అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్
హైదరాబాద్: ఎంసెట్ లీకేజి వ్యవహారంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. సోమవారం ఎంసెట్ లీకేజీ అంశం చర్చకు రాగా ఆ విషయంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు తీసుకుందని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ ఆరోపించారు. అసలు నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ లేదా న్యాయవిచారణ జరిపించాలని కోరారు.
అనంతరం మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ... దీనిపై ప్రాథమిక విచారణలో నిజమని తేలిన వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 49 మందిని అరెస్టు చేసి, రూ. 2.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను తప్పకుండా పట్టుకుంటామన్నారు. 2010, 2012లలో జరిగిన లీకేజీల నిందితులే ఇందులోనూ ఉన్నారని చెప్పారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ పక్షం సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, వెళ్లిపోయారు.