హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించాలి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 22న జరగనున్న ఎంసెట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, హైటెక్ కాపీయింగ్ జరగకుండా చూడాలని ఎంసెట్ రాష్ట్ర కోకన్వీనర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ కూరపాటి ఈశ్వర్ప్రసాద్ సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మ సీ సెమినార్ హాల్లో ఆదివారం జరిగిన చీఫ్ సూపరిం టెండెంట్లు, పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందే అభ్యర్థులను అనుమతించాలని, నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా రానివ్వొద్దని సూచించారు.
ఇటీవల జరిగిన పలు పరీక్షల్లో హైటెక్ పద్ధతుల్లో కాపీ జరుగుతున్నట్లు తేలిందని. ఈ మేరకు ఎలాంటి అవకతవకలకు తావివ్వొద్దని ఆయన సూచించారు. విద్యార్థులను పరీక్ష మధ్యలో టాయిలెట్‌కు సైతం పంపించొద్దని, తప్పనిసరైతే సిబ్బందిని వెంట పంపించాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్ల నియామకంలో కూడా జాగ్రత్తలు పాటిం చాలని, పరీక్ష రాసే వారిలో బంధువులు ఉన్న పక్షంలో వారిని ఇన్విజిలేటర్లుగా నియమించొద్దని ఈశ్వర్ప్రసాద్ ఈ సందర్భంగా సూచించారు.
వరంగల్ రీజియన్‌లో 33 కేంద్రాలు..
ఈనెల 22న జరగనున్న ఎంసెట్ కోసం వరంగల్ రీజి యన్‌లో 33 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఈశ్వర్ప్రసాద్ వివరించారు. ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష 14,400 మంది రాయనుండగా.. 23 కేంద్రాలు, మెడిసిన్ పరీ క్షకు 6,800 మంది రాయనుండగా పది కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక పరిశీల కులను నియమించగా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వారికి సహకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎస్‌లు, పరిశీలకుల సందేహాలను నివృత్తి చేశారు.
జనగామలో..
జనగామ రూరల్ : జనగామ కేంద్రంగా ఎంసెట్ రెండోసారి నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంసెట్ రాష్ట్ర కోకన్వీనర్ ఈశ్వర్ప్రసాద్ సూచించారు. స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ శాఖల ఉద్యోగులకు ఎంసెట్‌పై సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సమావేశంలో ఈశ్వర్ప్రసాద్ మాట్లాడుతూ జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏకశిల డిగ్రీ కళాశాల, ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఏ సందేహమున్నా కన్వీనర్ దృష్టికి తీసుకువెళ్లాలని.. ఎలాంటి పొరపాట్లు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం రీజి నల్ కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేయగా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.రవిచందర్, ఎస్సై ఎం.కరుణాకర్, ట్రాన్స్‌కో ఏఈ ఎల్ల య్య, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.