చివరి దశకు ‘ఎంసెట్’ లీకేజీ దర్యాప్తు
Published Tue, Jul 18 2017 1:25 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
- విచారణకోసం నేడు ఢిల్లీకి సీఐడీ అదనపు డీజీపీ
- ప్రింటింగ్ ప్రెస్, జేఎన్‌టీయూ లింకుపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ దర్యాప్తు చివరి మజిలీకి చేరింది. ఇప్పటివరకు 81మందిని కటకటాల్లోకి నెట్టిన సీఐడీ అధికారులు ఇప్పుడు అసలు లింకును ఛేదించే పనిలో పడ్డారు. తాజాగా వారు ప్రింటింగ్ ప్రెస్–జేఎన్‌టీయూ లింకుపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఢిల్లీ శివారులోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ప్రెస్ యజమానిని విచారించేందుకు నేరుగా సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ రంగంలోకి దిగారు.
రెండింటి పాత్ర బయటపడాలి...
ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అటు ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు ఇటు జేఎన్‌టీయూ పాత్రపై విచారణ జరిపేందుకు మంగళవారం సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌తో పాటు దర్యాప్తు అధికారి ప్రకాశ్ జాదవ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు రావత్, ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాన్ని ఎలా బయటకు తెచ్చాడన్న అంశంపై దృష్టిసారించారు. మరో పక్క అనుమానాస్పద స్థితిలో రావత్ మృతిచెందడంపై కూడా ఆరా తీయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వివిధ రాష్ట్రాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇదే ప్రింటింగ్ ప్రెస్ నుంచి 11 సార్లు ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఇందులో యాజమాన్యం పాత్రను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఇన్నిసార్లు ప్రశ్నపత్రం లీకవుతున్నా జేఎన్‌టీయూ అధికారులు ఎందుకు ఇదే ప్రింటింగ్ ప్రెస్‌కు ముద్రణ బాధ్యతలు అప్పగించారన్న దానిపై కూడా వారు ఆరా తీయనున్నారు.
ఫినిషింగ్ టచ్‌పై ఉత్కంఠ...
ఎంసెట్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ముసాయిదా చార్జిషీట్‌ను సిద్ధంచేశారని సమాచారం. అయితే అసలు లింకులు తేలకుండా చార్జిషీట్ వేస్తే నిందితులు సులువుగా తప్పించుకుంటారని న్యాయసలహా రావడంతో అధికారులు పునరాలోచిస్తున్నారు. దీనితో అసలు ఈ కేసులో చివరి మలుపు ఎలా ఉంటుంది? జేఎన్‌టీయూలో ఏ అధికారి పాత్రను చార్జిషీట్‌లో పేర్కొంటారు? ప్రింటింగ్ ప్రెస్ వ్యవహారంపై పెద్దగా పట్టించుకోని అధికారులపై చర్యలుంటాయా? అన్న పలు అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
Advertisement