మధ్యవర్తులే సూత్రధారులు
- ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై బలపడుతున్న సందేహాలు
- సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ పాత్రపై అనుమానాలు
- ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కన్సల్టెన్సీలు
- అభ్యర్థుల తల్లిదండ్రులను సంప్రదించి ఒప్పందాలు!
- పరీక్షకు వారం ముందే కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిన విద్యార్థులు
- ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉండి పరీక్షకు హాజరు
- టీఎస్ ఎంసెట్-1, ఏపీ ఎంసెట్లలో 10-15 వేలకుపైన ర్యాంకులు
- ఎంసెట్-2లో మాత్రం వందల్లోపు ర్యాంకులు వచ్చిన వైనం
వరంగల్: వైద్య విద్య అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపై సందేహాలు మరింతగా బలపడుతున్నాయి. సాధారణ విద్యార్థులకు కూడా ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు చెల్లించగల వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు మధ్యవర్తులు, కొన్ని కన్సల్టెన్సీలు ఈ వ్యవహారానికి తెరలేపాయనే ఆరోపణలు వస్తున్నా యి. ఒకే కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది పరీక్షకు వారం ముందు అక్కడ లేకుండా పోయిన వారికి మెరుగైన ర్యాంకులు వచ్చాయని పలువురు అభ్యర్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
తొలి ఎంసెట్ జరిగిన 40 రోజుల్లోనే ఎంసెట్-2 జరిగిందని.. ఇంత తక్కువ సమయంలోనే ఏకంగా వేలకుపైగా ర్యాంకుల నుంచి వందల్లోపు ర్యాంకులు రావడం అసాధారణమని పేర్కొంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు కన్సల్టెన్సీలు కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు లక్ష్యంగా.. వారి తల్లిదండ్రులతో మధ్యవర్తులు సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎలా జరిగింది?
వరంగల్ జిల్లా భూపాలపల్లి, పరకాల ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివారు. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1 పరీక్షలు రాశారు. తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్నారు. షార్ట్‌టర్మ్ కోచింగ్ కోసం వారిలో దాదాపు 19 మంది విజయవాడలోని బ్రిలియంట్ కోచింగ్ సెంటర్లో చేరారు. 40 రోజుల కోచింగ్ కోసం భారీగా ఫీజు చెల్లించారు. కానీ ఎంసెట్-2 పరీక్షకు వారం ముందే కోచింగ్ వదిలేసి.. బయటికి వచ్చారు. తర్వాత హైదరాబాద్‌లో పరీక్ష రాశారు. ఇలా పరీక్షకు వారం ముందు కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన వారికి వందల్లో ర్యాంకులు వచ్చాయి. విజయవాడలో పరీక్ష రాసిన వారికి మాత్రం ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1 తరహాలోనే వేలకుపైగా ర్యాంకులు వచ్చాయి.
పరకాల, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లో ఓ విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 24 వేలకుపైన ర్యాంకు, టీఎస్ ఎంసెట్-1లో 17 వేలకుపైన ర్యాంకు రాగా... ఎంసెట్-2లో ఏకంగా ఏడు వందలలోపు ర్యాంకు రావడం గమనార్హం. మరో విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 9 వేలకుపైన ర్యాంకు, టీఎస్ ఎంసెట్-1లో దాదాపు అదే ర్యాంకురాగా... ఎంసెట్-2లో మాత్రం మూడు వందలలోపు ర్యాంకు వచ్చింది. మరో విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 27 వేలపైన, ఎంసెట్-1లో 20వేలపైన ర్యాంకులు రాగా... ఎంసెట్-2లో తొమ్మిది వందలలోపు ర్యాంకు వచ్చింది. దీంతో ఎంసెట్-2 పేపర్ లీకయినట్లుగా సందేహాలు బలపడుతున్నాయి.
వారం రోజుల్లోనే..
ఎంసెట్-2 పరీక్ష సమయం దగ్గర పడుతున్న సమయంలో విద్యార్థులు మరింతగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కానీ కొందరు విద్యార్థులు పరీక్ష దగ్గర పడిన సమయంలో కోచింగ్ నుంచి బయటకు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోచింగ్ తీసుకున్న విజయవాడలోగానీ, సొంత జిల్లా వరంగల్లోగానీ పరీక్షలు రాయాల్సి ఉండగా... హైదరాబాద్‌లో పరీక్షలు రాయడంతో సందేహాలు బలపడుతున్నాయి. ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించి ఒక విద్యార్థికి టీఎస్ ఎంసెట్-1లో 7 మార్కులురాగా.. ఎంసెట్-2లో 30కిపైగా మార్కులు ఎలా వచ్చాయనే ప్రశ్న తలెత్తుతోంది.
