E-cigarette
-
'ఈ–సిగరెట్స్ ఉంటే ఇచ్చేయండి'
సాక్షి, మంగళగిరి: దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకం, ఉత్పత్తి, తయారీ, దిగుమతి, అమ్మకం తదితరాలను నిషేధిస్తూ కేంద్రం గత వారం (సెప్టెంబరు18) ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ–సిగరెట్లను వినియోగించడం, విక్రయించడం, కలిగి ఉండటం, రవాణా చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా కేంద్రం పరిగణించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం, ఎస్సైలకు ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిఘాతో పాటు స్వాధీనం చేసుకునే అధికారం కల్పించబడింది. 1940 డ్రగ్స్ కాస్మటిక్స్ చట్టం ద్వారా లైసెన్స్ పొందిన ఉత్పత్తులను మినహాయించి.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ నికోటిన్ ఉత్పత్తులు, ఈ–హుక్కా ఏ పరిమాణం, రూపం, ఆకారాన్ని కలిగి ఉన్నా ఎలక్ట్రానిక్ సిగరెట్లుగా పరిగణించబడతాయి. ఈ నేరాలు చేసిన వారికి ఒక సంవత్సరం జైలు లేదా రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. అంతేకాక నిషేధిత ఈ–సిగరెట్ల ద్వారా నేరాన్ని పునరావృతం చేస్తే.. మూడు సంవత్సరాల జైలుతో పాటు 5 లక్షల భారీ జరిమానా విధిస్తామని ఈ మేరకు హెచ్చరించింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిల్వ చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా యాభై వేల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి. ఇకపై నగరంలో ఈ–సిగరెట్లపై నిఘా కొనసాగుతుందని, చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంగళగిరి పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వ్యాపారులు, వ్యక్తులు... ఇలా ఎవరి వద్దనైనా ఈ–సిగరెట్లు ఉంటే తక్షణం వాటిని స్థానిక పోలీసుస్టేషన్లలో అప్పగించాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా కేంద్రం విడుదల చేసిన ఈ ఆర్డినెన్స్‌లో రాష్ట్రంలోని రైల్వే పోలీసు సూపరింటెండెంట్లతో సహా అందరు పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లు అవసరమైన చర్యలు తీసుకొని, నెల పాటు ఆశించిన ఫలితాలు రాబట్టాలని సూచనలు జారీ చేసింది. చదవండి: ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం? ఇ–సిగరెట్లపై నిషేధం -
ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇ-సిగరెట్లపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. అంటే, పొగను ఉత్పత్తి చేసే పరికరాలను దేశంలో తయారు చేయడం, వాటిని దిగుమతి చేసుకోవడం లేదా అమ్మడం ఇక మీదట నిషేధం. దేశంలో ధూమపానానికి బానిసలైన వారిని, ఆ బానిసత్వం నుంచి తప్పించి వారితో ధూమపానాన్ని మాన్పించాలనే ఉద్దేశంతో తొలుత ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ లక్ష్యం నెరవేక పోగా, విద్యార్థులు, యువత ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లకు ఎక్కువ అలవాటు పడడం మొదలైంది. చదవండి: ఇ–సిగరెట్లపై నిషేధం అమెరికాలో హైస్కూల్ విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇ-సిగరెట్లకు ఎక్కువ బానిసలవుతున్నారని అక్కడి నుంచి అందిన డేటా తెలియజేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. గత 30 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మొదటిసారి యువత ఇ-సిగరెట్లకు అలవాటు పడినట్లు అక్కడి డేటా తెలియజేస్తోంది. పొగాకుతో చేసిన రెగ్యులర్ సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్లు వస్తాయని, ఇ-సిగరెట్ల వల్ల ఎలాంటి జబ్బులు రావని చెప్పడమే కాకుండా వాటిలో రకరకాల ఫ్లేవర్లు తీసుకరావడంతో ఈ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే విస్తరించింది. పొగాకు సిగరెట్ల వల్ల మానవులకు క్యాన్సర్ వస్తుందని వైద్యులు తేల్చి చెప్పడానికి కొన్ని దశాబ్దాల సమయం పట్టింది. అదే ఇ-సిగరెట్ల వల్ల ఎలాంటి జబ్బులు రావని వైద్యులు తేల్చి చెప్పడానికి ఎక్కువ కాలం పట్టక పోవడానికి కారణాలను ఊహించవచ్చు. మార్కెట్ వర్గాలు ఇప్పటి వరకు వారి ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకోగలిగాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం పెరగడమో, మరో కారణమో తెలియదుగానీ ఇ-సిగరెట్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ వరుసగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకొని ఉంటుందనడంలో సందేహం లేదు. మరి అంతే ప్రమాదకరమైన పొగాకు సిగరెట్లను నిషేధించే దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? పొగాకు సిగరెట్లతో క్యాన్సర్లు వచ్చినా ఫర్వాలేదుగానీ ఇ-సిగరెట్ల వల్ల రాకూడదనే ఉద్దేశమా ? అయితే ఎందుకు ? దీనికి సమాధానం వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. దేశంలో సిగరెట్ల పరిశ్రమ 11.79 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడంతోపాటు 4.57 కోట్ల మందికి ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బడ్డీ కొట్లు నడవడానికి సిగరెట్లే ఎక్కువగా తోడ్పడుతున్నాయి. పొగాకు పంటలపై లక్షలాది మంది రైతులు కూడా ఆధారపడి బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇ-సిగరెట్ల పరిశ్రమ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ దశలో చర్య తీసుకోకపోతే ఆ పరిశ్రమ విస్తరించి పొగాకు సిగరెట్ల పరిశ్రమ ఉనికిని దెబ్బతీసే అవకాశం ఉందని, తద్వారా కోట్లాది మందికి ఉపాధి పోతుందని భావించే కేంద్రం ‘నిషేధం’ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. పొగాకుతో పోలిస్తే గంజాయితో తక్కువ నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కనుక గంజాయిని చట్టబద్ధం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నా ఆ దిశగా చర్య తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సాహసించడం లేదు. -
ఈ–సిగరెట్‌తో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ!
