
ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలు
వాషింగ్టన్ : ఉత్తర కొరియాపై అమెరికా తాజాగా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థపై సైబర్ దాడులకు ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతు ఉందని అమెరికా తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున ఉత్తర కొరియాకు చెందిన మూడు సంస్థలు, పదిమంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ఒబామా సంతకం చేశారని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా కంపెనీ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసేలా, కళాకారులను బెదిరించేలా ఉత్తర కొరియా చర్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.