ఎంసెట్ లీకేజీపై కేసు! | Call records to be collected in eamcet leakage case | Sakshi
Sakshi News home page

ఎంసెట్ లీకేజీపై కేసు!

Published Sun, Jul 24 2016 3:28 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

ఎంసెట్ లీకేజీపై కేసు!

ఎంసెట్ లీకేజీపై కేసు!

- పూర్తిస్థాయి దర్యాప్తు కోసం నమోదు యోచనలో సీఐడీ
- కాల్ రికార్డుల సేకరణ, అనుమానితుల కస్టడీ కోసం
- కేసు నమోదు తప్పనిసరి!
బ్రోకర్ వెంకట్రావును విచారించాలని అధికారుల నిర్ణయం
- క్షేత్రస్థాయిలో ప్రాథమిక దర్యాప్తు ముమ్మరం
- బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు

 
 సాక్షి, హైదరాబాద్, పరకాల: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంపై కేసు నమోదు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా అనుమానితులను కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించింది. దాంతోపాటు ఫోన్ కాల్ రికార్డులను సంబంధిత కంపెనీల నుంచి తెప్పించుకోవాలంటే కేసు నమోదు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. దీంతో సోమవారం కేసు నమోదు చేసేందుకు సీఐడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
 ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు ఎంసెట్-1లో వేలకుపైగా ర్యాంకు వచ్చి, ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు సాధించిన వారు 24 మంది ఉన్నట్లు గుర్తించారు. బ్రోకర్‌గా చెలామణీ అవుతున్న వెంకట్రావు సెల్‌ఫోన్ నుంచి వీరిలో కొందరికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. వారి సంభాషణల కాల్ రికార్డులను సంబంధిత కంపెనీల నుంచి తెప్పించి, పరిశీలించాల్సి ఉందని సీఐడీ అధికారులు పేర్కొంటున్నారు.
 
 కేంద్రంగా మారిన వెంకట్రావు
 సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్ తయారీ-ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్ కాల్స్-ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. జేఎన్టీయూ అధికారుల నుంచి ప్రశ్నపత్రం తయారీ, ఎంపిక, నిర్వహణలపై స్పష్టత తీసుకున్నారు. ప్రశ్నపత్రం రూపకల్పనలో భాగస్వామ్యం అయిన కమిటీ సభ్యులను పిలిచి ప్రశ్నించారు. కానీ  ఎలాంటి ఆధారాలు లభించలేదు.  అన్నింటికి కేంద్రంగా మారిన బ్రోకర్ వెంకట్రావు విషయాన్ని తేల్చితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఐడీ భావిస్తోంది. వెంకట్రావు  విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి అంతగా భరోసా ఇవ్వడానికి గల కారణాన్ని తెలుసుకోవాలని నిర్ణయించింది. వెంకట్రావుకు ఎవరెవరితో సంబంధాలున్నాయనే అంశాన్ని వెలికి తీయాలంటే.. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించక తప్పదని సీఐడీ భావిస్తోంది.
 
 క్షేత్రస్థాయిలో విచారణ ముమ్మరం
 ప్రశ్నపత్రం లీకైనట్లు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు తల్లిదండ్రులకు సీఐడీ అధికారులు ఫోన్ చేసి సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. సీఐడీ డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ ప్రాంతాల్లో ఎంతమంది ర్యాంకుల్లో తేడాలు వచ్చాయో తెలుసుకున్నారు. వారి దగ్గర ఉన్న ఆధారాలేమిటనే ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏపీ ఎంసెట్, ఎంసెట్-1, ఎంసెట్-2లలో వచ్చిన మార్కులు, ర్యాంకులు సహా వివరాలు తెలిపినట్లు తెలిసింది. మరోవైపు సీఐడీ విచారణ పేరుతో కాలయాపన చేస్తే ప్రత్యక్షంగా ఆందోళనకు సిద్ధం కావాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యోచిస్తున్నట్లు తెలుస్తోం ది. ఇందుకోసం విద్యార్థి సంఘాల మద్దతు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement