ముంపు గ్రామస్తుల తరలింపు
ఖాజీపూర్,ఎలగందుల(గూడెం)లకు నిలిచిన విద్యుత్ సరఫరా
ఎలగందుల మోడల్ స్కూల్లో పునరావాసం
మంత్రి హరీశ్‌రావు పర్యటన
కరీంనగర్ : కరీంనగర్ మండలం ఖాజీపూర్, ఎలగందుల(గూడెం) గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాల్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం పర్యటించారు. రెండు గ్రామాల ప్రజల్లో మనోధైర్యం నింపారు. ఖాజీపూర్ శివారులో మానేరువాగు ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. రెండు గ్రామాలకు చెందిన ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా ఎలగందులలోని మోడల్ స్కూల్‌కు తరలించి పునరావాసం కల్పించారు. ఇళ్లల్లో ఉన్న విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఆ రెండు గ్రామాల్లో పోలీసులతో పహారా ఉంటుందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మిడ్‌మానేరుకు అధికంగా వస్తున్న వరద నీటితో ప్రమాదం పొంచి ఉందని ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడమే శ్రేయస్కరమని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్ వివరించారు. ఖాజీపూర్, ఎలగందుల(గూడెం)కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, తహసీల్దార్ జయచంద్రారెడ్డి, సర్పంచులు వెల్దండి ప్రకాశ్, మంద శేఖర్, ఆరె అనిల్‌కుమార్, వైస్ ఎంపీపీ నిమ్మల అంజయ్య, దావ కమల, ఆర్ఐ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.