ఐటీ వృద్ధి 12-14 శాతం: నాస్కామ్
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీ ఐటీ ఎగుమతులు 12 నుంచి 14 శాతం పెరుగుతాయని నాస్కామ్ తెలిపింది. గత అంచనా వృద్ధి 13-15 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కరెన్సీ విలువలో అస్థిరత, స్థూల ఆర్థిక ఒడి దుడుకులను దీనికి కారణాలుగా పేర్కొంది. భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ వృద్ధిని స్థిరంగా కొనసాగిస్తామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డిలు పేర్కొన్నారు. వారు మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశీ, ఈ-కామర్స్ ఆదాయాలతోపాటు మొత్తం ఐటీ పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 146 బిలియన్ డాలర్లుగా, వచ్చే ఏడాది 165 -169 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
2020 నాటికి ఈ మొత్తం 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపారు. దీనిలో ఈ-కామర్స్ విభాగం వాటా 75 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 35 నుంచి 40% వరకు ఐటీ పరిశ్రమ ఆదాయం డాలర్లకు రూపంలో కాకుండా యూరోలలో వస్తున్నాయని చెప్పారు. దీంతోపాటు కొత్తగా 2.3 లక్షల ఉద్యోగాల కల్పనతో ఐటీ పరిశ్రమలో మొత్తం ఉద్యోగులు 35 లక్షలకు చేరుతారని తెలిపారు. కానీ ఉద్యోగ నియామకాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. అధిక ఉత్పాదకత కారణంగానే పరిశ్రమ ఆదాయంతో పోలిస్తే ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. సిబ్బంది లో దాదాపు 1/3 వ వంతు మహిళలే ఉన్నారని పేర్కొన్నారు.
రెండేళ్లలో రెండో అతి పెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్
వచ్చే రెండేళ్లలో యూఎస్ తర్వాత రెండో అతి పెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ ఆవిర్భవించనుందని చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఏడాది భారత్‌లో 800 కొత్త టెక్నాలజీ స్టార్టప్‌లు ప్రారంభకానున్నాయని తెలిపారు. దీంతో దేశంలో మొత్తం స్టార్టప్‌ల సంఖ్య 3,100కు చేరుతుందని పేర్కొన్నారు. బ్రిటన్,ఇజ్రాయెల్‌లతో పోలిస్తే భారత్‌లోనే స్టార్టప్‌ల వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
దేశీ కంపెనీలు స్థానికంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి వృద్ధిని నమోదుచేస్తున్నాయని చె ప్పారు. ఈ కంపెనీలు 2010 నుంచి ఇప్పటివరకు 2.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని తెలిపారు. స్టార్టప్‌లు టెక్నాలజీ, డాటా అండ్ అనలైటిక్, రియాల్టీ, విద్యా, హెల్త్‌కేర్, తదితర విభాగాల్లో నిమగ్నమై ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న సంఖ్యలో ఉన్న పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో విజయవంతమైన చిన్న కంపెనీలు దేశంలో చాలా ఉన్నాయని తెలిపారు.