establish
-
జనవరి 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ: సజ్జల
సాక్షి, అమరావతి: జనవరి 19న విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని బుధవారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఏ మూల నుంచి చూసినా రాజ్యాంగనిర్మాత అంబేడ్కర్ కనిపిస్తారని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ, సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేసినట్లు తెలిపారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమని పేర్కొన్నారు. భారతజాతి గురించి, మనదేశం గురించి చెప్పాలనుకున్నా మొదట చెప్పాల్సిన పేర్లలో అంబేడ్కర్ పేరు ఉంటుందన్నారు. అది ప్రతి రాజకీయనేత తలుచుకునే పేరన్నారు. అంబేడ్కర్‌ని ఓ సిద్ధాంతంగా తీసుకుని మనసావాచా నమ్మిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటులో వైఎస్ జగన్ సంకల్పం కనిపిస్తుందన్నారు. అంబేడ్కర్ ఎక్కడో ఊరిబయట కాదు.. నగరం నడిబొడ్డున ఉండాలని సీఎం జగన్ భావించారన్నారు. అదృష్టవశాత్తు విజయవాడ నగరం కూడా అందుకు చాలా సానుకూలమైందన్నారు. ప్రోగ్రెసివ్ ఆలోచనలకు పురిటిగడ్డ అయిన విజయవాడ రాజకీయపరమైన ఆలోచనలో అత్యంత అభ్యుదయకరమైన ఆలోచనలకు, స్వాతంత్ర పోరాటానికి యూనివర్సల్‌గా అన్నింటిని యాక్సెప్ట్ చేసిన నగరమని చెప్పారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి మాట్లాడుతూ రూ.400 కోట్లతో సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేయడం పెద్ద చరిత్ర సృష్టిస్తోందన్నారు. చంద్రబాబు ఎక్కడో ముళ్లకంపల్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే సీఎం జగన్ మాత్రం విజయవాడలో ఎంతో విలువైన స్థలంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దళితులను అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న సీఎం జగన్‌కి అందరూ అండగా నిలవాలన్నారు. దళితులంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. టీడీపీలోని ఎస్సీ లీడర్లు కూడా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో చేయాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి దళిత కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పేట, ప్రతి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ గురించి తెలియజేయాలని సూచించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం జగన్ ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. గతంలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు దళితులను మోసం చేశారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. దళితులంటే అసహ్యంగా భావిస్తారని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ప్రతి దళితుడు గర్వంగా ఫీలవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెట్టాలని సీఎం జగన్ గొప్ప ఆలోచన చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ దళితవర్గాలను పైకి తీసుకురావాలనేది సీఎం జగన్ దృఢసంకల్పమని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు నందిగం సురేష్, గురుమూర్తి, రెడ్డప్ప, ఎమ్మెల్సీలు ఇజ్రాయేల్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, పచ్చమీడియా కలసి ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని, విమర్శలను పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకత్వాలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు పేదరికాన్ని ఏ విధంగా తగ్గిస్తున్నాయి, రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతిపథంలోకి తీసుకెళ్తున్నాయనే విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం ద్వారాగానీ, ప్రెస్‌మీట్ నిర్వహించిగానీ ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని అరికట్టేవిధంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రస్థాయిలో పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ రాష్ట్ర బాధ్యులు, మంత్రులు మాట్లాడుతుంటారని, కిందిస్థాయిలో ఎస్సీ సెల్ నేతలు, జిల్లా బాధ్యులు చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని సూచించారు. ఎన్నికలు రానున్న తరుణంలో ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలన్నారు. మన ఇంట్లో పని సానుకూలం చేసుకునేందుకు ఓ సంకల్పంతో, పట్టుదలతో ఎలా పనిచేస్తామో.. అదేవిధంగా 2024లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు! ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచే పార్టీలో పోటీచేయాలని చాలామంది ఆశపడతారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టికెట్ల కోసం డిమాండ్ కూడా ఉంటుందన్నారు. నాయకులు ఎక్కువగా ఉన్నప్పుడు పోటీకి ఆశపడతారన్నారు. ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. తమ పార్టీ మంచి ఫామ్‌లో ఉంది కాబట్టే, పోటీచేయటానికి నాయకులు పెద్దసంఖ్యలో వస్తున్నారని తెలిపారు. అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారని చెప్పారు. ఎవరూ టికెట్లు అడగలేదు, డిమాండ్ లేదు.. అంటే ఆ పార్టీ ప్రజల మనసుల్లో లేనట్లేనన్నారు. నిరసనలు సాధారణమని పేర్కొన్నారు. టీడీపీ లాంటి ఎత్తిపోయిన పార్టీల్లో అయితే నిరసలు ఉండవని చెప్పారు. పోటీకి ఆశపడే వారితో మాట్లాడతామని, అందరిని ఒక తాటిపైకి తెస్తామని, అదేమీ పెద్ద విషయం కాదని ఆయన తెలిపారు. -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. -
ఏంటీ ఈ 'లిపి'..? గవర్నర్ సైతం.. 'వాహ్ శభాష్' అంటూ..
వరంగల్: ఏటా నిర్వహించే సైన్స్‌ఫేర్‌లో ఎవరూ చేయని అద్భుతాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఫిజికల్సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మడ్క మధు. అతడి దృఢ సంకల్పానికి విద్యార్థుల ఆసక్తి తోడైంది. దీంతో నోటితో మాట్లాడకుండా, చెవితో వినకుండా కళ్ల సైగలతో, చెవుల కదలికలతో మాట్లాడే ఓ లిపిని విద్యార్థులు, ఉపాధ్యాయుడు కలిసి తయారు చేశారు. విద్యార్థుల ప్రతిభను చూసి 'గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాహ్ శభాష్' అంటూ అభినందించారు. విద్యార్థుల్ని, టీచర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆకుతోట మల్లిక, సల్పాల దేవిక, ఆరెందుల రాజశేఖర్, మద్దిరాల శివ నవదీప్, సల్పాల నందిని, సల్పాల సంకీర్తన ‘ఐ’ కోడింగ్, ‘ఇయర్’ కోడింగ్‌లో ఉపాధ్యాయుడు మధు వద్ద శిక్షణ పొంది ప్రతిభ కనబరుస్తున్నారు. వీటితోపాటు గారడి, ఐబ్రోస్ (కనుబొమ్మలు)సైగలతో భావవ్యక్తీకరణ జరుపుతున్నారు. లిప్(పెదవు)ల మూవ్‌మెంట్‌ను బట్టి మాట్లాడింది చెప్పేస్తున్నారు. విద్యార్థులు వీటిపై మరింత శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే పాఠశాలలో 10 మందికి పైగా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయుడు మధు శిక్షణ ఇస్తున్నారు. ఏంటీ ఈ లిపి..? ‘ఐ’కోడింగ్ అంటే కను సైగలతో మాట్లాడడం. ఏ, బీ, సీ, డీ ఒక్కో అక్షరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వీటిని కనుసైగలతో వ్యక్తీకరిస్తారు. చెవుల కదలికలతో సైతం భావాల్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికీ ప్రత్యేకంగా ఓ లిపిని తయారు చేశారు. ఐ, ఇయర్ కోడింగ్ భాష దేశ రక్షణకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సీబీఐ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, రా ఇతర నిఘావర్గాలకు ఈ లిపి ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుడు మధు, విద్యార్థులు చెబుతున్నారు. ఒక పేపర్లో ఉన్నది చదివి విద్యార్థి నోటిని