బందిపోటు ముఠా అరెస్టు | robbery team arrested in prakasam district | Sakshi
Sakshi News home page

బందిపోటు ముఠా అరెస్టు

Published Tue, Jun 14 2016 9:57 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

robbery team arrested in prakasam district

అద్దంకి: అద్దంకి నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్లను కొట్టి నగదు కాజేస్తున్న ఆరుగురు సభ్యులున్న బందిపోటు ముఠాను అద్దంకి, సంతమాగులూరు ఎస్సైలు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ శ్రీరాంబాబుతో కలిసి ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ వెల్లడించారు.  

బందిపోట్లు ఏం చేశారంటే..
ఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి తమిళనాడు రాష్ట్రం అరక్కోణం పట్టణానికి చెందిన ఢిల్లీబాబు హైదరాబాద్‌ నుంచి గోల్ప్‌ కిట్స్‌ లోడ్‌త్‌ చెన్నై వెళ్తున్నాడు. బల్లికురవ మండలం ఎస్‌ఎల్‌ గుడిపాడు సమీపంలోకి రాగానే ఆరుగురు బందిపోట్లు కారులో వచ్చి లారీని ఆపారు. డ్రైవర్‌ను కొట్టి అతని వద్ద రూ.2 వేలు, రెండు సెల్‌ఫోన్‌లు, రెండు ఏటీఎం కార్డులు తీసుకుని వాటి ద్వారా కొప్పెరపాడు, అద్దంకి బంగ్లా రోడ్‌లోని ఏటీఎంల నుంచి రూ.3 వేల నగదు డ్రా చేసుకున్నారు.

అనంతరం డ్రైవర్‌ను లారీ వద్ద వదిలి పెట్టి కారులో పరారయ్యారు. ఇదే ముఠా అదే రోజు తెల్లవారు జామున సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద సరివి కర్రల లోడ్‌తో నార్కెట్‌పల్లి వైపు వెళ్తున్న లారీని ఆపి డ్రైవర్‌ రొండి జగదీశ్వర్‌ను కిందకు దించి కొడుతున్నారు. ఆయన తప్పించుకుని వచ్చి.. పోయో లారీలను ఆపసాగాడు. గమనించిన బందిపోటు ముఠా సభ్యులు కారులో పలాయం చిత్తగించారు.  

నిందితులది గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి నాగరాజు, తురక దుర్గా ప్రసాద్, బత్తుల రాజు, రావులపల్లి పెద్దన్న, సంపంగి గోపీ (రాము), పిడుగురాళ్లకు చెందిన వేముల వెంకట్రావులుగా పోలీసులు గుర్తించారు. వీరిని అద్దంకి, సంతమాగులూరు ఎస్సైలు ఎన్‌.రాఘవరావు, సీహెచ్‌ వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. ఘటన జరగిన రోజే ఆ ఇద్దరు ఎస్సైలు కారును వెంబడించారు. నిందితుల్లో ఒకడు కారు ఎక్కబోతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి ద్వారా మిగిలిన నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి కర్రలు, కొండరాళ్లు, రెండు సెల్‌ఫోన్‌లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement