కొత్త ‘ఆధార్ యంత్రాల’ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కొత్త భద్రతా ఫీచర్లు కలిగిన ఆధార్ ధ్రువీకరణ యంత్రాలను సమకూర్చుకునేందుకుగాను కంపెనీలకు యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మరో నాలుగు నెలల గడువిచ్చింది. అయితే ఆగస్టు 1 నుంచి కొత్త భద్రతా ఫీచర్లు లేని యంత్రాలతో ఆధార్‌ను ధ్రువీకరిస్తే ప్రతి లావాదేవీకీ 30 పైసల జరిమానా విధించనుంది.
ఆధార్ సమాచారానికి సంబంధించిన భద్రతను మరింత పెంచడంలో భాగంగా కొత్త ఎన్క్రిప్షన్ కీ ఉన్న యంత్రాలను మాత్రమే ధ్రువీకరణకు వాడేలా యూఐడీఏఐ చర్యలు తీసుకుంటోంది. ఎన్క్రిప్షన్ కీ లేని యంత్రాలను జూన్ 1 నుంచి ఆధార్ ధ్రువీకరణకు వాడకూడదని గతంలో యూఐడీఏఐ ఆదేశించింది. అయితే కంపెనీలకు, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ గడువును తాజాగా మరో నాలుగు నెలలు పొడిగించింది. సెప్టెంబరు 30 తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్క్రిప్షన్ కీ లేని యంత్రాలను ధ్రువీకరణకు ఉపయోగించేందుకు అంగీకరించమని యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే చెప్పారు.
అలాగే ఆగస్టు 1 నుంచి ఎన్క్రిప్షన్ కీ లేని యంత్రాలను ధ్రువీకరణకు ఉపయోగిస్తే ప్రతి లావాదేవీకి 30 పైసల జరిమానా విధిస్తామనీ, అయితే ఈ జరిమానా వినియోగదారులపై పడకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. అప్పుడే కంపెనీలు తయారీదారులపై ఒత్తిడి తెచ్చి వీలైనంత తొందరగా కొత్త ఎన్క్రిప్షన్ కీ ఉన్న యంత్రాలను సమకూర్చుకుంటాయని పాండే వివరించారు.