సాక్షి, మంగళగిరి: దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకం, ఉత్పత్తి, తయారీ, దిగుమతి, అమ్మకం తదితరాలను నిషేధిస్తూ కేంద్రం గత వారం (సెప్టెంబరు18) ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ–సిగరెట్లను వినియోగించడం, విక్రయించడం, కలిగి ఉండటం, రవాణా చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా కేంద్రం పరిగణించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం, ఎస్సైలకు ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిఘాతో పాటు స్వాధీనం చేసుకునే అధికారం కల్పించబడింది. 1940 డ్రగ్స్ కాస్మటిక్స్ చట్టం ద్వారా లైసెన్స్ పొందిన ఉత్పత్తులను మినహాయించి.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ నికోటిన్ ఉత్పత్తులు, ఈ–హుక్కా ఏ పరిమాణం, రూపం, ఆకారాన్ని కలిగి ఉన్నా ఎలక్ట్రానిక్ సిగరెట్లుగా పరిగణించబడతాయి.
ఈ నేరాలు చేసిన వారికి ఒక సంవత్సరం జైలు లేదా రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. అంతేకాక నిషేధిత ఈ–సిగరెట్ల ద్వారా నేరాన్ని పునరావృతం చేస్తే.. మూడు సంవత్సరాల జైలుతో పాటు 5 లక్షల భారీ జరిమానా విధిస్తామని ఈ మేరకు హెచ్చరించింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిల్వ చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా యాభై వేల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి. ఇకపై నగరంలో ఈ–సిగరెట్లపై నిఘా కొనసాగుతుందని, చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంగళగిరి పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వ్యాపారులు, వ్యక్తులు... ఇలా ఎవరి వద్దనైనా ఈ–సిగరెట్లు ఉంటే తక్షణం వాటిని స్థానిక పోలీసుస్టేషన్లలో అప్పగించాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా కేంద్రం విడుదల చేసిన ఈ ఆర్డినెన్స్‌లో రాష్ట్రంలోని రైల్వే పోలీసు సూపరింటెండెంట్లతో సహా అందరు పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లు అవసరమైన చర్యలు తీసుకొని, నెల పాటు ఆశించిన ఫలితాలు రాబట్టాలని సూచనలు జారీ చేసింది.
చదవండి: ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం?
Comments
Please login to add a commentAdd a comment