సాక్షి, అమరావతి: జనవరి 19న విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని బుధవారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఏ మూల నుంచి చూసినా రాజ్యాంగనిర్మాత అంబేడ్కర్ కనిపిస్తారని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ, సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేసినట్లు తెలిపారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమని పేర్కొన్నారు.
భారతజాతి గురించి, మనదేశం గురించి చెప్పాలనుకున్నా మొదట చెప్పాల్సిన పేర్లలో అంబేడ్కర్ పేరు ఉంటుందన్నారు. అది ప్రతి రాజకీయనేత తలుచుకునే పేరన్నారు. అంబేడ్కర్‌ని ఓ సిద్ధాంతంగా తీసుకుని మనసావాచా నమ్మిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటులో వైఎస్ జగన్ సంకల్పం కనిపిస్తుందన్నారు. అంబేడ్కర్ ఎక్కడో ఊరిబయట కాదు.. నగరం నడిబొడ్డున ఉండాలని సీఎం జగన్ భావించారన్నారు. అదృష్టవశాత్తు విజయవాడ నగరం కూడా అందుకు చాలా సానుకూలమైందన్నారు.
ప్రోగ్రెసివ్ ఆలోచనలకు పురిటిగడ్డ అయిన విజయవాడ రాజకీయపరమైన ఆలోచనలో అత్యంత అభ్యుదయకరమైన ఆలోచనలకు, స్వాతంత్ర పోరాటానికి యూనివర్సల్‌గా అన్నింటిని యాక్సెప్ట్ చేసిన నగరమని చెప్పారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి మాట్లాడుతూ రూ.400 కోట్లతో సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేయడం పెద్ద చరిత్ర సృష్టిస్తోందన్నారు. చంద్రబాబు ఎక్కడో ముళ్లకంపల్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే సీఎం జగన్ మాత్రం విజయవాడలో ఎంతో విలువైన స్థలంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
దళితులను అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న సీఎం జగన్‌కి అందరూ అండగా నిలవాలన్నారు. దళితులంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. టీడీపీలోని ఎస్సీ లీడర్లు కూడా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో చేయాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి దళిత కుటుంబాన్ని ఇన్‌వాల్వ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పేట, ప్రతి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ గురించి తెలియజేయాలని సూచించారు.
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం జగన్ ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. గతంలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు దళితులను మోసం చేశారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. దళితులంటే అసహ్యంగా భావిస్తారని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ప్రతి దళితుడు గర్వంగా ఫీలవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెట్టాలని సీఎం జగన్ గొప్ప ఆలోచన చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ దళితవర్గాలను పైకి తీసుకురావాలనేది సీఎం జగన్ దృఢసంకల్పమని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు నందిగం సురేష్, గురుమూర్తి, రెడ్డప్ప, ఎమ్మెల్సీలు ఇజ్రాయేల్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి..
చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, పచ్చమీడియా కలసి ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని, విమర్శలను పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకత్వాలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు పేదరికాన్ని ఏ విధంగా తగ్గిస్తున్నాయి, రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతిపథంలోకి తీసుకెళ్తున్నాయనే విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం ద్వారాగానీ, ప్రెస్‌మీట్ నిర్వహించిగానీ ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని అరికట్టేవిధంగా పనిచేయాలని కోరారు.
రాష్ట్రస్థాయిలో పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ రాష్ట్ర బాధ్యులు, మంత్రులు మాట్లాడుతుంటారని, కిందిస్థాయిలో ఎస్సీ సెల్ నేతలు, జిల్లా బాధ్యులు చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని సూచించారు. ఎన్నికలు రానున్న తరుణంలో ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలన్నారు. మన ఇంట్లో పని సానుకూలం చేసుకునేందుకు ఓ సంకల్పంతో, పట్టుదలతో ఎలా పనిచేస్తామో.. అదేవిధంగా 2024లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు.
అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు!
ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచే పార్టీలో పోటీచేయాలని చాలామంది ఆశపడతారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టికెట్ల కోసం డిమాండ్ కూడా ఉంటుందన్నారు. నాయకులు ఎక్కువగా ఉన్నప్పుడు పోటీకి ఆశపడతారన్నారు. ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. తమ పార్టీ మంచి ఫామ్‌లో ఉంది కాబట్టే, పోటీచేయటానికి నాయకులు పెద్దసంఖ్యలో వస్తున్నారని తెలిపారు.
అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారని చెప్పారు. ఎవరూ టికెట్లు అడగలేదు, డిమాండ్ లేదు.. అంటే ఆ పార్టీ ప్రజల మనసుల్లో లేనట్లేనన్నారు. నిరసనలు సాధారణమని పేర్కొన్నారు. టీడీపీ లాంటి ఎత్తిపోయిన పార్టీల్లో అయితే నిరసలు ఉండవని చెప్పారు. పోటీకి ఆశపడే వారితో మాట్లాడతామని, అందరిని ఒక తాటిపైకి తెస్తామని, అదేమీ పెద్ద విషయం కాదని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment