ఎర్రగడ్డలో 'ఛాతీ' వైద్యుల ధర్నా
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది మంగళవారం ఉదయం ధర్నా చేపట్టారు. నగర శివార్లలోని అనంతగిరికి ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను నిరసిస్తూ సిబ్బంది ధర్నాకు దిగారు. ఆస్పత్రి తరలింపును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం)ను ఎత్తివేసి.. దాని స్థానంలో మానసిక రోగుల చికిత్సాలయం, చాతి వైద్యశాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న మానసిక వికలాంగుల చికిత్సాలయం, ఛాతీ వైద్యశాలను అనంతగిరికి తరలించేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలుకు ఒకట్రెండు రోజుల్లో మోక్షం కలుగుతుందని, వారంరోజుల్లో దీనిపై ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రులను పెరేడ్ గ్రౌండ్‌కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించిన సంగతి తెలిసిందే.