ఏపీ వైఖరి వల్లే ఎంసెట్ ప్రకటన: కేసీఆర్
గవర్నర్‌కు వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం రాత్రి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి వివరణ ఇచ్చారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసినా ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగానే తాము ఎంసెట్ తేదీలను ప్రకటించినట్లు కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో కలసి గవర్నర్‌ను కలిశారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి గవర్నరే సీఎంను పిలిపించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ తేదీలను ప్రకటించిన తరువాత ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఎంసెట్ నిర్వహించాలని పలుమార్లు ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు నరసింహన్ సూచించినా రెండు రాష్ట్రాలు బెట్టుకుపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందుగా తమను సంప్రదించకుండా షెడ్యూల్ ప్రకటించిందని, విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లఘించి ముందుకు వెళ్తోందని, తాము మాత్రం నిబంధనలకు అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేశామని, ఎంసెట్ నిర్వహణ అధికారం తమకే ఉందని సీఎం కేసీఆర్ వివరించినట్లు సమాచారం. 15 శాతం ఓపెన్ కోటా సీట్లలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు తాము చర్యలు చేపట్టామని వెల్లడించినట్లు తెలిసింది. విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని ప్రవేశాల కమిటీలో సభ్యునిగా చేర్చేందుకు ఒకరి పేరును సూచించాలని ఆ ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరినట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రబలడం, దీనిని అదుపుచేసేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా గవర్నర్‌కు వివరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 1956 కటాఫ్ తేదీ అంశానికి సంబంధించి కూడా సీఎం గవర్నర్‌తో చర్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.