convenor
-
బీడీఎస్ కన్వినర్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలల్లో యూజీ డెంటల్ కోర్సుల్లో (బీడీఎస్) మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) శనివారం విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వర్సిటీ వెల్లడించింది. tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు రూ.12 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీకి ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.10 వేలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 డెంటల్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. -
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ కన్వినర్ (ఎ కేటగిరి) సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.దివ్యాంగ, మరికొన్ని ప్రత్యేక విభాగాల్లో తుది మెరిట్ జాబితా ఇంకా సిద్ధం కానందున ఆ విభాగాల సీట్ల వరకూ పెండింగ్‌లో ఉంచారు. మొత్తం 3,879 సీట్లకు గాను తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,507 సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక తుది మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. తాడేపల్లి పోలీసుల ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: తాడేపల్లి పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ను ఈ ఉదయం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్టు విషయంలో వెంకటరామిరెడ్డికి కోర్టు ఇదివరకు ఊరట ఇచ్చింది. ఆయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయినా ఆ గడువు ఆదేశాలను పట్టించుకోకుండా ఈ ఉదయం 11గం.కే ఆయన్ని ఇంటి నుంచి తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారు. ఆయన్ని ఎక్కడి తీసుకెళ్లారు? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఇండియా కూటమి కన్వినర్‌గా నితీష్ కుమార్?
ఢిల్లీ: ఇండియా కూటమి కన్వినర్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను నియమించనున్నారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీల వర్చువల్ సమావేశం ఈ వారంలో జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదిత నియామకాన్ని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో కాంగ్రెస్ ఇప్పటికే చర్చించింది. భారత కూటమిలోని ఇతర భాగస్వాములను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై నితీష్ కుమార్ నిన్న ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించే ఆలోచనకు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతును వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇండియా కూటమి నేతలు డిసెంబర్ 19న నాలుగవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను నియమించాలనే ప్రతిపదానను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలు తీసుకున్నారు. ఈ సమావేశంలోనే సీట్ల పంపకం సహా 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనడానికి కావాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇదీ చదవండి: మూడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా -
వైద్య విద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇప్పటికే నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రవేశాల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కన్వినర్, యాజమాన్య కోటా సీట్లకు తొలి దశలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు గురువారం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఉత్తర్వులిచ్చారు. కర్నూలు జిల్లా శాంతిరామ్ వైద్య కళాశాలలోని పలు కోర్సుల్లో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతులు వెలువడ్డాయి. ఈ అంశంపై ఎన్ఎంసీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ను హెల్త్ యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. ఫోర్జరీ అనుమతుల ఘటన వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల అనుమతులు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలిస్తున్నారు. ఆయా కళాశాలలకు మంజూరైన సీట్లను, ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సీట్లతో సబ్జెక్టుల వారీగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్, శాంతిరామ్, మహారాజా కళాశాలల్లో అనుమతించిన పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై వివరణ కోరుతూ అధికారులు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాక కొత్తగా సీట్ మ్యాట్రిక్స్‌ను రూపొందించనున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్ ఇస్తామని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. -
సీఎంను కలిసిన ‘గల్ఫ్ సమన్వయకర్తలు’