తెరవకుండా కళ్లు మూస్తూ.. తెరుస్తూ... మీదకు, కిందికి ఎగరేస్తూ.. చెవులను కదిలిస్తూ సైగలతో భావాల్ని వ్యక్తీకరిస్తే.. మరో విద్యార్థి ఆ సైగలు చూసి పొల్లుపోకుండా పేపర్‌పై రాసి చూపిస్తుంది. విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో ఏముందో చెబుతూ మంత్రాలు, తంత్రాలు లేవని గ్రామీణులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. దేశ రక్షణకు ఉపయోగం.. గవర్నర్ కితాబిచ్చారు.. ‘చెవులను కదిలించడం జంతువులకే సాధ్యం అలాంటిది మీరు చేస్తున్నారంటే గ్రేట్’ అని గవర్నర్ మేడమ్ కితాబిచ్చారు. మా టీచర్ల ప్రోత్సాహంతో బాగా శిక్షణ పొందుతున్నాం. మేం, మా భాష దేశ రక్షణకు ఉపయోగపడితే చాలు. పోలీస్ జాబ్ చేయాలనేది నా కోరిక. – శివ నవదీప్, ఎనిమిదో తరగతి మరిచిపోలేని అచీవ్మెంట్.. ఐ కోడింగ్ గురించి మా గైడ్ టీచర్ మధు చెప్పారు. ఆసక్తితో నేర్చుకున్నాను. ఈ భాషను భవిష్యత్‌లో దేశానికి ఉపయోగపడేలా సాధన చేస్తాం. గవర్నర్ మేడమ్ మమ్మల్ని మెచ్చుకోవడం మరిచిపోలేని అచీవ్మెంట్. – ఆకుతోట మల్లిక, పదో తరగతి ప్రపంచంలో ఎక్కడా లేని భాష.. సైన్స్‌ఫేర్‌లో కొత్తగా ఉండాలని ఐ, ఇయర్ కోడింగ్ రెండు ప్రత్యేక భాషలు ఎంచుకున్నా. దీనికి ప్రత్యేకంగా లిపిని తయారు చేశా. దీనికి మాప్రాంతంలో మంచి ఆదరణ వస్తోంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఈ భాష లేదని అనుకుంటున్నా. గవర్నర్‌ను విద్యార్థులతో కలవడం మరిచి పోలేం. విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దేశానికి ఉపయోగపడేలా చేయాలనేది నా లక్ష్యం. ఇంకా గారడి, ఐబ్రోస్, లిప్ మూవ్‌మెంట్‌పై సాధన జరుగుతోంది. – మడ్క మధు, ఫిజికల్సైన్స్ ఎస్ఏ, మహదేవపూర్ -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్.. 'గమ్యం' యాప్ తో..
వరంగల్: టీఎస్ ఆర్టీసీ.. ప్రయాణికుల ముంగిటకు మరో సాంకేతిక సహకారాన్ని తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన సంపూర్ణ సహకారం అందించే ‘గమ్యం వెహికిల్ ట్రాకింగ్’ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను శనివారం హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవాన్ని ప్రయాణికులు వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులో జీపీఎస్ పరికరాలు బిగించారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ ఆపై బస్సుల్లో మాత్రమే జీపీఎస్ సమాచారం అందుబాటులోకి వచ్చింది. త్వరలో పల్లె వెలుగు బస్సులకు కూడా ఈ సౌకర్యం విస్తరించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. ‘గమ్యం వెహికిల్ ట్రాకింగ్ యాప్’ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌తో బస్సుల సమయం, ఏఏ బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయో, బస్సు ఎక్కడికి వరకు వచ్చింది. బస్ స్టేషన్లు, బస్ స్టేజీల సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్రయాణికులకు ఎంతో దోహదపడుతుందని ఆర్టీసీ అధికారులు చెప్పారు. మహిళల రక్షణకు ప్రాధాన్యం.. మహిళల రక్షణకు యాప్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బస్ స్టేషన్లు, రూట్లు తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం గమ్యం యాప్‌లో ‘ఫ్లాగే బస్సు’ ఆనే ఆప్షన్ కూడా చేర్చారు. యాప్‌లోకి వెళ్లి ఫ్లాగే బస్ అనే చోట నొక్కితే (టచ్ చేస్తే) స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక కలర్ వస్తుంది. ఈ కలర్‌తో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను బస్సు ఎదుటగా చూపిస్తే డ్రైవర్ చూసి బస్సును నిలిపి మహిళలను ఎక్కించుకుంటారు. సమీపంలో ఉన్న బస్ స్టేజీలో దింపుతారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. -
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభ వేడుక..!
-
ఈజ్‌మైట్రిప్ ఫ్రాంచైజీ స్టోర్లు, బుకింగ్ ఈజీ
హైదరాబాద్: ఈజ్‌మైట్రిప్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఫ్రాంచైజీ విధానంలో కస్టమర్లకు ట్రావెల్, ఇతర బుకింగ్ సేవలు అందించనుంది. స్టోర్ల ద్వారా ఆఫ్‌లైన్ కస్టమర్లను చేరుకోగలమన్న విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ట్రావెల్ వ్యాపారంలోకి ప్రవేశించాలనే ఆసక్తితోపాటు, ధనికులైన క్లయింట్ల నెట్వర్క్, కస్టమర్లు, సొసైటీల నెట్వర్క్, అసోసియేషన్లతో సంబంధాలు కలిగిన వారు ఫ్రాంచైజీ ప్రారంభించొచ్చని సంస్థ తెలిపింది. అన్ని బుకింగ్ లావాదేవీలపై మెరుగైన కమీషన్ ఇస్తామని పేర్కొంది. రోజులో 24 గంటల పాటు సపోర్ట్ సేవలతో, మూడు, నాలుగు నెలల్లోనే లాభనష్టాల్లేని స్థితికి చేరుకునేందుకు సహకారం అందించనున్నట్టు తెలిపింది. ఈజ్‌మైట్రిప్ ద్వారా ఫ్లయిట్ల బుకింగ్, హోటల్ రూమ్‌లు, ఐఆర్సీటీసీ, క్యాబ్, బస్‌లు, క్రూయిజ్‌లు, చార్టర్ల సేవలు పొందొచ్చు. -
గంగపుత్రులకు బెంగలేదు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచడంతోపాటు సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలోనే దశాబ్దాల కాలంగా కేవలం మాటలకే పరిమితమైన పూడిమడిక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మొత్తంగా రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెదం తెలిపాయి. ఇందులో తొలిదశలో నాలుగు, మలిదశలో నాలుగు హార్బర్లను నెలకొల్పనున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక వద్ద ఫిషింగ్ హార్బర్‌ను మలిదశలోరూ.353.10కోట్ల నిధులతో ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నో ఏళ్ల కల.. ఇటు విశాఖ హార్బర్... అటు ఒడిశా పారాదీప్... మధ్యలో ఎక్కడా ఫిషింగ్ హార్బర్ లేదు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు హార్బర్ లేకపోవడంతో మత్స్యకారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తుపానులు, విపత్తులు వచ్చిన సందర్భాల్లో బోట్లు సురక్షిత హార్బర్‌కు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా ఫిషింగ్‌కు ఒడిశా వైపునకే వెళ్తుంటారు. మరోవైపు విశాఖలోనే దాదాపు 700కి పైగా మెకనైజ్డ్ బోట్లు, 3వేల ఫైబర్ బోట్లు, 400 చిన్న పడవలు ఉండటంతో ఇక్కడి హార్బర్ సామర్ధ్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉంది. కానీ ఇన్నేళ్లూ కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఐదు నెలల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ హార్బర్ ఏర్పాటు అనుకూలతలపై సర్వే చేపట్టింది. ఢిల్లీకి చెందిన వాప్కాస్ (వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ లిమిటెట్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పూడిమడకలో హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపి.. ఆ మేరకు కేంద్ర నిధులతో సంయుక్తంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భీమిలిలో జెట్టీ ఏర్పాటు అనుకూలతలపై సర్వే.. ఇక భీమిలి ప్రాంతంలో జెట్టీ నిర్మించేందుకు అనుకూలతలపై సర్వే చేయాలని ఇప్పటికే బెంగళూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ (బెంగళూరు) సంస్థకు మత్స్యశాఖ లేఖ రాసింది. ఆ ప్రాంతంలో సముద్రం లోతు, అలల ప్రభావం, ఇసుక తిన్నెల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి సదరు సంస్థ నివేదిక ఇవ్వాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ఈ జెట్టీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెప్పుకొచ్చారు. పోర్టు ఆధీనం నుంచి తప్పించాలి.. