నేడు నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించేలా లేవు. పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు పోటీకీ సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు శనివారంతో ముగుస్తుంది. దీంతో టిక్కెట్లు దక్కిన అభ్యర్థుల గుండెల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. బోథ్ నుంచి నామినేషన్ వేసిన కొమురం కోటేశ్వర్, ఖానాపూర్ బరిలోకి దిగాలని నిర్ణయించిన భరత్‌చౌహాన్‌లు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు.
సీపీఐ స్థానంలోనూ..
సీపీఐతో పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని కాంగ్రెస్ ఆ పార్టీకి కేటాయించింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ స్థానంపై కూడా కాంగ్రెస్ నేతలు కన్నేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చిలుముల శంకర్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయనను పోటీలో ఉండాలని జిల్లా కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తమకు కేటాయించిన స్థానంలో కాంగ్రెస్ నాయకులు ఎలా పోటీ చేస్తారని సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని చిలుముల శంకర్‌పై టీ కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. చెన్నూరు స్థానానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు దాసారపు శ్రీనివాస్ మాత్రం ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్లో..
సిర్పూర్ స్థానానికి టీఆర్ఎస్ మహిళా నాయకురాలు పాల్వయి రాజ్యలక్ష్మి తన కుమారుడు హరీష్‌రావుతో నామినేషన్ వేయించారు. ఆమె తన కుమారుడితో నామినేషన్ ఉపసంహరింప చేయాలనే నిర్ణయానికి వచ్చినప్పటికీ, టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యకు మద్దతుగా ఎన్నికల్లో పనిచేయడం ప్రశ్నార్థకమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్‌రావుకే పరోక్ష మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్ పోటీలో ఉండే అవకాశాలే ఉన్నాయి. మంచిర్యాలలో టీఆర్ఎస్ రెబల్‌గా నామినేషన్ వేసిన సిరిపురం రాజేష్ శనివారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆసిఫాబాద్ స్థానానికి నామినేషన్ వేసిన టీఆర్ఎస్ నాయకులు పెందూరు గోపి మాత్రం బరిలో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ స్థానానికి నామినేషన్ వేసిన విజయలక్ష్మిచౌహాన్ బరి నుంచి తప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు వేసిన టీడీపీ నాయకులు దుర్గం నరేష్ (చెన్నూరు), నారాయణరెడ్డి (ముథోల్), ఓం ప్రకాష్లడ్డా (ముథోల్)లు శనివారం నామినేషన్లు ఉపసంహరించుకోనున్నారు. సిర్పూర్ స్థానానికి నామినేషన్ వేసిన బుచ్చిలింగం ఉపసంహరణపై శనివారం నిర్ణయం తీసుకోనున్నారు.