సాక్షి, అమరావతి: గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయకర్తలు, వైఎస్సార్సీపీ కన్వినర్లు గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. గల్ఫ్ దేశాల్లోని ఏపీ వాసులకు అందిస్తున్న సాయం.. వారి సంక్షేమా చర్చించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నట్లు వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం(మైనార్టీ వెల్ఫేర్) అంజాద్ బాషా, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి, కువైట్ ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్లు నాయని మహేష్‌రెడ్డి, ఎంవీ నరసారెడ్డి, దుబాయ్ కోఆర్డినేటర్ సయ్యద్ నాసర్ వలీ, వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వినర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వి నర్ ముమ్మడి బాలిరెడ్డి, ఖతార్ కన్వి నర్ డి.శశికిరణ్, దుబాయ్ కన్వినర్ సయ్యద్ అక్రమ్, సౌదీ అరేబియా కన్వినర్ రెవెల్ ఆంథోని తదితరులు పాల్గొన్నారు. సీఎంకు హజ్ పవిత్ర జలం డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా, హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి హజ్ పవిత్ర జలాన్ని అందజేశారు. -
బీజేపీ పార్లమెంటు కన్వీనర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వినర్లు, జాయింట్ కన్వినర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నియమించారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని వివిధ జిల్లాల నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. వివరాలు... -
టీఎస్ ఐసెట్, లాసెట్ దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తు గడువును ఆలస్య రుసుముతో వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఇకపై గడువు పొడిగించలేమని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2022–2023)లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అపరాధ రుసుము లేకుండా జూలై 4 వరకు గడువు పొడిగించినట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా సోమవారంతో గడువు ముగియడంతో మరోసారి పొడిగించినట్లు పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్‌ను జూలై 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (చదవండి: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..) -
రైతుబంధు సమితి కన్వీనర్‌పై హత్యాయత్నం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రైతుబంధు సమితి కాల్వ శ్రీరాంపూర్ మండల కన్వీనర్ నిదానపురం దేవయ్యపై మంగళవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తన ఇంట్లో దేవయ్య నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి, తలపులు తట్టారు. అన్న పిలుస్తున్నాడంటూ ఆయనను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. జమ్మికుంటకు వెళ్లే రహదారి పక్కన దేవయ్యను కొట్టి, గాయపరిచారు. అనంతరం తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా ఆయన దాన్ని లాక్కొని, సమీపంలోని పొలాల్లోకి విసిరేశాడు. దేవయ్య కూతురు అరవడంతో దుండగులు పారిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఆర్అండ్బీ రహదారి పక్కన నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నానని తెలిపారు. గ్రామానికి చెందిన కనకేశ్ అనే వ్యక్తితో భూ తగాదా ఉందని, అతనికి దారి ఎందుకు ఇవ్వడం లేదని కొందరు తనను తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు సౌమ్య అరవడంతో చుట్టపక్కల వారు నిద్రలేచారని, ఇంతలో వారు పారిపోయారని పేర్కొన్నారు. మండలంలో చర్చనీయాంశమైన ఘటన నిందితులు దేవయ్యను కాలుస్తామని బెదిరించింది బొయ్య తుపాకీతోనని పోలీసులు తెలిపారు. నిజమైనదే అయితే దేవయ్య ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయనపై దాడి మండలంలో చర్చనీయాంశంగా మారింది. బాధితుడి ఫి ర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఈ నెల 6న టీఎస్ ఈసెట్
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: కన్వీనర్ సాక్షి, హైదరాబాద్: ఈనెల 6న జరిగే టీఎస్ ఈసెట్-2017 పరీక్షకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 25,138 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో 81 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కరీంగనర్‌లో 5, ఖమ్మంలో 5, వరంగల్‌లో 6, హైదరాబాద్-1 పరిధిలో 25, హైదరాబాద్-2 పరిధిలో 13, హైదరాబాద్-3 పరిధిలో 12, హైదరాబాద్-4 పరిధిలో 15 కేంద్రాలున్నాయి. హాల్‌టికెట్లను ecet.tsche.ac.in వెబ్సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని, వెబ్సైట్లో మరింత సమాచారం పొందవచ్చని ఈసెట్ కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందే సందర్శించాలని సూచించారు. పరీక్ష రోజున మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించమని కన్వీనర్ స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌తో ఆన్లైన్ దరఖాస్తు పత్రం, ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలని చెప్పారు. -
లీకేజీ లోగుట్టు బయట పెట్టిందెవరు?
