Each
-
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
డిండి హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సూచించారు. గురువారం మండలంలోని తవక్లాపూర్ గ్రామంలో ఆయన మెుక్కలు నాటి మాట్లాడారు. మనం నాటిన మొక్కలు ముందు తరాలకు ఉపయోగపడాలనే సదుద్ధేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు రాజనేని వెంకటేశ్వరరావు, బల్ముల తిరుపతయ్య, జయానందం, బయ్య వెంకటయ్య, బొడ్డుపల్లి కృష్ణ, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛందంగా మెుక్కలు నాటాలి
మెట్పల్లి : పర్యావరణ పరిరక్షణకోసం ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సూచించారు. పట్టణంలోని ఖాదీ ప్రతిష్టాన్‌లో సోమవారం హరితహారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి ఉమారాణి, నాయకులు మర్రి సహదేవ్, ద్యావత్ నారాయణ, సోమిడి శివ, ఖాదీ జీఎం వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి మొక్కనూ సంరక్షించాలి
గుండ్రాంపల్లి (చిట్యాల) : హరితహారం కార్యక్రమంలో హైవే పక్కన నాటిన ప్రతి మొక్కను సంరంక్షించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. మంగళవారం ఆయన నల్లగొండలో జరిగే సమావేశానికి వెళ్తూ మండలంలోని గుండ్రాంపల్లి శివారులో హైవే వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ నాటిన వేప మొక్క దగ్గరగా వెళ్లి పరిశీలించారు. సీఎం నాటిన మొక్కకు రక్షణగా ట్రీ గార్డు ఏర్పాటు చేకపోవడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. వెంటనే ట్రీ గార్డును ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మొక్కలకు రోజుకు ఎన్నిసార్లు నీరు పోస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎండిన మొక్కలను పరిశీలించి వెంటనే వాటిని తొలగించి కొత్తవాటిని నాటాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన గుండ్రాంపల్లి సింగిల్ విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్‌ను ‘హరితహారంలో పాల్గొంటున్నారా..?’ అని ప్రశ్నించారు. ఇందుకు ఆయన ‘అందరూ పాల్గొంటున్నారు’ అని బుదులివ్వడంతో మంత్రి సంతప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట పలువురు ఆటవీ శాఖ అధికారులు ఉన్నారు. -
మంత్ర జపానికి విధివిధానాలు ఉన్నాయ్
రాజమండ్రి కల్చరల్, న్యూస్‌లైన్ :ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన స్వరం ఉంటుంది. సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌గా గాయత్రీ మంత్రాన్నో, మరో మంత్రాన్నో అమర్చుకోవడం మనలను ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో వెనక్కు తీసుకువెళుతుందని మహా సహస్రావధాని, సాగరఘోష కవి గరికిపాటి నరసింహారావు అన్నారు. మంత్రం రహస్యం కాబట్టే, ఉపనయన సమయంలో తండ్రి వటువునకు ఉత్తరీయం అడ్డుపెట్టి గాయత్రీమంత్రం ఉపదేశిస్తారన్నారు. గౌతమఘాట్‌లోని అక్షరకోటి గాయత్రీ శ్రీచక్రపీఠంలో బుధవారం ఉదయం . జరిగిన ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన ప్రసంగించారు. గాయత్రీ ఉపాసన, సూర్యారాధన ఒకటేనని ఆయన పేర్కొన్నారు. అన్ని శాస్త్రాలకు మానవత్వం మూలమని, అనాధ ప్రేత సంస్కారం అశ్వమేధ యాగంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. శ్రీమద్రామాయణంలోని సుందరకాండలో వాల్మీకి మహర్షి చెప్పిన త్రిజట స్వప్నం గాయత్రీ మంత్రార్థాన్ని వివరిస్తున్నదని గరికిపాటి పేర్కొన్నారు. ‘రామాయణంలో 24 వేల శ్లోకాలు ఉన్నాయి, గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలలోని మొదటి అక్షరాన్ని చేరిస్తే గాయత్రీ మంత్రమవుతుంది’ అని గరికిపాటి అన్నారు. ఆద్యంతం గరికిపాటి ప్రసంగం హాస్యోక్తులతో సాగింది. సభకు అధ్యక్షత వహించిన ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి మాట్లాడుతూ ఆరు సార్లు భూప్రదక్షిణం, పది వేల సార్లు కాశీయాత్ర, వందలాది పర్యాయాలు రామేశ్వరంలో సేతు దర్శనం చేయడం వలన వచ్చే పుణ్యం ఒక్కసారి తల్లికి నమస్కరించడం వలన వస్తుందన్నారు. విశ్రాంత ఆచార్యులు శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ శరీరంలో సూక్ష్మాతిసూక్ష్మమైన ప్రాణ స్థానాలను రక్షించేది గాయత్రీ మంత్రమేనన్నారు. అనంతరం గాయత్రీ పీఠ ప్రతిభా పురస్కారాన్ని అక్షరకోటి గాయత్రీ శ్రీచక్రపీఠం వ్యవస్థాపకుడు సవితాల చక్రభాస్కరరావు, కార్యదర్శి డాక్టర్ గంటి కల్యాణశర్మ తదితరులు గరికిపాటికి అందజేశారు. గరికిపాటిని ‘సరస్వతీ సామ్రాజ్య సార్వభౌమ’ బిరుదంతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ డి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం స్వాగత వచనాలు పలికారు. ఘనంగా ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠాపన వేదమంత్ర పారాయణల నడుమ, బుధవారం ఉదయం అక్షరకోటి గాయత్రీపీఠంలో పంచముఖ గాయత్రీ ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. అనంతరం గాయత్రీమాతకు పుష్పాభిషేకం చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.