భూపాలపల్లి పట్టణంలోని ఓ వ్యాపారి తన కుమార్తెను విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చేర్పించారు. ఆమెకు ఎంసెట్-1లో 15వేలకుపైన, ఏపీ ఎంసెట్‌లో 20వేలకుపైన ర్యాంకు వచ్చింది. దీంతో ఎంసెట్-2 షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం మే నెలలో విజయవాడలోని బ్రిలియంట్ కోచింగ్ సెంట ర్లో చేర్పించారు. శిక్షణకు రోజుకు రూ.వెయ్యి చొప్పున 45 రోజులకు రూ.45 వేలు ఫీజు మాట్లాడుకున్నారు. కానీ కోచింగ్ పూర్తి కావడానికి వారం ముందే ఆమె అకాడమీ నుంచి బయటకు వచ్చిందని, ఇంటికి కూడా వెళ్లకుండా తండ్రితో కలసి హైదరాబాద్‌కు వెళ్లారని సమాచారం. శ్రీచైతన్య కళాశాలలో చదివి, బ్రిలియంట్ అకాడమీలో శిక్షణ పొందిన భూపాలపల్లికి చెందిన మరో విద్యార్థినికి కూడా ఎంసెట్-2లో మంచి ర్యాంకు వచ్చినట్లు తెలిసింది.
పరకాల పట్టణానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు శ్రీచైతన్య కళాశాలలో చదివి, బ్రిలియంట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు సమాచారం. భూపాలపల్లికి చెందిన విద్యార్థుల కంటే పరకాల విద్యార్థులు బాగా చదివేవారని తెలిసింది. అయితే వారిలో ఉత్తమ విద్యార్థులకు కాకుండా... ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1లో ప్రతిభ కనబరచని వారికి మంచి ర్యాంకులు వచ్చాయి. దీంతో పరకాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి సమాచారాన్ని సేకరించగా.. లీకేజీ సమాచారం బయటకు పొక్కింది. ఈ మేరకు బుధవారం ఇంటలిజెన్స్ అధికారులు పరకాలలో విచారణ జరిపినట్లు తెలిసింది.
తక్కువ సమయంలోనే ర్యాంకులెలా పెరిగాయి?
‘‘టీఎస్ ఎంసెట్-1లో 15 వేలకుపైగా, ఏపీ ఎంసెట్‌లో 20 వేలకుపైగా ర్యాంకు వచ్చిన వారికి కొద్ది రోజుల్లోనే జరిగిన ఎంసెట్-2లో వందల్లో ర్యాంకులు ఎలా వస్తాయి? ప్రశ్నపత్రం లీకేజీ వాస్తవంగానే కనిపిస్తోంది. దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. ఎంసెట్-2 మళ్లీ నిర్వహించాలి..’’
- ఎం.పురుషోత్తం, ఎంసెట్-2లో
3,470 ర్యాంకు సాధించిన పూజ తండ్రి
బాధ్యులపై కఠిన చర్యలు: కడియం
ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంటలిజెన్స్, సీబీసీఐడీలు విచారణ చేపడుతున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: పరీక్షకు ముందే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైందంటూ వచ్చిన ఆరోపణలపై డీజీపీ అనురాగ్‌శర్మ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ఎంసెట్ కన్వీనర్ రమణారావు బుధవారం లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించారు. కొంత మంది తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని.. ఆదిశగా కూడా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. అనుమానం ఉన్న కోచింగ్ సెంటర్లలో ఆరా తీయనున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎంసెట్ ప్రశ్నపత్రం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని.. ఆయనే కొన్ని ప్రశ్నలు లీక్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ దిశగా దర్యాప్తునకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎంసెట్ లీకేజీపై ఆధారాలు లభిస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. మరోవైపు ఈ నెల 25వ తేదీ నుంచి జరిగే ఎంబీబీఎస్, బీడీఎస్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ యధావిధిగా ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.