- తెలంగాణ విజ్ఞప్తి మేరకు సడలింపునిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం
- నేడు మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. వచ్చే నెల 7వ తేదీ నాటికి ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు అనుమతిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ, తిరిగి పరీక్షలు నిర్వహించడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆల స్యమైంది.
దీంతో ప్రవేశాల గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీ కూడా తమ రాష్ట్రంలోనూ గడువు పొడిగించాలని మరో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని, ప్రవేశాలకు నెల రోజులు గడువు పొడిగించాలని తెలంగాణ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు విన్నవించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇరు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌లకు హాజరయ్యే అవకాశమున్నందున.. ఏపీలోనూ గడువు పొడిగించాలని ఆ రాష్ట్ర న్యాయవాది అభ్యర్థించారు. ప్రవేశాల గడువు పొడిగించేందుకు భారత వైద్య మండలి (ఎంసీఐ) అభ్యంతరం తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం... మెడికల్ ప్రవేశాల గడువును అక్టోబర్ 7లోగా పూర్తి చేసుకోవచ్చని సూచించింది. ఇక ఏపీ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందేందుకు అవకాశం కల్పించే ఓపెన్ కోటా సీట్ల భర్తీకి మాత్రం 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంటే ఏపీలో మెడికల్ కాలేజీల్లోని ఓపెన్ కోటా సీట్లలో ప్రవేశాలకు మాత్రమే ఈ గడువు వర్తిస్తుంది.
నేడు మూడో కౌన్సెలింగ్
తెలంగాణలో ఇప్పటికే రెండు విడతల మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండో కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు బుధవారం వారికి కేటాయించిన కాలేజీల్లో చేరారు. ఇంకా ఎవరైనా చేరకపోతే ఖాళీగా ఉండిపోయే సీట్లు, కొత్తగా అనుమతి వచ్చిన మల్లారెడ్డి మహిళా మెడికల్ కాలేజీలోని 75 కన్వీనర్ కోటా సీట్లకు గురువారం మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించి, శుక్రవారం సీట్లు కేటాయిస్తామని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీలో మిగిలిన సీట్లకు, మల్లారెడ్డి కాలేజీలోని బీ కేటగిరీ సీట్లకు 30వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
మెడికల్ ప్రవేశాలకు 7 వరకు గడువు
Published Thu, Sep 29 2016 2:23 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM
Advertisement
Advertisement