లీకేజీలో జేఎన్టీయూ పాత్ర? హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పక్షాన ఈ పరీక్ష నిర్వహిస్తున్న జేఎన్టీయూ (హెచ్) పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ మొదలుకుని పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన వరకు జేఎన్టీయూ కీలక పాత్ర పోషిస్తోంది. గత 15 ఏళ్లుగా ఈ ప్రవేశ పరీక్షను జేఎన్టీయూ నిర్వహిస్తుండటంతో.. ప్రశ్నపత్రాల ముద్రణ సమాచారాన్ని లీకేజీ ముఠా వర్సిటీ వర్గాల నుంచే రాబట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్ష నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన జేఎన్టీయూ... పొరుగు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల ముద్రణకు ఆర్డర్ ఇస్తోంది. ముద్రణ సంస్థ వివరాలు ఎంసెట్ కన్వీనర్‌తోపాటు ఒకరిద్దరు ముఖ్యులకు మాత్రమే తెలిసే అవకాశముంది. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఒక్కో సబ్జెక్ట్‌కు ఐదుగురు చొప్పున సీనియర్ లెక్చరర్లు పాలుపంచుకుంటారు. వీరు రూపొందించిన ప్రశ్నలను మిళితం చేసి ఎంసెట్ కన్వీనర్ పర్యవేక్షణలో మోడరేటర్లు..ప్రశ్నపత్రాలను 2 సెట్లుగా సిద్ధం చేస్తారు. 2 సెట్లకు సంబంధించిన ప్రశ్నలు లీక్ కావడంతో..ముద్రణసంస్థ ద్వారానే ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ముద్రణ సంస్థ సమాచారం లీకేజీ ముఠాకు అందడంలో జేన్టీయూ సిబ్బంది వర్గాలు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎంసెట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బంది కాల్‌డేటాను సీఐడీ లోతుగా పరిశీలిస్తోంది. 1996లో జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కోచింగ్ సంస్థ కీలకపాత్ర పోషించింది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీకి చెందిన ఎంసెట్ కన్వీనర్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 1997లో జరి గిన ఎంసెట్ మెడికల్ ప్రశ్నపత్రం.. కోల్‌కతా కు చెందిన ముద్రణ సంస్థ నుంచి లీక్ అయింది. వీటిని దృష్టిలో పెట్టుకుని అటు వర్సిటీ.. ఇటు ముద్రణ సంస్థ పాత్ర ఎంతనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత గోప్యంగా ప్రశ్నపత్రం తయారీ ఎంసెట్ ప్రశ్నపత్రాల తయారీ అత్యంత గోప్యంగా జరుగుతుందని, ప్రశ్నపత్రం తయారీలో పాలుపంచుకునే లెక్చరర్ల వివరాలు కేవలం ఎంసెట్ కన్వీనర్‌తో పాటు నిర్వహణ కమిటీలోని కొద్దిమంది ముఖ్యులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. లెక్చరర్లు తయారు చేసే ప్రశ్నపత్రాలు యథాతథంగా కాకుండా.. యాదృచ్ఛిక (ర్యాండమ్) పద్ధతిలో ఎంపిక చేసి కన్వీనర్ సమక్షంలో తుది ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. లీకేజీ ఘటన నేపథ్యంలో ప్రశ్నపత్రం తయారీలో భాగస్వాములైన లెక్చరర్లు, ఇతర సిబ్బంది నుంచి కూడా సీఐడీ వివరాలు సేకరిస్తోంది. ముద్రణకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన సిబ్బంది పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్టీయూ వర్గాల నుంచి ముద్రణ సంస్థ వివరాలు తెలుసుకున్న లీకేజీ ముఠా.. అక్కడి సిబ్బంది సహకారంతో ప్రశ్నపత్రాలు సంపాదించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
కర్నూలు బాధ్యతలు హఫీజ్‌ఖాన్‌కు..
– సమన్వయ కర్తగా నియమించిన వైఎస్సార్సీపీ సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా హఫీజ్‌ఖాన్‌ను నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ను నియమించినట్లు కేంద్ర కమిటీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్‌లోని డిట్రాయిట్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఎంఎస్ చేసిన హఫీజ్‌ఖాన్ 11 ఏళ్ల పాటు అక్కడే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. వైఎస్ జగన్ వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి ప్రజల పక్షాన పోరాటం జరుపుతున్న తీరుపట్ల ఆకర్షితుడై ఉద్యోగాన్ని వదిలి అమెరికా నుంచి వచ్చేశారు. 2010లో జగన్ కర్నూలు జిల్లాలో చేపట్టిన ఓదార్పు యాత్ర సందర్భంగా హఫీజ్‌ఖాన్ పార్టీలో చే రి అన్ని కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేంద్రపాలక మండలి సభ్యులుగా ఉన్న ఈయనకు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. అలాగే «ప్రముఖ బిల్డర్, పారిశ్రామిక వేత్త రాజగోపాల్‌రెడ్డికి వైఎస్ఆర్సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించారు. పార్టీ నమ్మకాన్ని నిలబెడతా : హఫీజ్‌ఖాన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో నమ్మకం ఉంచి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు కతజ్ఞతలు. పార్టీ అభివద్ధితోపాటు ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తల సమన్వయం, ప్రజల ఆశీస్సులతో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తాం. -
18న ఏపీ ఈసెట్ ఫలితాలు
