Energy Vault
-
3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్ భవనం!
అత్యంత ఎత్తయిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం కొత్తేమీ కాదు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, విల్లీస్ టవర్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటివి ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఇవన్నీ నివాసాలు, కార్యాలయాలే. వాటిని తలదన్నేలా 3,000 అడుగుల (914.4 మీటర్లు) ఎత్తయిన భవనాన్ని నిర్మించనున్నట్టు స్కిడ్మోర్, ఒవింగ్స్ అండ్ మెరిల్ (ఎస్ఓఎం) కంపెనీ ప్రకటించింది. నివాసానికే గాక విద్యుత్ నిల్వకు కూడా వీలు కల్పించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం విద్యుత్ స్టోరేజీ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలాగా ఇది పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. భవనం వెలుపలి భాగంలో అమర్చే ఫలకాల్లో విద్యుత్‌ను నిల్వ చేస్తారు. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. ఈ భవనాన్ని ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంక్రీట్ దిమ్మెలే.. బ్యాటరీలు!
ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది? భవన నిర్మాణం కోసం ఉంచిన కాంక్రీట్ దిమ్మెలు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే! ఎందుకంటే.. ఇవి స్విట్జర్లాండ్ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’ గతేడాది సిద్ధం చేసిన 8 మెగావాట్ల బ్యాటరీలు!! కాంక్రీట్‌తో బ్యాటరీ ఏమిటని అనుకోకండి. నిజానికి ఇది చాలా సింపుల్. ఎలాగంటే డ్యామ్‌లలో ఉన్న నీళ్లు వేగంగా కిందకు జారుతూ టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి అవడం మనకు తెలుసు కదా. ఇది కూడా అలాగే కాకపోతే ఒక్క చిన్న తేడా ఉంది. విద్యుత్‌కు రాత్రిపూట డిమాండ్ ఎక్కువగా ఉంటే సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా పగటిపూట ఎక్కువ విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ అదనపు విద్యుత్ సాయంతో ఒక్కో కాంక్రీట్ దిమ్మెను క్రేన్ల ద్వారా పైకి ఎత్తుతారు. ఒక క్రమంలో పేర్చుకుంటూ వస్తారు. రాత్రిపూట విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో దిమ్మెను కిందకు జారవిడిచి గతి శక్తిని కాస్తా విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఐడియా బాగుంది కదూ! ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చినా అన్ని అడ్డంకులను దాటుకొని వాణిజ్య స్థాయిలో ఓ టవర్‌ను ప్రారంభించేందుకు ‘ఎనర్జీ వాల్ట్’కు కొంత సమయం పట్టింది. చిత్రంలో ఉన్న ఏర్పాటు ద్వారా దాదాపు 8 మెగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేసుకోవచ్చు.