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ పోర్టు ఆధీనంలో నడుస్తోంది. హార్బర్లో ఉన్న 11 జెట్టీల్లో నిలిపి ఉంచే బోట్లకు ఏటా పోర్టు సొమ్ము వసూలు చేస్తుంది. వసూలు చేసిన సొమ్ముతో తగిన మౌలిక సదుపాయాల కల్పన, హార్బర్లోకి బోట్లు వచ్చేందుకు అనువుగా డ్రెడ్జింగ్ పనులు చేపట్టడం లేదు. మత్స్యశాఖ ఆధీనంలో ఉంటే తగిన విధంగా దీన్ని మలుచుకోవచ్చు. మత్స్యకారుల కష్టాలు తీరే అవకాశం ఉంది. – దూడ ధనరాజు, బోటు యజమాని మౌలిక సదుపాయాలు కల్పించాలి.. ఫిషింగ్ హార్బర్‌పై ఆధారపడి బతికే వారిలో వీధుల్లో తిరిగి చేపలు అమ్ముకునే మహిళలు అధికంగా ఉన్నారు. వీరికి తగిన మరుగు సదుపాయం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నూతన ఫిషింగ్ హార్బర్లలో మంచినీరు, మరుగుదొడ్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. – అల్లిపిల్లి అప్పలస్వామి, కలాసీ జట్టీ నిర్మాణం చేపడితే మేలు.. పూడిమడక తీరం నుంచి వెయ్యి పడవల్లో వేట సా గిస్తున్నాం. పడవల్ని రోజూ వేటకు తీసుకెళ్లాలంటే ఎనిమిది మంది కలాసీలు మోయాల్సి ఉంటుంది. కలాసీలకు అయ్యే ఖర్చు వేటకు భారంగా మారింది. జట్టీ నిర్మాణం చేపడితే మోత భారం ఉండదు. లంగరు వేసిన పడవల్ని ఇద్దరు తీసుకెళ్లి వేట చేయగలుగుతారు. – చింతకాయల కాసుబాబు, మత్స్యకారుడు, పూడిమడక 20 ఏళ్లుగా జట్టీ కావాలని అడుగుతున్నాం.. పూడిమడకలో జట్టీ నిర్మాణం చేపట్టాలని 20 ఏళ్లుగా అడుగుతున్నాం. తుపాను వచ్చిందంటే చాలు కంటిమీద కునుకు ఉండదు. సముద్రం ముందుకు వచ్చిన ప్రతిసారీ పడవల్ని భద్రపరుచుకోవడానికి అవస్థలు పడుతున్నాం. పడవల్ని భద్రపరుచుకోకపోతే ఒకదానికొకటి తాకి మరమ్మతులకు గురవుతున్నాయి. మోగకు వెళ్లే రహదారిని బాగుచేయాలి. – గనగళ్ల బాపయ్య, మత్స్యకారుడు, పూడిమడక పడవలు దెబ్బతింటున్నాయి ఇదివరకు చిన్నపడవలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు కోనాం, సూరల వేటకు పెద్దపడవల్ని వినియోగిస్తున్నాం. పడవని జరపడం ఇబ్బందిగా ఉంది. జట్టీ నిర్మిస్తే కలాసీల అవసరం లేకుండా వేటసాగుతుంది. సముద్రం కోతకు గురైనప్పుడు తీరంలో పడవలు దెబ్బతింటున్నాయి. జట్టీ నిర్మిస్తే సమస్యలన్నీ పోతాయి. – వాడముదుల అమ్మోరు, మత్స్యకారుడు, పూడిమడక త్వరలో సర్వే చేస్తాం.. పూడిమడకలో హార్బర్‌ను గ్రీన్ ప్రాజెక్ట్‌గా చేపడతాం. ఆ మేరకు త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలోనే మత్స్యశాఖ తరఫున పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు లేఖ కూడా రాశాం. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది –పి.