ఏపీలో భూప్రకంపనలు, జనం పరుగులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపిచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైనే భయంగా గడిపారు.
గుంటూరుజిల్లా శావల్యాపురం మండలంలో పలు గ్రామాల్లో భూమి కంపించింది. మతుకుమల్లి, శావల్యాపురం, కృష్ణపురం, పొట్లూరు, కారుమంచి, వేల్పూరు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఇళ్ళలో పైన ఉంచిన వస్తువులు కిందపడిపోయాయి. వినుకొండ పట్టణం హనుమాన్ నగర్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
ప్రకాశం జిల్లాలో సంతమాగులూరు మండలం ఏల్చూరులో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. భూ కంపన తీవ్రతకు ఇళ్లు, కార్యాలయాల్లోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఇళ్లలోంచి పరుగులు తీశారు. మళ్లీ భూ ప్రకంపనలు సంభవిస్తాయోమోనని భయపడుతున్నారు. అయితే భూ ప్రకంపనలపై ప్రభుత్వ, వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు.