లీకేజీ లోగుట్టు బయట పెట్టిందెవరు?
లీకేజీలో జేఎన్‌టీయూ పాత్ర?
హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పక్షాన ఈ పరీక్ష నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ (హెచ్) పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ మొదలుకుని పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన వరకు జేఎన్‌టీయూ కీలక పాత్ర పోషిస్తోంది. గత 15 ఏళ్లుగా ఈ ప్రవేశ పరీక్షను జేఎన్‌టీయూ నిర్వహిస్తుండటంతో.. ప్రశ్నపత్రాల ముద్రణ సమాచారాన్ని లీకేజీ ముఠా వర్సిటీ వర్గాల నుంచే రాబట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్ష నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూ... పొరుగు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల ముద్రణకు ఆర్డర్ ఇస్తోంది. ముద్రణ సంస్థ వివరాలు ఎంసెట్ కన్వీనర్‌తోపాటు ఒకరిద్దరు ముఖ్యులకు మాత్రమే తెలిసే అవకాశముంది. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఒక్కో సబ్జెక్ట్‌కు ఐదుగురు చొప్పున సీనియర్ లెక్చరర్లు పాలుపంచుకుంటారు. వీరు రూపొందించిన ప్రశ్నలను మిళితం చేసి ఎంసెట్ కన్వీనర్ పర్యవేక్షణలో మోడరేటర్లు..ప్రశ్నపత్రాలను 2 సెట్లుగా సిద్ధం చేస్తారు. 2 సెట్లకు సంబంధించిన ప్రశ్నలు లీక్ కావడంతో..ముద్రణసంస్థ ద్వారానే ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ముద్రణ సంస్థ సమాచారం లీకేజీ ముఠాకు అందడంలో జేన్‌టీయూ సిబ్బంది వర్గాలు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో ఎంసెట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బంది కాల్‌డేటాను సీఐడీ లోతుగా పరిశీలిస్తోంది. 1996లో జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కోచింగ్ సంస్థ కీలకపాత్ర పోషించింది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీకి చెందిన ఎంసెట్ కన్వీనర్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 1997లో జరి గిన ఎంసెట్ మెడికల్ ప్రశ్నపత్రం.. కోల్‌కతా కు చెందిన ముద్రణ సంస్థ నుంచి లీక్ అయింది. వీటిని దృష్టిలో పెట్టుకుని అటు వర్సిటీ.. ఇటు ముద్రణ సంస్థ పాత్ర ఎంతనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అత్యంత గోప్యంగా ప్రశ్నపత్రం తయారీ
ఎంసెట్ ప్రశ్నపత్రాల తయారీ అత్యంత గోప్యంగా జరుగుతుందని, ప్రశ్నపత్రం తయారీలో పాలుపంచుకునే లెక్చరర్ల వివరాలు కేవలం ఎంసెట్ కన్వీనర్‌తో పాటు నిర్వహణ కమిటీలోని కొద్దిమంది ముఖ్యులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. లెక్చరర్లు తయారు చేసే ప్రశ్నపత్రాలు యథాతథంగా కాకుండా.. యాదృచ్ఛిక (ర్యాండమ్) పద్ధతిలో ఎంపిక చేసి కన్వీనర్ సమక్షంలో తుది ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. లీకేజీ ఘటన నేపథ్యంలో ప్రశ్నపత్రం తయారీలో భాగస్వాములైన లెక్చరర్లు, ఇతర సిబ్బంది నుంచి కూడా సీఐడీ వివరాలు సేకరిస్తోంది. ముద్రణకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన సిబ్బంది పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్‌టీయూ వర్గాల నుంచి ముద్రణ సంస్థ వివరాలు తెలుసుకున్న లీకేజీ ముఠా.. అక్కడి సిబ్బంది సహకారంతో ప్రశ్నపత్రాలు సంపాదించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.