సిగరెట్ మానాలనే ఉద్దేశంతో కొందరు ఈ–సిగరెట్ వాడుతుంటారు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం ఇప్పటికే పలు అధ్యయనాల్లో తెలిసింది. అంతేకాదు... దాని నుంచి వచ్చే రసాయన ఆవిర్ల వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఎలుకలపై నిర్వహించిన ఈ పరీక్షలో సాధారణ పొగాకుతో ఎన్ని అనర్థాలు వస్తాయో... ఈ–సిగరెట్‌తో సైతం అన్ని అనర్థాలే ఉంటాయని తేలడంతో పాటు ఈ–సిగరెట్లో వెలవడే రసాయనాలు మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకులు కలిగిస్తాయని తేలింది. టెక్సాక్–టెక్ యూనివర్సిటీలోని నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తేటతెల్లమైంది. వారి పరిశోధనల్లో తేలిన అంశాలను హ్యూస్టన్‌లో నిర్వహించిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్‌లో ఇటీవలే పరిశోధకులు వెల్లడించారు. -
ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు
లండన్: మామూలు సిగరెట్ కంటే ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఎలుకలపై జరిపిన వేరువేరుగా జరిపిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 10 రోజుల పాటు ఈ-సిగరెట్ పొగ ప్రభావానికి గురిచేసిన ఎలుకల్లో గుండె, నరాలు బాగా దెబ్బతిన్నాయని, ఇది ఎలుకల్లో మామూలు సిగరెట్ పొగ చూపే దుష్ప్రభావం కంటే అధికంగా ఉందని టెక్సాస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఈ-సిగరెట్ ప్రభావానికి గురైన ఎలుకల్లో మెదడు గ్లూకోజ్‌ను తీసుకునే పరిమాణం బాగా తగ్గిపోయిందని, తద్వారా మెదడు యాక్టీవ్‌గా పనిచేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఇక రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ఎంజైమ్‌పై రెండు రకాల సిగరెట్లు తీవ్ర దుష్ఫలితాలు చూపుతున్నాయని వెల్లడించారు. -
ఈ–సిగరెట్లు వద్దు!
డబ్ల్యూహెచ్ఓ సూచన సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న ఈ–సిగరెట్ల (ఎలక్ట్రానిక్ సిగరెట్ల) వినియోగాన్ని కట్టడి చేసే చర్యలను ప్రపంచ దేశాలు పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. సిగరెట్ మానేసేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని తన నివేదికలో తెలిపింది. పొగాకు నియంత్రణకు సంబంధించి సోమవారం నుంచి భారత్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ సూచన చేసింది. – సాక్షి, ఏపీ డెస్క్ పొగాకు వినియోగం కారణంగా ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పొగాకు నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ‘ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్’పై సంతకాలు చేసిన 180 దేశాలు సోమవారం భారత్‌లో సమావేశం కానున్నాయి. సమావేశపు అజెండాలో ‘వేపింగ్’ కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ–సిగరెట్లపై ఇంకా నిషేధం విధించని దేశాలు వాటిపై కఠిన నియంత్రణలు విధించే అంశాన్ని పరిశీలించాలని డబ్ల్యూహెచ్ఓ సూచిం చింది. ఈ–సిగరెట్ల ఫ్లేవర్లపై నిషేధం విధించడంతో పాటు అమ్మకాలు, ప్రకటనలు, యువకులు వినియోగించడంపై కఠిన ఆంక్షలు విధించాలని కోరింది. కఠిన నిబంధనలు అవసరం... నికోటిన్ విడుదల చేసే పరికరాల గురించి పలు దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నివేదిక రూపొందించామని కన్వెన్షన్ సెక్రటేరియట్ హెడ్ డాక్టర్ వెరా లూయిజా డిసిల్వా తెలిపారు. ‘ఈ–సిగరెట్లపై నియంత్రణలు ఉండాలని స్పష్టమైన అభిప్రాయం ఉంది. యువకులు, గర్భిణులు వీటిని వినియోగించడాన్ని ప్రోత్సహించకూడదు. కఠిన నియంత్రణలు అవసరం.’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ–సిగరెట్లను నిషేధించిన దేశాలు అర్జెంటినా బ్రెజిల్ కాంబోడియా సింగపూర్ యుఏఈ ఉరుగ్వే వెనిజులా సీషెల్స్ ఈ–సిగరెట్లూ ప్రమాదకరమే! ఈ సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకర రసాయనాలే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రెండింటిలోనూ నికోటిన్ కామన్‌గానే ఉంటుందని, ఇది దానికి బానిస చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సిగరెట్లలోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలు, విషపూరిత రసాయనాలు ఉంటాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్ల నుంచి వచ్చే దుష్పరిణామాలు ఈ సిగరెట్లతోనూ వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటిల్లోనూ ఉండేది నికోటినే కా బట్టి, వీటికీ అడిక్ట్ అవుతారని పేర్కొంటున్నారు. 60 లక్షలు: ధూమపానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న మరణాలు 6: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరు సెకన్లకు ఓ మరణం సంభవిస్తోంది 22%: ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వారిలో 22 శాతం మంది ధూమపానం సేవిస్తున్నారు. 12%: ప్రపంచవ్యాప్తంగా పొగతాగేవారిలో భారతీయులు 9: లక్షలు ధూమపానంతో భారత్‌లో ఏటా సంభవిస్తున్న మరణాలు