460 స్కూల్స్ క్లోజ్
ఆదిలాబాద్ టౌన్ : రేషనలైజేషన్ ఫలితం వల్ల జిల్లాలో 460 పాఠశాలలు మూతపడనున్నాయి. దసరా సెలవుల తర్వాత వీటికి తాళాలు వేయనున్నారు. ఇందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ రెండు రోజుల క్రితం జీవో 6 విడుదల చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచన లు జారీ చేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తోంది. ఇది అమల్లోకి రాగానే ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులకు స్థానచలనం కలగనుంది. ఈ జీవో ప్రకారం 19 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలలో విలీనం చేస్తారు.
460 పాఠశాలలకు తాళం..
జిల్లాలో ప్రస్తుతం 3,017 ప్రాథమిక పాఠశాలలు, 419 ప్రాథమికోన్నత పాఠశాలలు, 428 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 17 వేల మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. కా గా ఉత్తర్వుల సంఖ్య 6, రేషనలైజేషన్ ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 19 కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయనున్నారు. ఈలెక్కన జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 290, ప్రాథమికోన్నత పాఠశాలలు 120 వరకు మూత పడనున్నాయి. అలాగే ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సం ఖ్య 75 కంటే తక్కువగా ఉంటే ఆ పాఠశాల మూత పడనుంది. జిల్లాలో పది ఉన్నత పాఠశాలలు, 40 సక్సెస్ ఉన్నత పాఠశాలలు మూత పడనున్నాయి.
వెయ్యి మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ఉత్తర్వుల ప్రకారం 460 పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలగనుంది. వీరి పోస్టులు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు మార్చుతారు. దీంతో ఈ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు పది వేల మంది విద్యార్థులు సమీపంలోని పాఠశాలలకు వెళ్లాల్సిందే. ఇందులో కొంత మంది విద్యార్థులు దూర భారం ఉండడంతో డ్రాపౌట్‌గా మారే అవకాశం ఉంది. కాగా రేషనలైజేషన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ జీవో ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా జిల్లాలో 460 వరకు పాఠశాలలు ఇతర సమీప పాఠశాలల్లో విలీనం కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం జీవో 6ను విడుదల చేసిందని దీనికి సంబంధించిన మార్గదర్శాలు రావాల్సి ఉందన్నారు.