4-5 రోజుల్లో తెలంగాణ సెట్స్ తేదీలు!
మేమే సెట్స్ నిర్వహిస్తాం.. మీకు సేవలు కావాలో లేదో చెప్పండి
ఏపీ సీఎస్‌కు తెలంగాణ ఉన్నత విద్యా మండలి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూలుపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఇప్పటికే ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ జేఎన్‌టీయూకు అప్పగించగా, మిగతా సెట్స్ నిర్వహణ తేదీలతోపాటు వాటిని నిర్వహించాల్సిన విశ్వ విద్యాలయాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఆయా విశ్వవిద్యాలయాల అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మొత్తానికి నాలుగైదు రోజుల్లో తెలంగాణ సెట్స్ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లిన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌కు రాగానే ఆయనతో సమావేశమై వీటిపై చర్చించాలని భావిస్తోంది. ఆ తరువాత పరీక్షల తేదీలను ప్రకటించాలని భావిస్తోంది. ఒకటీ రెండు మినహా మిగతా సెట్స్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు అప్పగించాలని భావిస్తోంది. మరోవైపు ఎంసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను తామే నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు బుధవారం లేఖ రాశారు. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్వహణ అధికారం తమకే ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవలు కావాలనుకుంటే నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలని చెప్పారు.
ఏపీ ఒప్పుకుంటే రెండు రాష్ట్రాలకు కలిపి తాము సెట్స్ నిర్వహిస్తామిన వివరించారు. అలాగే విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం పదేళ్లపాటు 15 శాతం ఓపెన్ కోటా సీట్లలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని, అందుకోసం ఏర్పాటు చేసే ప్రవేశాల కమిటీలో ఏపీ ప్రభుత్వం నుంచి ఒకరిని సభ్యునిగా నియమిస్తామని వెల్లడించారు. కాబట్టి ఒక అధికారి పేరును తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన కోసం రెండు మూడు రోజులు వేచి చూడాలని మండలి భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చిన వెంటనే షెడ్యూలును ప్రకటించనున్నారు.