EAMCET Management
-
ఎంసెట్ టెండర్లలో అక్రమాలు: కొనగల
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణ పనులను బహిరంగ టెండర్లు పిలవకుండానే మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని, దీనిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో అసమర్థంగా, అవకతవకలతో ఎంసెట్‌ను నిర్వహించిన మాగ్నెటిక్ కంపెనీకే ఉన్నత విద్యామండలి బాధ్యతలు అప్పగించిందన్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి జైలులో ఉండేవార న్నారు. మంత్రి కేటీఆర్ జోక్యంతోనే అక్రమాలు జరిగాయని ఆరోపించారు -
ఏపీ ఎంసెట్‌పై రేపు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెంట్ నిర్వహణపై సోమవారం తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసెట్ వివాదంపై రాష్ట్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యా శాఖ అధికారులు శనివారం సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి వేరుగా ఎంసెట్ నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో, దానివల్ల కలిగే నష్టాలు, తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు. మరింత ఆలోచించి ముందుకెళ్లాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సోమవారం మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. -
ఏపీ వైఖరి వల్లే ఎంసెట్ ప్రకటన: కేసీఆర్
గవర్నర్‌కు వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం రాత్రి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి వివరణ ఇచ్చారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసినా ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగానే తాము ఎంసెట్ తేదీలను ప్రకటించినట్లు కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో కలసి గవర్నర్‌ను కలిశారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి గవర్నరే సీఎంను పిలిపించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ తేదీలను ప్రకటించిన తరువాత ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఎంసెట్ నిర్వహించాలని పలుమార్లు ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు నరసింహన్ సూచించినా రెండు రాష్ట్రాలు బెట్టుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందుగా తమను సంప్రదించకుండా షెడ్యూల్ ప్రకటించిందని, విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లఘించి ముందుకు వెళ్తోందని, తాము మాత్రం నిబంధనలకు అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేశామని, ఎంసెట్ నిర్వహణ అధికారం తమకే ఉందని సీఎం కేసీఆర్ వివరించినట్లు సమాచారం. 15 శాతం ఓపెన్ కోటా సీట్లలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు తాము చర్యలు చేపట్టామని వెల్లడించినట్లు తెలిసింది. విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని ప్రవేశాల కమిటీలో సభ్యునిగా చేర్చేందుకు ఒకరి పేరును సూచించాలని ఆ ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరినట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రబలడం, దీనిని అదుపుచేసేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా గవర్నర్‌కు వివరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 1956 కటాఫ్ తేదీ అంశానికి సంబంధించి కూడా సీఎం గవర్నర్‌తో చర్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
4-5 రోజుల్లో తెలంగాణ సెట్స్ తేదీలు!
మేమే సెట్స్ నిర్వహిస్తాం.. మీకు సేవలు కావాలో లేదో చెప్పండి ఏపీ సీఎస్‌కు తెలంగాణ ఉన్నత విద్యా మండలి లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూలుపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఇప్పటికే ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ జేఎన్టీయూకు అప్పగించగా, మిగతా సెట్స్ నిర్వహణ తేదీలతోపాటు వాటిని నిర్వహించాల్సిన విశ్వ విద్యాలయాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఆయా విశ్వవిద్యాలయాల అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మొత్తానికి నాలుగైదు రోజుల్లో తెలంగాణ సెట్స్ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లిన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌కు రాగానే ఆయనతో సమావేశమై వీటిపై చర్చించాలని భావిస్తోంది. ఆ తరువాత పరీక్షల తేదీలను ప్రకటించాలని భావిస్తోంది. ఒకటీ రెండు మినహా మిగతా సెట్స్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు అప్పగించాలని భావిస్తోంది. మరోవైపు ఎంసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను తామే నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు బుధవారం లేఖ రాశారు. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్వహణ అధికారం తమకే ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవలు కావాలనుకుంటే నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలని చెప్పారు. ఏపీ ఒప్పుకుంటే రెండు రాష్ట్రాలకు కలిపి తాము సెట్స్ నిర్వహిస్తామిన వివరించారు. అలాగే విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం పదేళ్లపాటు 15 శాతం ఓపెన్ కోటా సీట్లలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని, అందుకోసం ఏర్పాటు చేసే ప్రవేశాల కమిటీలో ఏపీ ప్రభుత్వం నుంచి ఒకరిని సభ్యునిగా నియమిస్తామని వెల్లడించారు. కాబట్టి ఒక అధికారి పేరును తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన కోసం రెండు మూడు రోజులు వేచి చూడాలని మండలి భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చిన వెంటనే షెడ్యూలును ప్రకటించనున్నారు.