సిరియాపై అమెరికా మరిన్ని ఆంక్షలు!
యోచిస్తున్న ట్రంప్ ప్రభుత్వం
వాషింగ్టన్: సిరియాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ఆ దేశ కీలక అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఫ్లోరిడాలోని అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ రిసార్టులో ట్రెజరీ కార్యదర్శి స్టీవ్ ఎంనుచిన్ ఒక ప్రకటన చేశారు. ‘సిరియాలో జరుగుతున్న పరిణామాలకు మేమెంత ప్రాధాన్యమిస్తున్నామో తెలిసేలా అదనపు ఆంక్షలుంటాయి. ఇతరులు ఆ దేశంతో వ్యాపారం చేయకుండా నిరోధించేలా అవి ఉంటాయి’ అని ఆయన అన్నారు. ఆంక్షలు, ఇతర ఆర్థిక వ్యవహారాల నిఘాకు సంబంధించి ట్రెజరీ విభాగానికి కీలకాధికారాలున్నాయని వెల్లడించారు.
మరోవైపు, విషదాడులకు ప్రతిగా ఆమెరికా చేపట్టిన సైనిక చర్య వల్ల సిరియాకు చెందిన సుమారు 20 శాతం వాయుసేన విమానాలు, ఇతర మౌలిక వసతులు తుడిచిపెట్టుకుపోయాయని యూఎస్ వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ అన్నారు. సిరియాపై చేసిన ఆర్మీ ఆపరేషన్ విజయవంతమైందని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ పేర్కొన్నారు. ఈ దాడిలో సిరియా రన్‌వేలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. సిరియా ఎయిర్‌బేస్ పనిచేయకుండా చేసేందుకే దాన్ని లక్ష్యంగా ఎంచుకున్నామని, దీంతో శనివారం నుంచి అక్కడ అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని వెల్లడించారు.