earth tremors
-
‘కృష్ణ పట్టె’లో భయం..భయం
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: స్వల్ప భూ ప్రకంపనలతో కృష్ణ పట్టె ప్రాంతంలోని మండలాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వారం రోజులుగా కంపనాలు వస్తుండటంతో భారీ భూకంపం వస్తుందేమోనని ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలను కృష్ణపట్టె మండలాలుగా పిలుస్తుంటారు. వీటి పరిధిలో సున్నపురాయి గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు పులిచింతల ప్రాజెక్టు ఉంది. వందలాది ఎకరాల్లో తవ్వకాలతో ఇక్కడ సున్నపురాయిని వెలికితీస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా చింతలపాలెం మండలంలోని చింతలపాలెం, గుడిమల్కాపురం, దొండపాడు, నెమలిపురి, కిష్టాపురం, మేళ్లచెరువు మండలంలోని.. మేళ్లచెరువు, రామాపురం, వేపలమాధారం గ్రామాల్లో రోజుకు రెండుమూడు సార్లు స్వల్ప కంపనాలు వస్తున్నా యి. ఇది భారీ భూకంపానికి సంకేతమేమోనని ఆ గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డికి కూడా ప్రజలు ఫోన్లు చేశారు. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ లేకపోవడంతో భూ కంపనాల విషయాన్ని ఎన్జీఆర్ఐకి చెబుతామని అధికారులు తెలిపారు. ఆందోళన వద్దు స్వల్ప భూ కంపనాలు వస్తున్న విషయం పై తహసీల్దార్లు పూర్తి స్థాయిలో సమాచారం తీసుకుంటున్నారు. దీన్ని ఎన్జీఆర్ఐకి పంపిస్తాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. అప్పుడప్పుడు భూమిలో సర్దుబాట్ల వల్ల స్వల్ప కంపనాలు వస్తుంటాయి. వీటి వల్ల ఎలాంటి నష్టమూ జరగదు. – డి.సంజీవరెడ్డి, జేసీ, సూర్యాపేట -
ఏపీలో భూప్రకంపనలు, జనం పరుగులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపిచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైనే భయంగా గడిపారు. గుంటూరుజిల్లా శావల్యాపురం మండలంలో పలు గ్రామాల్లో భూమి కంపించింది. మతుకుమల్లి, శావల్యాపురం, కృష్ణపురం, పొట్లూరు, కారుమంచి, వేల్పూరు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఇళ్ళలో పైన ఉంచిన వస్తువులు కిందపడిపోయాయి. వినుకొండ పట్టణం హనుమాన్ నగర్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలో సంతమాగులూరు మండలం ఏల్చూరులో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. భూ కంపన తీవ్రతకు ఇళ్లు, కార్యాలయాల్లోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఇళ్లలోంచి పరుగులు తీశారు. మళ్లీ భూ ప్రకంపనలు సంభవిస్తాయోమోనని భయపడుతున్నారు. అయితే భూ ప్రకంపనలపై ప్రభుత్వ, వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. -
శ్రీకాకుళంలో స్వల్పంగా కంపించిన భూమి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. ఎచ్చర్ల, పొందూరు, రణస్థలం, శ్రీకాకుళం మండలాల్లో భూమి కంపించినట్లు తెలిసింది. రిక్టర్ స్కేలుపై ఎంత నమోదయిందనే సమాచారం ఇంకా రాలేదు. మరోసారి కంపిస్తుందోమోనని జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.