కోటేశ్వరరావు, అడిషనల్ డైరెక్టర్, మత్స్యశాఖ శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది.. విశాఖ ఫిషింగ్ హార్బర్లో శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది. ప్రస్తుతం 3 టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగి ఏర్పాటు చేశారు. దీన్ని ఎండు చేపలు నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నారు. కనీసం 30 టన్నుల సామర్థ్యం గల గిడ్డంగి ఉంటే రొయ్యలు అధికంగా లభ్యం అయినప్పుడు ఇందులో నిల్వచేసుకుని ధర పలికినప్పుడు అమ్ముకోవచ్చు. గిడ్డంగి లేకపోవడం వల్ల రొయ్యలకు గిట్టుబాటు ధర లభ్యం కావడం లేదు. – బర్రి కొండబాబు, అధ్యక్షుడు, విశాఖ కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ -
ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి డిమాండ్
ఎన్నికల సమయంలో వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని టీడీపీ హీమీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 18న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జిల్లాకు రానున్న సందర్భంగా రాయలసీమకు న్యాయంగా రావాల్సిన సాగునీటి వాటాను కేటాయించటం, వైఎస్సార్ జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. -
ఏపీలో రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల రుణమాఫీ కోసం కేటాయించిన 5 వేల కోట్ల రూపాయలను కార్పొరేషన్‌కు బదలాయింపు చేసింది. ఈ నెల 22 నుంచి రైతు సాధికారిక కార్పొరేషన్ పనిచేయనుంది. -
జిల్లాలో మరిన్ని సెల్‌టవర్లు
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో మరిన్ని సెల్‌టవర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు కృషిచేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ జిల్లా టెలికాం జనరల్ మేనేజర్ ఎంఏ సిద్ధిఖీ తెలిపారు. సోమవారం‘న్యూస్‌లైన్’ తో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 2జీ సెల్‌టవర్లు 201 ఉన్నాయని, అదనంగా 2జీ సెల్‌టవర్లు 66 మంజూరైన ట్లు చెప్పారు. డిమాండు, సిగ్నల్ సక్రమంగా లేని ప్రాంతాలు, కనెక్షన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాలకు 3జీ సేవలు ... ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికే పరిమితమైన 3జీ సేవలు, ఇకపై కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్ పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలో 3జీ సెల్‌టవర్లు 18 ఉన్నాయని తెలిపారు. కొత్తగా 3జీ సెల్‌టవర్లు 36 మంజురైనట్లు ఆయన తెలిపారు. రీ కనెక్షన్ మేళాకు అపూర్వ స్పందన ... జిల్లావ్యాప్తంగా గత నెల 18 నుంచి నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ రీ కనె క్షన్ మేళాకు అపూర్వ స్పందన వచ్చిందని జీఎం తెలిపారు. కార్యక్రమంలో 62 బ్రాడ్‌బాండ్ కనెక్షన్లు, 743 ల్యాండ్‌లైన్ కనెక్షన్లు, 1200 మెబైల్ కనె క్షన్లు ఇవ్వటం జరిగిందన్నారు. సంస్థకు బకాయి పడ్డ వినియోగదారుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేయటం జరిగిందన్నారు. రీ కనెక్షన్ మేళాలు ప్రస్తుతం కస్టమర్ కేర్ సెంటర్లలో మరో 15 రోజుల పాటు పొడిగించటం జరిగిందని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు.