ఇస్తున్నారు. దీన్ని ఆహార ప్రియులు ఆస్వాదిస్తున్నారు.
ఆదరణ బాగుంది...
ఒక థీమ్ ఎంపిక చేసుకున్నాం. మార్కెట్‌లో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. సాధారణంగా భోజనం తినే ప్లేట్లు రూ.200నుంచి 500లో లభిస్తాయి. అయినా ఇత్తడి ప్లేట్లు పెడుతున్నాం. ఒక్కో ప్లేటు ధర రూ.3500 వరకూ ఉంది. అలాగే యూత్ ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ మస్ట్ అన్నట్లు ఉన్నారు. దీనికోసం కొంత ప్లేస్ కేటాయించాం. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అప్‌డేట్ అవుతున్నాం. ఫుడ్ క్వాలిటీలో ఎక్కడా రాజీపడటంలేదు. అందుకే అందరి ఆదరణ పొందగలుగుతున్నాం. – ప్రసాద్, అశోక్,
అద్భుతాహారం నిర్వాహకులు, రాయదుర్గం
Comments
Please login to add a commentAdd a comment