మాకొద్దంటే మాకొద్దు
ఎంసెట్ కన్వీనర్ బాధ్యతలు తీసుకునేందుకు సీనియర్ ప్రొఫెసర్ల వెనుకంజ
ఇతర సెట్లదీ అదే పరిస్థితి
2016 ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో కొత్త కన్వీనర్ల ఎంపికలో జాగ్రత్తలపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2016 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్–2017 కన్వీనర్ బాధ్యతలు స్వీకరించేందుకు సీనియర్ ప్రొఫెసర్లే జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజీ ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. కష్టపడి పని చేసి, అభాసుపాలు కావడమెందుకన్న ధోరణి ప్రొఫెసర్లలో ఏర్పడింది. అందుకే ఈసారి ఎంసెట్ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు సీనియర్ ప్రొఫెసర్లు అంతగా సానుకూలత వ్యక్తం చేయడం లేదని తెలిసింది. ఎంసెట్‌ను నిర్వహించే జేఎన్టీయూహెచ్లోని ఏ ప్రొఫెసర్‌కు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలన్న విషయంలో వర్సిటీ కూడా తర్జనభర్జన పడుతోంది.
ఎంసెట్–2017 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూహెచ్కు అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఎంసెట్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించేందుకు ముగ్గురి పేర్లను జేఎన్టీయూహెచ్ ఉన్నత విద్యా మండలికి సిఫారసు చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో గతంలో ఎంసెట్‌ను నిర్వహించిన ప్రొఫెసర్లు, ఇతర ప్రొఫెసర్లతో జేఎన్టీయూ హెచ్ సంప్రదింపులు జరుపుతోంది. అయితే గతంలో కన్వీనర్లుగా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు, ప్రొఫెసర్ యాదయ్య ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది అయితే యూనివర్సిటీ మాత్రం వారిద్దరితోపాటు మరొకరి పేరును సిఫారసు చేసే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకటీ రెండు రోజుల్లో ఎంసెట్ కన్వీనర్ ఎవరన్న విషయంలో స్పష్టత రానుంది. మరోవైపు ఈసారి ఎంసెట్ నిర్వహణ విషయంలో గతంలో కంటే మరింత పకడ్బం దీ చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆ దిశగా యూనివర్సిటీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుత జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి ఎంసెట్–2017కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
ఈసారి సెట్స్‌కు కొత్త కన్వీనర్లే!
మరోవైపు ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. దీంతో మొత్తానికి ఈసారి సెట్స్‌కు పాత వారికంటే కొత్త కన్వీనర్లే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్, పీజీఈసెట్, పీఈసెట్‌కు కొత్త కన్వీనర్లే వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఎడ్‌సెట్ నిర్వహించిన ప్రొపెసర్ ప్రసాద్, పీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ ప్రభాకర్ రావు పదవీ విరమణ పొందారు. గత ఏడాది పీజీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ రామచంద్రం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అయ్యారు. దీంతో ఆ మూడు సెట్ల నిర్వహణ బాధ్యతలను కొత్తవారికే అప్పగించే అవకాశం ఉంది. కాకతీయ యూనివర్సిటీకి అప్పగించిన ఐసెట్, లాసెట్, పీజీలాసెట్‌ను గత ఏడాది నిర్వహించిన ప్రొఫెసర్ ఓంప్రకాశ్, ప్రొఫెసర్ రంగారావులకే అప్పగించే అవకాశం ఉంది.