economic sanctions
-
10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం
టెహ్రాన్: అమెరికా ఆర్థిక ఆంక్షలు కుంగదీస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అణుఒప్పందం ప్రకారం 300 కేజీలకు మించి యురేనియంను శుద్ధి చేయరాదన్న పరిమితిని ఉల్లంఘిస్తామని యూరప్ దేశాలను హెచ్చరించింది. రాబోయే 10 రోజుల్లో ఈ లక్ష్యాన్ని దాటేస్తామని ఇరాన్ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్వాండీ తెలిపారు. యూరప్ దేశాలు మౌనం వహిస్తే, ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అణు ఒప్పందం అనేదే ఉండదని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పరిష్కారం కనుగొనకుండా యూరప్ దేశాలు మౌనం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. సాధారణంగా అణుఇంధన రియాక్టర్లలో 20 శాతం వరకూ శుద్ధిచేసిన యురేనియంను వాడతారు. 85 శాతం, అంతకంటే ఎక్కువగా శుద్ధిచేసిన యురేనియంను అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తారు. 2015లో అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేశారు. ప్రతిగా 3.67 శాతం శుద్ధిచేసిన 300 కేజీల యురేనియంను మాత్రమే ఇరాన్ నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. -
మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తాం
సియోల్: అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ప్రారంభమైన శాంతిచర్చలకు బీటలు వారుతున్నాయి. తమపై విధించిన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయకుంటే మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తామని ఉ.కొరియా అమెరికాను హెచ్చరించింది. ఇప్పటికైనా అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు ఉ.కొరియా విదేశాంగ శాఖ చెప్పినట్లు అధికారిక వార్తాసంస్థ కేఎన్సీఏ తెలిపింది. ఉ.కొరియాను అభివృద్ధి పథంలో నడిపేదిశగా ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు, క్షిపణి పరీక్షలను 2018, ఏప్రిల్‌లో నిలిపివేశారు. ఇక సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆరు నెలల క్రితం సింగపూర్‌లోని ఓ హోటల్లో సమావేశమై కొరియా ద్వీపకల్పం లో శాంతిస్థాపనపై చర్చించారు. పరస్పరం విశ్వాసం నెలకొల్పడం భాగంగా పంగ్యే–రీ అణు పరీక్షా కేంద్రాన్ని సైతం ధ్వంసం చేశారు. అయితే పూర్తిస్థాయిలో అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను ఎత్తివేయబోమని అమెరికా స్పష్టం చేయడంతో కిమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా తీరు గ్యాంగ్‌స్టర్ తరహాలో ఉందన్నారు. తాజాగా ఆర్థిక ఆంక్షల ను ఎత్తివేయకుంటే అణు కార్యక్రమం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. -
సిరియాపై అమెరికా మరిన్ని ఆంక్షలు!
యోచిస్తున్న ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్: సిరియాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ఆ దేశ కీలక అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఫ్లోరిడాలోని అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ రిసార్టులో ట్రెజరీ కార్యదర్శి స్టీవ్ ఎంనుచిన్ ఒక ప్రకటన చేశారు. ‘సిరియాలో జరుగుతున్న పరిణామాలకు మేమెంత ప్రాధాన్యమిస్తున్నామో తెలిసేలా అదనపు ఆంక్షలుంటాయి. ఇతరులు ఆ దేశంతో వ్యాపారం చేయకుండా నిరోధించేలా అవి ఉంటాయి’ అని ఆయన అన్నారు. ఆంక్షలు, ఇతర ఆర్థిక వ్యవహారాల నిఘాకు సంబంధించి ట్రెజరీ విభాగానికి కీలకాధికారాలున్నాయని వెల్లడించారు. మరోవైపు, విషదాడులకు ప్రతిగా ఆమెరికా చేపట్టిన సైనిక చర్య వల్ల సిరియాకు చెందిన సుమారు 20 శాతం వాయుసేన విమానాలు, ఇతర మౌలిక వసతులు తుడిచిపెట్టుకుపోయాయని యూఎస్ వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ అన్నారు. సిరియాపై చేసిన ఆర్మీ ఆపరేషన్ విజయవంతమైందని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ పేర్కొన్నారు. ఈ దాడిలో సిరియా రన్‌వేలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. సిరియా ఎయిర్‌బేస్ పనిచేయకుండా చేసేందుకే దాన్ని లక్ష్యంగా ఎంచుకున్నామని, దీంతో శనివారం నుంచి అక్కడ అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని వెల్లడించారు. -
ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలు
వాషింగ్టన్ : ఉత్తర కొరియాపై అమెరికా తాజాగా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై సైబర్ దాడులకు ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతు ఉందని అమెరికా తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున ఉత్తర కొరియాకు చెందిన మూడు సంస్థలు, పదిమంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ఒబామా సంతకం చేశారని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా కంపెనీ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసేలా, కళాకారులను బెదిరించేలా ఉత్తర కొరియా చర్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
అన్నింటా ఏపీ సర్కారు ఆంక్షలు
హైదరాబాద్: సర్కారు ప్రాధాన్యత ఇస్తున్న అభివృద్ధి పథకాలకు అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించనుంది. పలు శాఖల్లో వివిధ రంగాల వ్యయంపై అనేకరకాల ఆంక్షలను విధిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. మంత్రులకు కూడా ఈ ఆంక్షలు వర్తించనున్నారుు. మంత్రులైనా, అధికారులైనా విమానాల్లో ఇకపై ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాలని ఆదేశించనున్నారు. వీలైనంత మేర ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాల్సిందిగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాఖ అధికారులను ఆదేశించారు. ప్రణాళికేతర వ్యయం తగ్గింపు, పొదుపు చర్యలపై మంత్రి మంగళవారం అధికారులతో సమీక్షించారు. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ మేరకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు యనమల ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే ఆర్థిక శాఖ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేయనుంది. కొత్తగా ఔట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టరాదని, వీలైతే ఉన్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా తగ్గించేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలకు ఈ ఆంక్షలు వర్తింప చేయనున్నారు.