జేఎన్టీయూ(అనంతపురం): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్- 2016) ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ(అనంతపురం)లో విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డిని ఫలితాల విడుదలకు ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. -
ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
- ఈ నెల 8వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు - గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి - నిమిషం ఆలస్యమైనా అనుమతించరు - ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు సూచించారు. నల్లగొం డలో ఎంసెట్ నిర్వహణపై సోమవారం స్థానిక ఎన్జీ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంసెట్ నిర్వహణకు జిల్లా కేంద్రంలో 17 ఇంజినీరింగ్ సెం టర్లు, 8 అగ్రికల్చర్, మెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 8,500 మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు, 4050 అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల న్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోరని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నిర్వహణలో ఏలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీ సుల సహకారం తీసుకుంటామన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు, ఆపైన ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేక అబ్జర్వర్లను నియమించడంతో పాటు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నాగేందర్‌రెడ్డి, 17 మంది పరి శీలకులు, 17మంది చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్‌గా వినాయకరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా కొమ్ముల వినాయకరెడ్డి నియమితులయ్యారు. పార్టీ యు వజన విభాగం జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆయనను జి ల్లా కన్వీనర్‌గా నియమిస్తూ ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీ యువజన విభాగం కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించిన వినాయకరెడ్డిని జిల్లా కన్వీనర్‌గా నియమించారు. నిర్మల్ నియోజకవర్గానికి చెందిన వినాయకరెడ్డి న్వాయవాదిగా కూడా ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు మొదటిసారి జిల్లాలో యువజన సదస్సును ఆయన విజయవంతంగా నిర్వహించారు. బడుగు, బలహీన, గిరిజన ప్రజల తరఫున పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పేరిట నిర్మల్‌లో పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. యువజన నేతగా పార్టీ కోసం పనిచేసిన వినాయకరెడ్డిని పార్టీ జిల్లా కన్వీనర్‌గా నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వినాయకరెడ్డి బయోడేటా.. కొమ్ముల వినాయక్‌రెడ్డి స్వగ్రామం దిలావర్పూర్ మండలం గుండంపల్లి. ఈయన ఏడో తరగతి వరకు స్వగ్రామంలో, అనంతరం పదో తరగతి వరకు నర్సాపూర్(జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియెట్ ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రాం కళాశాలలో, హైదరాబాద్ పడాల రాంరెడ్డి లా కళాశాలలో లా చదివారు. డిగ్రీలో ఉన్న సమయంలో రెండు పర్యాయాలు ఏబీవీపీ కళాశాల అధ్యక్షుడిగా పనిచేశారు. లా చదివే సమయంలో ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పని చేశారు. అనంతరం నిర్మల్‌లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 2001లో టీఆర్ఎస్లో చేరి 2004లో పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్లో ఉన్న సమయంలో సారంగాపూర్, దిలావర్పూర్ మండలాల ఇన్చార్జిగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన సంక్షేమ పథకాలు తిరిగి సాకారం కావాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితేనే సాధ్యమని నిర్మల్ నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పోస్టుకార్డులు రాయించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందే ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉన్నారు. పార్టీ ఆవిర్భావం అనంతరం జిల్లా అధికార ప్రతినిధిగా, స్టీరింగ్ కమిటీ మెంబర్‌గా, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో 2004లో హృదయరాజు ‘వైఎస్ఆర్’ పుస్తకాన్ని సైతం రచించారు. ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా రవిప్రసాద్ కాగా, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎన్.రవిప్రసాద్ నియమితులయ్యారు. పశ్చిమ జిల్లా కో కన్వీనర్‌గా ఉన్న ఆయన ఇకనుంచి ముథోల్ నియోజకవర్గం సమన్వయకర్తగానూ వ్యవహరించనున్నారు. దివంగత నేత వైఎస్సార్ అభిమానిగా ఉన్న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయన కో-కన్వీనర్‌గా పశ్చిమ జిల్లా పరిధిలోని పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను నిర్వహించారు. ముథోల్ నియోజకవర్గానికి చెందిన రవిప్రసాద్‌ను వైఎస్సార్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి ఆయనకు కో-కన్వీనర్ బాధ్యతలు పార్టీ అధిష్టానం, తాజాగా ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించింది.